రెండు నెలలైతే 90 లక్షలు.. నెల అయితే 45 లక్షలు.. ఇందిరమ్మ టవర్స్ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బంపరాఫర్

రెండు నెలలైతే 90 లక్షలు.. నెల అయితే 45 లక్షలు.. ఇందిరమ్మ టవర్స్ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బంపరాఫర్
  •  ఏడాది టైమ్ లిమిట్ విధించిన హౌసింగ్ మంత్రి పొంగులేటి
  •     గడువుకు ముందే పూర్తిచేస్తే ప్రోత్సాహకాలిస్తామని ప్రకటన
  •     కుత్బుల్లాపూర్ లో ఇందిరమ్మ టవర్స్ కు శంకుస్థాపన
  •     పేదల ఆర్థికస్థితిని మెరుగుపర్చటమే ప్రభుత్వ లక్ష్యం:  శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: క్యూర్ ప‌‌రిధిలో తొలివిడ‌‌త ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ ను వేగంగా పూర్తి చేసి ఏడాదిలోగా లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం అన్ని ర‌‌కాల చ‌‌ర్యలు తీసుకుంటోంద‌‌ని హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా టవర్స్ పూర్తి చేయటానికి  ఏడాది గ‌‌డువును కాంట్రాక్టర్లకు నిర్దేశించామ‌‌ని తెలిపారు.

అయితే, గడువుకు రెండు నెల‌‌ల ముందుగానే పూర్తిచేస్తే రూ.90 ల‌‌క్షలు, నెల ముందుగా పూర్తిచేస్తే రూ.45 ల‌‌క్షలు ప్రోత్సాహ‌‌క బ‌‌హుమ‌‌తి కాంట్రాక్టర్లకు ఇస్తామ‌‌ని మంత్రి ప్రకటించారు. మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌‌కు రంగారెడ్డి జిల్లా ఇన్‌‌చార్జి మంత్రి  శ్రీ‌‌ధ‌‌ర్ బాబు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ వీపీ గౌతమ్, ప‌‌లువురు ల‌‌బ్ధిదారుల‌‌తో క‌‌లిసి మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. 

ఈ సంద‌‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచ‌‌న‌‌ల మేర‌‌కు 23 అసెంబ్లీ నియోజ‌‌క‌‌వ‌‌ర్గాల‌‌లో ఇందిరమ్మ ట‌‌వ‌‌ర్స్ ను నిరంత‌‌ర ప్రక్రియ‌‌గా నిర్మిస్తామ‌‌ని తెలిపారు. ‘కుత్బుల్లాపూర్ నియోజ‌‌క‌‌వ‌‌ర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 7వేలకు పైగా దరఖాస్తులు అందాయి. పరిశీలన అనంతరం 5,218 మంది అర్హులుగా తేలారు. వారిలో లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారుల ఎంపికను బహిరంగంగా చేపట్టి.. 480 మందిని తుది జాబితాలో ఎంపిక చేశాం. ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాం. 

ఎవరికి ఏ విధంగా ఇల్లు మంజూరైందనే వివరాలను హౌసింగ్ బోర్డు వెబ్ సైట్ లో ఉంచాం. లబ్ధిదారులకు తెలియజేయడంతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను అందజేస్తాం. ప్రస్తుతం కేటాయించిన ఇండ్లతో కార్యక్రమం ముగియదు.. మరో మూడు విడతల్లోనూ ఇండ్ల నిర్మాణాన్ని చేపడతాం. ప్రస్తుతం ఈ  నియోజకవర్గంలో సుమారు 7.5 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. దీంతో పాటు నియోజకవర్గంలో ఉన్న ఇతర ప్రభుత్వ, హౌసింగ్ శాఖ భూములను గుర్తించి అక్కడ కూడా పేదలకు ఇండ్లు నిర్మిస్తాం. ఈ మేరకు హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం’ అని మంత్రి తెలిపారు. 

ఈ ఇండ్లతో పేదలు ధనవంతులవుతారు: శ్రీధర్ బాబు

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పేదల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల క్యూర్ పరిధిలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఎంత వ్యయమైనా భరించాలని నిర్ణయించారని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం తర్వాత వాటి ధరలు రూ.50 లక్షల పైనే పలుకుతాయన్నారు. 

ఇది పేద, మధ్య తరగతి ప్రజలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తుందని శ్రీధర్ బాబు తెలిపారు. సొంత ఇల్లు కలిగి ఉండటం అనేది జీవితంలో అతి ముఖ్యమైన విషయమని ఆయన చెప్పారు. క్యూర్ పరిధిలోని కాలుష్య పరిశ్రమలను బయటకు తరలించి స్వచ్ఛమైన గాలి ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీలను ఒక్కొక్కొటిగా అమలు చేస్తున్నామని, అందులో ఇందిరమ్మ ఇండ్లు అత్యంత ప్రాధాన్యత కలిగిన పథకమని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉంది.. 

మధ్యవర్తులు లేకుండా ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లో ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉంది. కొంతమంది ఇలాంటి కార్యక్రమాలు ఎలక్షన్స్ వరకే చేస్తారని, వీటికి గ్యారంటీ ఉండదని భయపెట్టారు. కానీ, ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు మెసేజ్ లు ఇచ్చారు. ఫోన్ కాల్స్ కూడా చేశారు. మా సొంత ఇంటి కల ఇంత తొందరలో నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హౌసింగ్ మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు. 
భాగ్యలక్ష్మి, కుత్బుల్లాపూర్ నియోజక వర్గం