
- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్కే కాలేజీస్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు నిర్మిస్తున్నామని, తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేసినట్లు తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను దెబ్బతీసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడతల వారీగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లను అందిస్తుందన్నారు.
విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు సాధించి కామారెడ్డి పేరు నిలబెట్టాలన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో బాధితులకు రూ.54 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను శనివారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో లైబ్రరీ జిల్లా చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ రావు, కాలేజీ సీఈవో జైపాల్ రెడ్డి, చైర్మన్ భాస్కర్ రావు, డీన్ నవీన్ కుమార్, కోఆర్డినేటర్ దత్తాద్రి, ప్రిన్సిపాల్ గోవర్ధన్, గంగాధర్, టౌన్ పార్టీ అధ్యక్షుడు పండ్ల రాజు, రూరల్ పార్టీ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.