వర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయాలె

వర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయాలె

సికింద్రాబాద్, వెలుగు:  యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల స్టాండర్డ్స్ పడిపోతున్నాయని గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని యూనివర్సిటీల్లో వెంటనే టీచింగ్ ఫ్యాకల్టీ ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, వర్సిటీల వీసీలకు సూచించారు. ‘‘జాతీయ విద్యా విధానం అమలు: ఉన్నత విద్యాసంస్థల్లో వ్యూహాలు” అనే అంశంపై రెండు రోజుల సెమినార్ ను ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో గవర్నర్ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ)‌‌‌‌‌‌‌‌----, 2020 అమలు, వర్సిటీల్లో ఖాళీల భర్తీపై ఇప్పటికే తాను అన్ని వర్సిటీల వీసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు  చెప్పారు. ఎడ్యుకేషన్ సెక్టార్ లో దేశాన్ని ప్రపంచస్థాయిలో నిలబెట్టేందుకు ఎన్ఈపీ బాగా ఉపయోగపడుతుందని, దీని అమలుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యం కావాలని గవర్నర్ పిలుపునిచ్చారు. దేశం నుంచి ఏటా 10 లక్షల మంది స్టూడెంట్లు విదేశాలకు వెళ్తుండగా, 50 వేల మంది విదేశీయులు ఇక్కడికి వస్తున్నారని, మన వర్సిటీలు విదేశీ విద్యార్థులను ఎందుకు ఆకర్షించలేకపోతున్నాయో ఆలోచించాలన్నారు.  

ల్యాప్ టాప్ లు దానం చేయండి..   
గ్రామీణ ప్రాంతాల్లోని వెనుకబడిన వర్గాలు, దివ్యాంగ విద్యార్థులకు ఆండ్రాయిడ్ మొబైల్స్, ల్యాప్ టాప్ లను అందించేందుకు చేపట్టిన కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థులకు 21 ల్యాప్ టాప్ లు అందించామని, మరింత మందికి సహాయం కోసం దాతలు ముందుకు రావాలని గవర్నర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఇఫ్లూ వీసీ సురేశ్ ​కుమార్,  ఓయూ వీసీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, దివ్యాంగులను ఆటలపోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఇన్ఫినిటీ రైడ్ -2021ను తమిళిసై బుధవారం హైదరాబాద్​లో జెండా ఊపి ప్రారంభించారు.