దేశంలోనే అగ్రగామి తెలంగాణ: హర్కర వేణుగోపాల్

 దేశంలోనే అగ్రగామి తెలంగాణ: హర్కర వేణుగోపాల్
  •     ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నయ్
  •     అమరుల త్యాగాలతో రాష్ట్ర కలనెరవేరింది
  •     రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రజాప్రతినిధులు

వెలుగు, నెట్​వర్క్: దేశంలోనే అగ్ర రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలనే సంకల్పంతో సీఎం రేవంత్​రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్​ సర్కారు ముందుకెళ్తోందని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్​అన్నారు. మంచిర్యాల కలెక్టరేట్​ఆవరణలో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన​పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు, కలెక్టర్​ కుమార్​దీపక్, డీసీపీ ఎ.భాస్కర్​తో కలిసి హాజరయ్యారు. అంతకుముందు బైపాస్​ రోడ్డులోని తెలంగాణ అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నివాళులర్పించారు. ప్రభుత్వ పథకాల అమలు ద్వారా సాధించిన ప్రగతి గురించి వివరించారు. 

అభివృద్ధిలో తెంగాణ దూసుకెళ్తోంది

అభివృద్ధిలో తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే ముందుకు దూసుకెళ్తోందని ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్​లో జరిగిన వేడుకల్లో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి జాతీయ జెండాను ఎగరేశారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అమరుల త్యాగాల ఫలితంగానే రాష్ట్ర ఆవిర్భవించిందని, వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1845 ఇందిరమ్మ ఇండ్లు పూర్తి కాగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.261.24 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. 

అర్హులకు ఇండ్లు, ఉచిత విద్య, వైద్యం 

రాష్ట్రంలోని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత వైద్యం విధించడమే ప్రభుత్వం లక్ష్యమని విప్ వేముల వీరేశం అన్నారు. నిర్మల్ కలెక్టరేట్ లో జరిగిన అవతరణ వేడుకలకు ఆయన చీఫ్​గెస్ట్​గా హాజరై మాట్లాడారు. జిల్లా ప్రగతికి సంబంధించిన సందేశాన్ని శాఖల వారీగా చదివి వినిపించారు. మహిళా సంఘాలకు మంజూరైన రూ.74.93  కోట్ల చెక్కు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ కమిషన్​కు సంబంధించి రూ.3.95 కోట్ల చెక్కును అందించారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకీ షర్మిల అధికారులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. ఆసిఫాబాద్ ​కలెక్టరేట్ ఆవరణలో జరిగిన వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు.  కలెక్టర్ హరిత, ఎస్పీ నితికా పంత్ అధికారులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి, శ్రీరాంపూర్ బొగ్గు గనులు, జైపూర్​ఎస్టీపీపీలో వేడుకలు నిర్వహించారు.  ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో కాంగ్రెస్​నేతలు వేడుకలు నిర్వహించారు.