ఖమ్మం టౌన్, వెలుగు: పట్టిన ఎర్ర జెండాను ప్రాణం ఉన్న వరకు గద్దరన్న వదలలేదని, గద్దరన్న తమకు బతుకు పాట నేర్పారని కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న చెప్పారు. ఖమ్మం సిటీలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో దేవిరెడ్డి విజయ్ అధ్యక్షతన ప్రజా యుద్ధ నౌక గద్దర్, లౌకిక ప్రజాస్వామికవాది జహీర్ అలీ ఖాన్ సంస్మరణ సభ శుక్రవారం జరిగింది. ఈ ప్రోగ్రాంకు చీఫ్ గెస్ట్లుగా కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, జయరాజు, విమలక్క, నాగన్న తదితరులు హాజరయ్యారు. మొదటగా సంస్మరణ సభలో గద్దర్, జహీర్ అలీఖాన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
అంతకుముందు అరుణోదయ ప్రజానాట్యమండలి, సాంస్కృతిక సారథి, జానపద కళా సాంస్కృతిక సంస్థలు డప్పు కోలాట ఆటలతో మయూరి సెంటర్ నుంచి భక్తరామదాసు కళాక్షేత్రం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. గద్దరన్నలో, తనలో కమ్యూనిజం ఎప్పటికీ బతికే ఉంటుందన్నారు. విమలక్క మాట్లాడుతూ.. గద్దర్ పాటకు మరణం లేదన్నారు. జహీర్ అలీఖాన్ హక్కుల కోసం పోరాడారని తెలిపారు. గద్దర్ కూతురు వెన్నెల ఫోన్లో మాట్లాడుతూ.. నిశబ్ద విప్లవం(ఓటు హక్కు)తో గెలవాలని గద్దర్ కోరుకున్నారన్నారు.
కార్యక్రమంలో కాకి భాస్కర్, యశ్ పాల్, సాకి, యోచన, డాక్టర్ గోపినాథ్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హేమంతారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్రావు, ఆవునూరి మధు, ఎం.గిరి, చిర్ర రవి తదితరులు పాల్గొన్నారు.

