
GST on IPL Tickets: జీఎస్టీ రేట్ల మార్పులతో క్రికెట్ ఫ్యాన్స్ కి కూడా సెగ తగులుతోంది. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్‌లను స్టేడియమ్స్‌లో చూడాలనుకునే అభిమానులు ఇకపై ఎక్కువ ఖర్చు చేయక తప్పదు. ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లతో ఐపీఎల్ టిక్కెట్లపై జీఎస్టీని గతంలో ఉన్న 28% నుంచి 40%కి పెంచింది. భారత్‌లోని ప్రీమియం క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలనుకునే వారి జేబులపై ఈ నిర్ణయం భారాన్ని పెంచనుంది.
జీఎస్టీ పెంపుతో ఐపీఎల్ టిక్కెట్ ధరల్లో మార్పు..
ప్రస్తుతానికి అత్యధిక ట్యాక్స్ బ్రాకెట్‌లోకి వెళ్లిపోయాయి. జూదం, కాసినోలు తరహాలో ఉన్న 'లగ్జరీ', 'సిన్ గూడ్స్'గా ప్రభుత్వం పరిగణిస్తోంది. దీంతో గతంలో రూ.వెయ్యిగా ఉన్న టిక్కెట్ ధరపై 28% జీఎస్టీ కలిపితే క్రికెట్ అభిమానులు 1280 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అదే టిక్కెట్ పై 40 శాతం జీఎస్టీ అమలులోకి వచ్చాక వారు 1400 రూపాయలు వెచ్చించాల్సి రానుంది.
జీఎస్టీ రేట్ల పెంపుతో టిక్కెట్ రేట్లలో మార్పులు:
* రూ.500 టిక్కెట్: పాత ధర రూ.640, కొత్త ధర రూ.700
* రూ.వెయ్యి టిక్కెట్: పాత ధర రూ.1280, కొత్త ధర రూ.14 వందలు
* రూ.2వేల టిక్కెట్: పాత ధర రూ.2560, కొత్త ధర రూ.2వేల800
ALSO READ : GST మార్పులతో తగ్గనున్న ACలు, TVలు, వాషింగ్ మెషిన్ల రేట్లు..
ఇతర స్పోర్ట్స్‌కు ఎఫెక్ట్ లేదా?
ఈ జీఎస్టీ పెంపు ప్రధానంగా ఐపీఎల్, ప్రో కబడ్డీ లీగ్ వంటి ప్రీమియం లీగ్‌లకే వర్తిస్తుంది. తగ్గిన ధరలతో సాదారణ స్పోర్ట్స్ మ్యాచ్‌లపై మునుపట్లాగే 18% జీఎస్టీ రేటు మాత్రమే వర్తించనుంది. అదే సమయంలో సినిమా టిక్కెట్లు రూ.100 వరకు ఉంటే కేవలం 5% జీఎస్టీ మాత్రమే వర్తించనుంది. కానీ ఐపీఎల్ తరహా టోర్నమెంట్‌లపై 40% హై ఎండ్ ట్యాక్స్ అలాగే కొనసాగుతుంది. జీఎస్టీ రేటు పెంపుతో ఆన్‌లైన్ బుకింగ్ ఫీజులు, స్టేడియం ఛార్జీలు కూడా కలుపుకొని టోటల్ ఖర్చు మరింత పెరుగుతుందని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు.
కొత్త 40 శాతం పన్ను నిర్ణయంతో ఎక్కువమంది అభిమానులకు, ముఖ్యంగా విద్యార్థులు, మధ్య తరగతికి స్టేడియంలో మ్యాచ్ చూడటం పెద్ద భారమయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్‌ను 'విలాసవంతమైన వినోదం'గా ప్రభుత్వ పరిగణించటంపై క్రికెట్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.