జీవోలను వెబ్​సైట్​లో  ఎందుకు  పెట్టట్లే?

జీవోలను వెబ్​సైట్​లో  ఎందుకు  పెట్టట్లే?

జారీ చేసిన 24 గంటల్లో సైట్లో పెట్టాలె: హైకోర్టు
 దళితబంధు పంపిణీపై దాఖలైన పిల్‌ విచారణ సందర్భంగా కామెంట్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను 24 గంటల్లోగా వెబ్‌‌సైట్‌‌లో ఉంచా లని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ప్రతి డిపార్ట్‌‌మెంట్‌‌ ఇచ్చే జీవోలను వెబ్‌‌సైట్‌‌లో పొందుపరిస్తేనే పాదర్శకత ఉంటుందని చెప్పింది. లేకపోతే అనేక అనుమానాలకు ప్రభుత్వమే ఆస్కారం ఇచ్చినట్లు అవుతుందని తప్పుబట్టింది. శాఖల వారీగా జీవోలను వెబ్‌‌సైట్‌‌ లో ఎందుకు పెట్టడం లేదో చె ప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  చీఫ్‌‌ జస్టిస్‌‌ హిమాకోహ్లీ, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌ రెడ్డిల డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

యాదాద్రి జిల్లా వాసాలమర్రిలోని 76 కుటుంబాలకు దళిత బంధు స్కీం కింద రూ.10 లక్షలు చొప్పున బదిలీ చేయడాన్ని ప్రశ్నిస్తూ ‘వాచ్‌‌ వాయిస్‌‌ ఆఫ్‌‌ ది పీపుల్‌‌’ అనే సంస్థ పిల్‌‌ వేసింది. దీనిపై బెంచ్ విచారణ జరిపింది. ఎలాంటి గైడ్‌‌లైన్స్‌‌ లేకుండా, స్కీం పొందేందుకు ఉన్న అర్హతలు ఏంటో తేల్చకుండా ప్రభుత్వం దళితబంధు పేరుతో నిధులను విడుదల చేసిందని పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది శశికిరణ్‌‌ వాదించారు. దీనికి ఏజీ బీఎస్‌‌ ప్రసాద్‌‌ స్పందిస్తూ.. దళితబంధు పథకాన్ని మార్చి 17న ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు. వాసాలమర్రిలోని దళితులకే కాకుండా రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాలకూ ఈ స్కీం అమలు చేస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన గైడ్‌‌లైన్స్‌‌ ఉన్నాయని, జీవోను జులై 8న జారీ చేశారన్నారు. జోక్యం చేసుకున్న కోర్టు.. జీవో వచ్చినప్పుడు, గైడ్‌‌లైన్స్‌‌ కూడా ఉన్నప్పుడు పిల్‌‌ ఎందుకని పిటిషనర్‌‌ను ప్రశ్నించింది. పిటిషనర్‌‌ లాయర్‌‌ స్పందిస్తూ.. జీవోను వెబ్‌‌సైట్‌‌లో పెట్టలేదని, గైడ్‌‌లైన్స్‌‌ తమకు తెలియవని చెప్పారు. దీంతో జీవోలను జారీ చేసిన 24 గంటల్లో వెబ్‌‌సైట్‌‌లో పెట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. పిల్‌‌పై విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది.