ఎమ్మెల్యే రాజాసింగ్ చర్లపల్లి జైలుకు తరలింపు

ఎమ్మెల్యే రాజాసింగ్ చర్లపల్లి జైలుకు తరలింపు
  • తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్
  • మంగళ్హాట్ పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో రాజాసింగ్పై రౌడీ షీట్
  • 2004 నుండి 101 కేసుల్లో నిందితుడిగా ఎమ్మెల్యే రాజాసింగ్
  • మతపరమైన 18 కేసుల్లో రాజాసింగ్ నిందితుడు
  • రాజాసింగ్ ఏడాది వరకు జైలుకే పరిమితం అయ్యే ఛాన్స్


హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. భారీ భద్రత నడుమ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. గత ఫిబ్రవరిలో యూపీ ఎన్నికల సందర్భంగా అలాగే ఏప్రిల్ నెలలో శ్రీరామ నవమి సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై మంగళ్ హాట్, షాయినాత్ గంజ్ పీఎస్ లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి పోలీసులు తాజాగా 41 (A) సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. తనను నగర బహిష్కరణ చేయాలని ప్లాన్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తూ రాజాసింగ్ సెల్ఫీ వీడియో విడుదల చేసిన కాసేపటికే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్ట్ వార్త తెలిసి కార్యకర్తలు, అభిమానులు రాజాసింగ్ ఇంటికి భారీగా చేరుకోవడంతో హై టెన్షన్ ఏర్పడింది.  


రాజాసింగ్ ఏడాది వరకు జైలులోనే..?

ఎమ్మెల్యే రాజాసింగ్పై పోలీసులు తాజాగా పీడీ యాక్ట్ నమోదు చేశారు. 2004 నుంచి ఇప్పటి వరకు 101 కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నాడు. పలు స్టేషన్లలో నమోదైన 18 కమ్యూనల్ కేసులు కూడా అందులో ఉన్నాయి. మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో గతంలో నమోదైన కేసులో రాజాసింగ్ పై రౌడీ షీట్ ఉంది. పదే పదే ఒకే తరహా నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పీడీ యాక్ట్ నమోదుచేస్తారు. పీడీ యాక్ట్ నమోదైతే ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ కింద ఏడాది పాటు జైలులోనే పెట్టే అవకాశముంది. ప్రభుత్వానికి ఉన్న విచక్షణాధికారంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత పీడీ యాక్ట్ జీవో తీసుకొచ్చారు. పీడీ యాక్ట్ నమోదుచేసి నేరుగా జైలుకు తరలించే అధికారం పోలీసులకు ఉంటుంది. దాన్ని సవాల్ చేయాలంటే పీడీ యాక్ట్ రివోక్ చేసేందుకు హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. పీడీ యాక్ట్ పెట్టిన విధానం కరెక్టుగా ఉందా లేదా అన్న అంశంపై అతని కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించవచ్చు. రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదుచేయడం ఇదే తొలిసారి.

నా వీడియో రిలీజ్ కు కారణం మునావర్ ఫారూఖీ

సిటీలో మునావర్ ఫారూఖీ ప్రోగ్రామ్ జరగటానికి కారణం టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలేనని సెల్ఫీ వీడియోలో ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. తాను వీడియో రిలీజ్ చేయడానికి కారణం మునావర్ ఫారూఖీనే అని స్పష్టం చేశారు. తాను కోర్టు ఆదేశాలు పాటించే వ్యక్తినని.. మహమ్మద్ ప్రవక్తపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. హిందూ ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటే.. అందుకు కారణం ఎంఐఎం నేతలేనని రాజాసింగ్ ఆరోపించారు.