ఆర్వోబీ పనులకు ఫండ్స్ రిలీజ్ : సుదర్శన్రెడ్డి

ఆర్వోబీ పనులకు ఫండ్స్ రిలీజ్ :  సుదర్శన్రెడ్డి
  • నిర్మాణాలు ఆలస్యం చేసే కాంట్రాక్టర్లపై యాక్షన్​
  • ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్​రెడ్డి 

నిజామాబాద్​, వెలుగు: జిల్లాలో కొనసాగుతున్న ఆర్వోబీ నిర్మాణాలకు నిధులు రిలీజ్ చేశామని ప్రభుత్వ సలహాదారుడు పి.సుదర్శన్​రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్​లో రైల్వే అండర్​ బ్రిడ్జి నిర్మాణాలపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. మాధవ్​నగర్​ బ్రిడ్జికి రూ.3.15 కోట్లు, అర్సాపల్లి ఆర్వోబీకి రూ.7.46 కోట్లు ఇచ్చామన్నారు. ప్రజా రవాణా వసతిని పెంచే ఈ రెండు నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని, నిర్లక్ష్యం చేసే కాంట్రాక్టర్లను బ్లాక్​లిస్టులో పెడుతామని హెచ్చరించారు. అడివిమామిడిపల్లి బ్రిడ్జి వద్ద బీటీ రోడ్డు నిర్మాణాన్ని డిసెంబర్​ 15 నాటికి పూర్తి చేయాలన్నారు. వివిధ ఉద్యోగ సంఘాల నేతలు సుదర్శన్​రెడ్డిని సన్మానించి జ్ణాపికలను అందజేశారు. 

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం..

జిల్లాలో భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సుదర్శన్​రెడ్డి తెలిపారు. రంగుమారిన, మొలకెత్తిన వడ్లను కొనుగోలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు 4 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. మరో 2.5 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి, అడిషనల్​కలెక్టర్​ కిరణ్​కుమార్ ఉన్నారు. 

చెరువుల్లో నాలుగు కోట్ల చేప పిల్లలు..

ఎడపల్లి : నిజామాబాద్​ జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువుల్లో నాలుగు కోట్ల చేప పిల్లలను విడుదల చేసినట్లు  ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్​ రెడ్డి తెలిపారు. శనివారం మండలంలో ని జానకంపేట్ గ్రామ శివారు అశోక్ సాగర్ చెరువులో కలెక్టర్​తో కలిసి  చేప పిల్లలను విడుదల చేసి మాట్లాడారు. గంగపుత్రులకు   ఉచితంగా చేప పిల్లలు అందిస్తున్నామన్నారు.   జానకంపేట్​ చెరువులో 1,14,600 చేపపిల్లలను వదిలారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్​ తాహెర్​ బిన్ హందాన్​, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పులి శ్రీనివాస్, బ్లాక్​ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రాంమోహన్​, పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్​ రెడ్డి, మత్య్సశాఖ అధికారులు ఆంజనేయ స్వామి , లాయక్​ మొహినొద్దీన్​, ప్రవీన్​, నగేశ్ ​తదితరులు పాల్గొన్నారు.