ఉపాధి హామీ కింద పొలాల్లో ఇసుక తొలగింపు

ఉపాధి హామీ కింద పొలాల్లో ఇసుక తొలగింపు
  • అధికారుల నిర్ణయం.. వరద బాధిత రైతులకు ఊరట

మెదక్/నిజాంపేట, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలోని వివిధ మండలాల్లో వేలాది ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి. వందలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. దీంతో ఈ సీజన్​లో పంటలు దెబ్బతినడమే కాక ఇసుక కారణంగా రాబోయే సీజన్​లో సైతం పంటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. భారీ మొత్తంలో ఇసుక పేరుకు పోవడంతో దాన్ని ఎలా తొలగించాలో అర్థం కాక రైతులు తలలు పట్టుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ శాఖ అధికారుల విజ్ఞప్తి మేరకు  గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలతో రైతుల పొలాల్లో పేరుకున్న ఇసుకను తొలగించేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు పంచాయతీరాజ్​ రూరల్​డెవలప్​మెంట్​ డైరెక్టర్​ఉత్తర్వులు జారీ చేశారు.

భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలోని హవేలీ ఘనపూర్, మెదక్, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట, నార్సింగి, అల్లాదుర్గం తదితర మండలాల్లో అనేక మంది రైతుల వరి, పత్తి, మొక్కజొన్న పొలాల్లో పెద్ద మొత్తంలో ఇసుక మేటలు వేసింది. ప్రధానంగా గుండువాగు, నక్కవాగు ఉధృతంగా ప్రవహించడం, రోడ్లు, బ్రిడ్జీలు కొట్టుకుపోయి వరద నీరు పోటెత్తడంతో హవేలీ ఘనపూర్​ మండలంలోని అనేక గ్రామాల్లో వందలాది ఎకరాలల్లో ఇసుక మేటలు వేసింది. జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల పరిధిలో 2,736 మంది రైతులకు సంబంధించిన సుమారు 200 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్టు అంచనా.

ఎకరాకు 600 క్యూబిక్​ మీటర్లు..

ఉపాధి హామీ పథకంలో వరద బాధిత రైతులకు సంబంధించి ఎకరాకు 600 క్యూబిక్ మీటర్ల చొప్పున రెండు ఎకరాల్లో ఇసుక తరలింపునకు అవకాశం కల్పించారు. 
ఉపాధి హామీ కూలీల ద్వారా పొలాల్లో పేరుకున్న ఇసుకను తరలించి పొలాలకు దూరంగా పోయనున్నారు. 

జాయింట్​ సర్వే..

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంబంధిత మండలాల ఎంపీడీఓ, ఉపాధి హామీ పథకం ఏపీఓ, ఈసీ, టీఏ, వ్యవసాయాధికారి, వ్యవసాయ విస్తరణాధికారులు కలిసి ఏఏ గ్రామాల పరిధిలో ఏఏ రైతుల పొలాల్లో ఎంత మేర ఇసుక పేరుకు పోయిందనేది గుర్తించేందుకు జాయింట్​ సర్వే చేస్తున్నారు. ఉపాధి కూలీలతో ఇసుక తరలించేందుకు ఆసక్తి చూపిన రైతుల వివరాలు నమోదు చేస్తున్నారు. అనంతరం గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్గదర్శకాల ప్రకారం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో తీర్మానం చేసి ఉపాధి కూలీలతో సంబంధిత రైతుల పొలాల్లో నుంచి ఇసుక తొలగింపు పనులు చేపట్టనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.