భీమా పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది : గోపీచంద్

భీమా పాత్ర  ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది : గోపీచంద్

మహాశివరాత్రికి ‘భీమా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు గోపీచంద్. ఎ.హర్ష దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించారు. ఈనెల 8న సినిమా విడుదలవుతున్న సందర్భంగా గోపీచంద్ చిత్ర విశేషాల గురించి ఇలా ముచ్చటించారు. 

‘‘దర్శకుడు హర్ష చెప్పిన కథలో హీరో క్యారైక్టరైజేషన్, కథలోని సెమీ ఫాంటసీ ఎలిమెంట్‌‌ చాలా నచ్చడంతో ఈ సినిమాకు ఓకే చెప్పాను. ఇదొక కమర్షియల్‌‌ ప్యాక్డ్‌‌ సినిమా. నా పాత్రలో ఇంటెన్సిటీ ఉంటుంది. అలాగే లవ్, రొమాన్స్, ఎమోషన్స్ లాంటివన్నీ ఉన్నాయి. గతంలో మూడు సినిమాల్లో పోలీస్‌‌ క్యారెక్టర్స్ చేశాను. వాటికి  పూర్తి వైవిధ్యమైన పాత్రను ఇందులో పోషించా. పోలీస్ క్యారెక్టర్‌‌‌‌లోని యాక్షన్‌‌, కథలోని ఫాంటసీ ఎలిమెంట్‌‌ను దర్శకుడు పర్ఫెక్ట్‌‌గా బ్లెండ్‌‌ చేశాడు. 

ప్రతీ యాక్షన్‌‌ సీన్‌‌కు తగ్గట్టుగా ఎమోషన్‌‌ ఉంటుంది. అది ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమా చూసి బయటికి వచ్చిన ప్రేక్షకుల మనసులో ‘భీమా’ పాత్ర గుర్తుండిపోతుందనే నమ్మకం ఉంది. ట్రైలర్ చూసిన కొందరు ‘అఖండ’తో పోల్చుతున్నారు... అదీ మంచిదేగా (నవ్వుతూ). అఘోరాలు, కలర్ పాలెట్, మ్యూజిక్ వలన అలా అనిపించవచ్చు. కానీ ఆ చిత్రంతో దీనికి పోలికలు లేవు. హర్ష ఆసక్తికరమైన స్క్రీన్‌‌ ప్లేతో గ్రిప్పింగ్‌‌గా తీశాడు. కథలో మలుపులు చాలా కొత్తగా ఉంటాయి. 

ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ  పాత్రలు సినిమాకు ఎంతో కీలకంగా ఉంటాయి. రవి బస్రూర్‌‌‌‌ మ్యూజిక్‌‌ ట్రైలర్‌‌‌‌లో విన్నారు. అంతకు మించి సినిమాలో ఉంటుంది. ‘పంతం’ తర్వాత నిర్మాత రాధామోహన్ గారితో నాకిది రెండో సినిమా. మేమిద్దరం ఫ్రెండ్లీగా ఉంటాం. చాలా గ్రాండ్‌‌గా ఈ చిత్రాన్ని ఆయన నిర్మించారు.  ప్రభాస్‌‌, నేను కలిసి సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. ఎప్పుడు ఆ సమయం వస్తుందో తెలీదు. కానీ తప్పకుండా చేస్తాం.  ఇక శ్రీను వైట్ల గారితో చేస్తున్న సినిమా ముఫ్ఫై శాతం పూర్తయింది. తర్వాత బీవీఎస్‌‌ఎన్‌‌ ప్రసాద్ నిర్మాణంలో  ఒక సినిమా ఉండనుంది. అలాగే రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌‌లో ఓ సినిమా ఉంటుంది. స్టోరీ వర్క్ జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది’’.