రూ.30కే చికెన్ మీల్స్: భారీ జనంతో రోడ్లు బ్లాక్

రూ.30కే చికెన్ మీల్స్: భారీ జనంతో రోడ్లు బ్లాక్

కేవలం 30 రూపాయలకే చికెన్ మీల్స్.. ఈ మాటతోనే నాన్‌వెజ్ ప్రియులకు నోరూరించేస్తుందేమో!! ఇది సాధ్యమేనా? అన్న ఓ చిన్న డౌట్ కూడా వస్తుంది. మామూలుగా అయితే కష్టమేనేమో గానీ, కరోనా వైరస్ దీన్ని నిజం చేసింది.

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ కంటే వేగంగా పుకార్లు అన్ని చోట్లా వ్యాపించాయి. చికెన్, మటన్, ఫిష్ ఇలా నాన్ వెజ్ ఏం తిన్నా వైరస్ సోకుతుందని పుకార్లు హల్ చల్ చేశాయి. దీంతో పౌల్ట్రీ రంగంపై పెద్ద దెబ్బపడింది. మన దేశంలో చికెన్ అమ్మకాలు భారీగా తగ్గిపోవడంతో ఆ రంగంపై ఆధారపడిన వాళ్లు ఆందోళనలో పడిపోయారు. దీంతో అనేక సిటీల్లో చికెన్ మేళాలను నిర్వహిస్తూ వదంతుల భయాన్ని పొగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లోనూ చికెన్ ఫెస్ట్ జరిగింది. అందులో కేటీఆర్ సహా పలువురు మంత్రులు కూడా పాల్గొని.. చికెన్ తింటే కరోనా వస్తుందన్న వార్తలు నమ్మొద్దని పిలుపునిచ్చారు.

రూ.30కే అనడంతో భారీ క్యూ

నిన్న యూపీలోని గోరఖ్‌పూర్‌లోనూ చికెన్ మేళా నిర్వహించింది పౌల్ట్రీ ఫామ్ అసోసియేషన్. దీని గురించి భారీగా ప్రచారం కూడా చేసింది. చికెన్ తింటే కరోనా వస్తుందన్న పుకార్లను నమ్మొద్దని, రూ.30కే చికెన్ మీల్స్ ఎంజాయ్ చేయాలని పిలుపునిచ్చామని చెప్పారు అసోసియేషన్ ప్రెసిడెంట్ వినీత్ సింగ్. ప్రయాణాలు చేసే వారికి ఆకలి తీర్చినట్లుగా ఉంటుందని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఈ ఫెస్ట్ పెట్టామన్నారు. కొద్దిసేపటికే భారీగా జనం క్యూ కట్టారని, దాదాపు మూడు గంటల పాటూ అటుగా వచ్చే రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయని తెలిపారు. వెయ్యి కిలోలకు పైగా చికెన్ వండగా.. కొద్ది గంటల్లోనే మొత్తం ఖాళీ అయిందని చెప్పారు.