
- విద్యార్థుల్లో స్కిల్స్ పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: లైఫ్ సైన్సెస్ ఎడ్యుకేషన్, ఆర్ అండ్ డీ రంగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసే దిశగా.. ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ యూనివర్సిటీతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పంద చేసుకున్నది. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఆర్ఎంఐటీ యూనివర్సిటీ డిప్యూటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కాథరిన్ ఇట్సియోపోలస్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ లెటర్ ఆఫ్ ఇంటెంట్పై బుధవారం సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా ఆర్ఎంఐటీ.. బిట్స్ హైదరాబాద్తో కలిసి హయ్యర్ ఎడ్యుకేషన్ అకాడమీ ప్రారంభించనున్నది.
స్టూడెంట్స్ ఎక్స్ఛేంజ్, అధునాతన ఆర్ అండ్ డీ, ఇన్నొవేషన్ రంగాల్లో విద్యార్థులకు సరైన నైపుణ్యాలు కల్పించేలా ఆర్ఎంఐటీ ప్రోత్సాహం అందించనున్నది. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రం నుంచి రీసెర్చర్లు జాయింట్ పీహెచ్డీ ప్రోగ్రామ్స్ చేయడానికి వీలుకలగనున్నది. అందులో భాగంగా స్టూడెంట్లు బిట్స్లో కొంత.. ఆర్ఎంఐటీలో కొంత ఎడ్యుకేషన్ పూర్తి చేసేందుకు అవకాశం లభించనున్నది.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రజలపై, వారి ఆలోచనలపై పెట్టుబడి పెట్టే దిశగా ఈ భాగస్వామ్యం ముందడుగు వేస్తుందని చెప్పారు. తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ను ఏర్పాటు చేసేందుకు ఇలాంటి ఒప్పందాలు దేశంలోని బయోటెక్నాలజీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లగల నైపుణ్య యువతను తయారు చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.
ఒరికాకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం
దేశంలోనే పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ‘ఒరికా’ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బుధవారం మెల్‌బోర్న్‌లో పారిశ్రామిక పేలుడు పదార్థాల తయారీ, మైనింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాల్లో అంతర్జాతీయ అగ్రగామిగా ఉన్న ఆ సంస్థ సీఈవో, ఎండీ సంజీవ్ గాంధీ, ఇతర ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో ‘ఒరికా’ ప్రస్తుత కార్యకలాపాలు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై చర్చించారు.
రాష్ట్రంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిటీ
రాష్ట్రంలో ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానంలో ‘ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిటీ’ని ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్యా సంస్థ విక్టోరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఐటీ మంత్రి శ్రీధర్ బాబును మెల్ బోర్న్ లో బుధవారం వీఐటీ బోర్డు సభ్యుడు అలన్ గ్రిఫిన్ కలిశారు. ‘ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిటీ’ ఏర్పాటు ప్రతిపాదనపై చర్చించారు. విదేశీ వర్సిటీలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలకు ‘గ్లోబల్ హబ్’ గా ఈ క్యాంపస్ ను అభివృద్ధి చేస్తామని ‘విట్’ ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబుకు చెప్పారు. ఈ ప్రతిపాదనపై శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారు.