
- అమిత్ షా చెబితే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్త
- హిందూ ధర్మం కోసం దేశమంతా తిరుగుతా
- ‘వీ6 వెలుగు’ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే రాజాసింగ్
.హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీలో గ్రూపిజం ఖతమైతేనే పార్టీ అధికారంలోకి వస్తుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టిపెడితే వచ్చేసారి బీజేపీ గవర్నమెంట్ 200 శాతం రావొచ్చని చెప్పారు. బీజేపీలో కొంతమంది వల్లనే చాలామంది కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని, ఎన్ని రోజులకైనా పాత ఇనుప సామానును అమ్మాల్సిందేనని సీనియర్ నేతలను ఉద్దేశించి అన్నారు. ఇక్కడి నేతలు చెప్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యనని, అమిత్ షా చెబితే వెంటనే రాజీనామా చేస్తానని తెలిపారు. తనపై కొందరు హైకమాండ్‌కు తప్పుడు మాటలు చెప్పి, రాజీనామా ఆమోదించేలా చేశారన్నారు. ‘‘రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా హిందూ ధర్మం కోసం తిరుగుతాను. హిందూ దేశంగా చేయాలనే డిమాండ్ తీసుకొస్తాను. బీజేపీని గెలిపిస్తే భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తామని పార్టీ మేనిఫెస్టోలో పెట్టే విధంగా మూమెంట్ తీసుకొస్తాను”అని చెప్పారు. ‘వీ6 వెలుగు’కు రాజాసింగ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రశ్న: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి, ఎమ్మెల్యే రాజాసింగ్‌కి తేడా ఏంటి?
రాజాసింగ్: కొంతమందికి ఈ తేడా కనిపించవచ్చు. కానీ నాకైతే ఏ తేడా కనిపించదు. ఎందుకంటే మేం ప్రధాని మోదీకి పెద్ద ఫ్యాన్స్. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని నాలాంటి చాలామంది కార్యకర్తలు కోరుకుంటున్నారు. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ రోజు కాకపోతే రేపైనా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని నేను నమ్ముతున్నాను.
ప్రశ్న: సీఎం రేవంత్ రెడ్డి గోసంరక్షణ, గోశాలల విషయంలో యోగి స్టైల్‌లో పోతున్నారా?
రాజా సింగ్: కాంగ్రెస్ ప్రభుత్వాలు గోసంరక్షణపై దృష్టిపెట్టవు. కానీ రేవంత్.. యూపీ సీఎం యోగిలా ఆలోచిస్తున్నారు. మోడల్ గోశాలలు కడతామని ప్రకటించిన రోజే సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు చెప్పాను. అది చాలా మంచి నిర్ణయం. గోసంరక్షణ కోసం ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయాలని, అందులో మాలాంటి వాళ్లకు సభ్యత్వం ఇవ్వాలని కోరాను.
ప్రశ్న: ఇతర పార్టీల నుంచి వచ్చిన పెద్ద నాయకులు కూడా బీజేపీ నుంచి వెళ్లిపోయారు కదా?
రాజా సింగ్: అవును.. అలా వెళ్లిపోయినవాళ్లు చాలామంది ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఒకాయన ఎమ్మెల్యే అయ్యాడు.. ఒకరు మినిస్టర్ అయ్యారు.. ఒకరు ఎమ్మెల్సీ అయ్యారు. నేను స్టేట్ ఆఫీస్‌కి వెళ్లి.. నాకు అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని కోరాను. అప్పుడు కొంతమంది పెద్దవాళ్లు.. “అది ఏకగ్రీవం చేస్తున్నాం.. ఎవరూ నామినేషన్ వేయకూడదు”అన్నారు. బీజేపీ అంటే ప్రజల పార్టీ అంటారు కదా? మరి గ్రూపిజం ఎందుకు చేస్తున్నారు? అని వాళ్లను ప్రశ్నించాను. కొంతమంది పోస్టుల కోసం ఆశపడి ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడలేదు. నాకు ఎప్పుడూ పదవి మీద ఆశ లేదు. కానీ నిజం చెప్పే ధైర్యం నాకు ఉంది.
ప్రశ్న: కిషన్ రెడ్డితో మీకు డైరెక్ట్‌గా గొడవలు ఎందుకు?
రాజాసింగ్: “నేను ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నాను, 2023 ఎన్నికల్లో పోటీ చేయను”అని బండి సంజయ్‌కి చెప్పా. అప్పుడు ఆయన, కిషన్ రెడ్డి.. ‘నువ్వు ఎన్నికల్లో పోటీ చెయ్.. మేం ఉన్నాం కదా’అన్నారు. వాళ్ల భరోసాతోనే ఎన్నికలకు వెళ్లాను. ఎన్నికల్లో పార్టీ ఫండ్ అందరికీ ఇచ్చారు. కానీ నన్ను మాత్రం సర్దుబాటు చేసుకొమ్మని చెప్పారు. బయట నుంచి లోన్ తీసుకుని ఎన్నికలకు వెళ్లాను. ఎన్నికలు అయిపోయాక డబ్బులు అడిగితే... ఢిల్లీ పెద్దవాళ్లతో మాట్లాడుతున్నామంటూ దాటవేశారు. వాళ్ల ఇంటి చుట్టూ వందల సార్లు తిరిగాను. చివరికి చేతులెత్తేశారు.
మీ రాజీనామా ఆవేశంతో చేసిందా?
రాజాసింగ్: అది ఆవేశం అనుకుంటే.. మీ ఇష్టం. కానీ నేను 11 ఏండ్లు బీజేపీలో ఉండి చాలా కష్టపడ్డాను. నాలాంటి కార్యకర్తలు, సీనియర్ నాయకులు కూడా బీజేపీ ప్రభుత్వం రావాలని పని చేశారు. ఇప్పుడు మా కళ్ల ముందే పార్టీ మునిగిపోతుంటే ఎలా చూస్తూ ఉంటాం? మా పడవ మునిగిపోతుంటే దాన్ని పైకి లేపడానికి ప్రయత్నించాను. కానీ నా వల్ల కాలే.. నన్ను కొందరు నాయకులు చాలా ఇబ్బందులు పెట్టారు. నా సెగ్మెంట్ విషయాల్లో ఇతర నాయకులు జోక్యం చేసుకున్నారు. ప్రతిసారీ నాకు పార్టీలో అవమానమే జరిగింది.