నవ్విస్తూ సర్‌‌‌‌ప్రైజ్ చేసే ఫంకీ

నవ్విస్తూ  సర్‌‌‌‌ప్రైజ్ చేసే  ఫంకీ

జాతిరత్నాలు’ చిత్రంతో  ప్రేక్షకుల చేత నవ్వులు పూయించి  దర్శకుడిగా మంచి ఫేమ్ తెచ్చుకున్న  కేవీ అనుదీప్..  ఇప్పుడు ‘ఫంకీ’తో మరోసారి థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తానంటున్నాడు. విశ్వక్‌‌సేన్, కయాదు లోహర్ జంటగా తను రూపొందించిన ఈ చిత్రాన్ని  సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఫిబ్రవరి 13న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనుదీప్ చెప్పిన విశేషాలు. 

‘‘టైటిల్ వినడానికి క్యాచీగా ఉంటుందని దీన్ని ఫిక్స్ చేశాం.  హీరో పాత్రకు కూడా ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుంది. ఇందులో విశ్వక్‌‌సేన్  ఒక సినిమా దర్శకుడి పాత్రలో కనిపిస్తారు.  ఈ పాత్రను రాసుకున్నప్పుడే విశ్వక్ అయితే బాగుంటారు అనిపించింది. ‘ఈ నగరానికి ఏమైంది’  సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ బాగుంటుంది.  ఇది అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ,  ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్.  ఇందులో దర్శకుల జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనలను సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా సరదాగా చూపించడం జరిగింది. అలాగే ప్రేమ కథతో పాటు కుటుంబానికి సంబంధించిన మంచి భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉంటాయి. నిజ జీవితంలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సీన్స్ ఉంటాయి. 

  నా సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, లాజిక్ ఉండదని  అనిపించవచ్చు. కానీ అన్ని సినిమాల్లో లాజిక్ ఉంటుంది. ట్రైలర్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అందులో కామెడీని మాత్రమే చూపించాం. కొన్ని సర్‌‌‌‌ప్రైజ్‌‌లు కూడా ఉంటాయి. అలాగే నాతోపాటు దర్శకులు హరీష్ శంకర్, కళ్యాణ్ శంకర్, నిర్మాతలు దిల్ రాజు, నాగవంశీ అతిథి పాత్రల్లో కనిపిస్తారు. భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన సంగీతం అందించారు.  ఆయనతో  వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్‌‌గా ఉంది.  ఎప్పుడూ అందుబాటులో ఉంటూ క్షణాల్లో ట్యూన్స్ ఇస్తారు.   ఇక ప్రస్తుతం  ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ కథ రాస్తున్నా.  అలాగే, వెంకటేష్ గారి కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నా’’.