
- ఇద్దరం రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా
- పోటీ చేద్దాం.. ఎవరు గెలుస్తరో చూద్దాం
- గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్
- నన్ను రాజీనామా చేయాలని అడగడానికి మీరెవరు? ఏం చేస్కుంటరో చేస్కోండి.. రాష్ట్రంలో పవర్లోకి రావాల్సిన బీజేపీని పడుకోబెట్టారు
- రాంచందర్‌రావు.. ఓ రబ్బర్ స్టాంప్
- నేను ఫైటర్‌ను.. పార్టీ కార్యకర్తల గొంతుకగా మాట్లాడుతున్న
- కొత్త కమిటీతో పార్టీ మరింత నాశనం అవుతుంది
- హైకమాండ్ పిలిస్తే వెళ్లి ఏం జరుగుతున్నదో చెప్పడానికి రెడీ అని ప్రకటన
హైదరాబాద్, వెలుగు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని సవాల్ విసిరారు. ‘‘కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి.. నేనూ చేస్తా. సికింద్రాబాద్ నుంచి నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్త. గోషామహల్ నుంచి ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలి. అప్పుడు ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తరో చూసుకుందాం” అని అన్నారు.
తాను ఫైటర్ని అని.. బీజేపీ కార్యకర్తల గొంతుకగానే మాట్లాడుతానని చెప్పారు. బీజేపీ కొత్తగా ప్రకటించిన స్టేట్ కమిటీపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో అసంతృప్తి ఉందన్నారు. ఆ కమిటీతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదని, ఒక వేళ వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చాలెంజ్ చేశారు.
బుధవారం (సెప్టెంబర్ 10) మీడియాతో రాజాసింగ్ మాట్లాడారు. ‘‘కొత్తగా ప్రకటించిన బీజేపీ కమిటీని పార్టీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు వేశారా.. లేక కిషన్ రెడ్డి వేశారా చెప్పాలి? ఈ కమిటీతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? పార్టీని నాశనం చేసేందుకే కమిటీని వేశారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామా కోసం కిషన్‌రెడ్డి ఎపిసోడ్‌ను నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాంచందర్‌రావు మంచి మనిషేనని.. కానీ రబ్బర్ స్టాంప్‌గా మారిపోయారని విమర్శించారు. రాంచందర్‌రావు వెనుక ఎవరున్నారో తేలాలన్నారు. ‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు రబ్బర్ స్టాంప్‌గా మారొద్దు” అని ఆయన సూచించారు.
సికింద్రాబాదే కావాల్నా.. రూరల్ వద్దా?
బీజేపీ కొత్త కమిటీలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే 10 నుంచి 12 మందికి అవకాశం కల్పించారని రాజాసింగ్ ఫైర్ అయ్యారు. మరి రూరల్ ఏరియా నుంచి ఎంతమందికి కమిటీలో అవకాశం ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ‘‘సికింద్రాబాదే కావాలా.. రూరల్ అవసరం లేదా? మీరు ఏది అనుకుంటే అదే చేస్తరా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నాకు బీజేపీ ఎలాంటి సహకారం అందించకపోయినా, గోషామహల్ ప్రజలు నన్ను గెలిపించారు.
నేను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచింది బీజేపీ కార్యకర్తల వల్లే. మళ్లీ నాలుగోసారి పోటీ చేస్తే కూడా వాళ్లే గెలిపిస్తారు” అని పేర్కొన్నారు. తాను ఒక ఫైట ర్‌నని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా.. పార్టీని పడుకోబెట్టారని ఆయన మండిపడ్డారు. ‘‘నా రాజీనామా గురించి మాట్లాడేందుకు వాళ్లెవరు..? నేను రాజీనామా చేయను.. ఏం చేసుకుంటరో చేస్కోండి” అని రాజాసింగ్ ఘాటుగా స్పందించారు. కిషన్‌రెడ్డి రాజీనామా చేయాలని.. తాను చేస్తానని.. ఇద్దరం కలిసి ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దామని సవాల్ చేశారు.
సర్వనాశనం చేస్తున్నదెవరో మళ్లీ చెప్త
తాను పదవులను ఆశించే వ్యక్తిని కాదని, పార్టీలో ఎప్పుడూ ఎలాంటి పదవిని ఆశించలేదని రాజాసింగ్ తెలిపారు. ‘‘బీజేపీలో అనేక తప్పులు జరుగుతున్నాయి. కొత్త కమిటీతో పార్టీ అధికారంలోకి రాదు. పార్టీని సర్వనాశనం చేస్తున్నది ఎవరో మరోసారి చెప్త” అని అన్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, వారంతా ఇప్పుడు తనకు మద్దతు పలుకుతున్నారని తెలిపారు.
కొలువుల పేరుతో అశోక్ వేముల మోసం
బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవి పొందిన అశోక్ వేము ల.. ఎయిమ్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రూ.2 లక్షలు తీసుకొని మోసం చేశారని.. దీన్ని ఆయన కార్యకర్తలే చెప్తున్నారని రాజాసింగ్ అన్నారు. ఈ మోసంపై ప్రశ్నించినందుకు ఏబీవీపీ నేతలపై కేసులు పెట్టించిన చరిత్ర అశోక్దని ఆరోపించారు. ‘‘రాష్ట్ర బీజేపీలో అనేక తప్పులు జరుగుతున్నాయి.
ఢిల్లీ నుంచి పిలుపు వస్తే నేను అక్కడికి వెళ్లి.. ఇక్కడ పార్టీకి జరుగుతున్న అన్యాయం గురించి జాతీయ నాయకులకు చెప్తాను. పార్టీలో పనిచేసే వారికి పదవులు ఇవ్వాలని కోరుతున్నాను. పార్టీకి అన్యాయం చేసిన వారిపై తప్పకుండా చర్యలుండాలి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ పార్టీని పడుకోబెట్టారు. నేను బీజేపీ కార్యక ర్తల గొంతుకగా మాట్లాడుతున్నాను. ఎప్పటికీ ఏక్ నిరంజన్నే” అని రాజాసింగ్ పేర్కొన్నారు.