పదేండ్ల తర్వాత పరిహారం!.. నక్కలగండి నిర్వాసితుల సర్వేకు చర్యలు

పదేండ్ల తర్వాత పరిహారం!..  నక్కలగండి నిర్వాసితుల సర్వేకు చర్యలు
  • ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ జీవో జారీ చేసిన సర్కార్‌‌‌‌కేశ్యాతండాలో సర్వే స్టార్ట్
  • మర్లపాడుతండా, కేశ్యాతండాలో 351 ఫ్యామిలీలకు ఊరట

నాగర్‌‌‌‌ కర్నూల్, వెలుగు: నక్కలగండి ప్రాజెక్టులో ముంపు గ్రామాలైన నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట మండలం మర్లపాడుతండా, కేశ్యతండాలకు పదేండ్ల తరువాత పునరావాసం సెటిల్​ అవుతోంది. నక్కలగండి రిజర్వాయర్​లో ముంపునకు గురయ్యే ఈ రెండు తండాల గిరిజనులు 2015 నుంచి తమకు పునరావాసం కల్పించాలని పోరాటం చేస్తున్నారు. 

మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో ముంపునకు గురైన తండాల్లో గిరిజనుల దయనీయ పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇటీవల ఎస్ఎల్బీసీ టన్నెల్​ పరిశీలనకు వచ్చిన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పరిహారం, పునరావాసం కల్పించడంలో గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని వివరించారు. వెంటనే స్పందించిన సీఎం రేవంత్​రెడ్డి అదే రోజు ఆర్అండ్ఆర్​ జీవో విడుదల చేయించారు. సీఎం ఆదేశాలతో రెవెన్యూ, ఇరిగేషన్, ఫారెస్ట్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది కేశ్యతండాలో సర్వే ప్రారంభించారు. 

రేపుమాపంటూ ఏండ్లు గడిపిన్రు..

భూములు, ఇండ్లు కోల్పోతున్న గిరిజనులకు 2012 భూ సేకరణ చట్టం కింద నష్ట పరిహారంతో పాటు మెరుగైన పునరావాసం కల్పిస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. ఏడేండ్ల తర్వాత భూమికి పరిహారం ఇచ్చి, పునరావాసం అంశాన్ని గాలికొదిలేశారు. నక్కలగండి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న అచ్చంపేట మండలం మర్లపాడు తండా గ్రామపంచాయతీలో 243 కుటుంబాలు, కేశ్యతండాలో 108 కుటుంబాలను గుర్తించారు. 

వీరికి పరిహారం చెల్లించి పునరావాసం కల్పించే విషయంలో గత ప్రభుత్వ పెద్దలు 2017 నుంచి మభ్య పెడుతూ వచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ. 7.50 లక్షల పరిహారం,250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం కోసం రూ.5.50 లక్షలు చెల్లిస్తామని ఒప్పించి నయాపైసా ఇవ్వకుండా ప్రాజెక్ట్​ పనులు దాదాపు 90 శాతం పూర్తి చేశారు.

రూల్స్​ పాటించని ఆఫీసర్లు..

నల్గొండ జిల్లాకు తాగు, సాగునీటిని అందించే ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్​లో భాగమైన నక్కలగండి ప్రాజెక్ట్​ పనులను రూ.545 కోట్ల అంచనాతో ప్రారంభించారు. 7.64 టీఎంసీల కెపాసిటీతో నక్కలగండి రిజర్వాయర్​ కోసం 2009లో భూసేకరణ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద 3,155 ఎకరాల ముంపునకు గురైతే, అందులో అచ్చంపేట మండలంలోని మన్నె వారిపల్లి, కేశ్యతండా, మర్లపాడుతండాల పరిధిలో 2,361 ఎకరాల భూములు ఉంటాయి.  ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.5.50 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. 

నక్కలగండి ప్రాజెక్ట్​కు గేట్లు బిగిస్తే రెండు గిరిజన గ్రామాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. తాము కోల్పోయిన భూమికి పరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం, తల దాచుకునేందుకు పునరావాసం కల్పించకుండా వదిలేయడంతో ఇబ్బంది పడుతున్నారు. 2012  భూసేకరణ చట్టం ప్రకారం జీవో 120  కింద వన్  టైం సెటిల్​మెంట్​ అంటూ ఎకరాకు ఇంత అని ఫిక్స్  చేశారు. భూ సేకరణలో రూల్స్​ పాటించకుండా సంబంధిత అధికారులు అన్యాయం చేశారని బాధితులు చెబుతున్నారు.

ప్రభుత్వ నిర్ణయంతో ఊరట..

నక్కలగండి నిర్వాసిత గ్రామాలైన కేశ్యతండా, మర్లపాడుతండాల్లో ఆర్ఆండ్ఆర్​ ప్యాకేజీ కింద ఎంపిక చేసిన కుటుంబాల్లో ఒక్కో ఫ్యామిలీకి రూ.7.50 లక్షలు,250 గజాల ఇంటిస్థలం, ఇంటి నిర్మాణం కోసం రూ.5.50 లక్షలు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే గత ప్రభుత్వంలో 2019 వరకు కటాఫ్​ పెట్టి అప్పటి వరకు 18 ఏండ్లు నిండిన వారికి ప్యాకేజీ అమలు చేస్తామని ప్రకటించి ఎవరికీ ఇవ్వలేదు. ఈక్రమంలో కటాఫ్  డేట్​ పెంచి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్యాకేజీ అమలు చేయాలని బాధితులు కోరుతున్నారు. రెండు తండాల్లో తమ ఇండ్లు, ఖాళీ స్థలాలు, బావులు, చెట్లు, బోర్లు, మోటార్లు, పైప్​లైన్లకు పరిహారం ఇస్తామని నమోదు చేసుకున్న అధికారులు నయాపైసా ఇవ్వలేదని మాజీ సర్పంచ్​ భాస్కర్​ తెలిపారు. అప్పట్లో గజానికి రూ.1,450 ఫిక్స్​ చేశారని దానిని రూ.3,500 పెంచాలని  కోరారు

రైతులకు న్యాయం చేస్తాం..

రైతులను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని ప్రకటించిన గత ప్రభుత్వం నక్కలగండి ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన వారి గుండెలపై తన్నింది. భూములు గుంజుకుని పరిహారం చెల్లించకుండా ఏండ్ల తరబడి వేధించారు. పునరావాసం కల్పించలేదు. సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి నక్కలగండి ముంపు బాధితుల సమస్యను తీసుకెళ్లా. మెరుగైన పునరావాసంతో వారికి న్యాయం చేస్తాం.– వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట