
హైదరాబాద్, వెలుగు: ‘ఊరి పక్కనే ఉన్న తండా నుంచి వస్తున్నావా? అదీ ఈ ఊరి కిందికే వస్తుందిగా? టీఏ కట్. మీ ఊళ్లో స్కూలున్నా పక్క ఊరిలో ఇంగ్లిష్, ఉర్దూ మీడియం చదువు కోడానికి వెళ్తున్నావా? నో టీఏ’ ఇలాంటి కారణాలు చెబుతూ రాష్ట్రంలో స్టూడెంట్లకు ట్రావెలింగ్ అలవెన్స్ (టీఏ)ను ప్రభుత్వం కట్ చేస్తోంది. లక్షల మంది స్టూడెంట్ల దూరం నుంచే స్కూళ్లకు వస్తున్నా ప్రభుత్వం మాత్రం ఈ విద్యా సంవత్సరానికి 20 వేల మందినే గుర్తించామని చెప్పింది. వారికే టీఏ ఇస్తామంది. ఇప్పటికే నిధులూ విడుదల చేసింది.
కేంద్రం 60, రాష్ట్రం 40
రాష్ర్టంలో 26,054 గవర్నమెంట్, లోకల్ బాడీ స్కూళ్లున్నాయి. వీటిల్లో 20 లక్షల 51 వేల 980 మంది చదువుతున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి కిలోమీటర్‌కు ఓ ప్రైమరీ, మూడు కిలోమీటర్లకో అప్పర్ ప్రైమరీ, ఐదు కిలోమీటర్లకో హైస్కూల్ ఉండాలి. బడికి దూరంగా ఇళ్లుండే పిల్లలను బడికి రప్పించే బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని చట్టంలో ఉంది. అందుకే బడికి దూరంగా ఇల్లు ఉండి, చదువుకోడానికి వచ్చే 14 ఏళ్లలోపు (8వ తరగతి) స్టూడెంట్లకు సమగ్ర శిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) టీఏ ఇస్తోంది. ఇందులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులిస్తుంది. 2019–20కి 20,012 మందే అర్హులని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. వీళ్లంతా ఆటోలు, జీపుల్లో స్కూలుకొస్తున్నట్టు గుర్తించింది. ఒక్కో విద్యార్థికి ఏడా దికి రూ.6 వేలు టీఏ ఇవ్వనుంది. ఈమేరకు ప్రభుత్వం శనివారం రూ. 12 కోట్ల నిధులు మంజూరు చేసింది.
సర్కారుకు చెడ్డ పేరు రావొద్దని
చట్టం ప్రకారం అర్హులైన స్టూడెంట్లకు టీఏ ఇవ్వాలి. అయితే కొన్ని ఊళ్లలో ఆవాసాలను (కుగ్రామాలు) ప్రభుత్వం గుర్తించలేదు. అక్కడి నుంచి వచ్చే వారిని ఒకే ఊరి కింద లెక్కగట్టి టీఏ ఇవ్వడం లేదు. ఊరిలో స్కూలున్నా ఇంగ్లిష్ మీడియం గానీ, ఉర్దూ మీడియం గానీ చదవడానికి వేరే ఊర్లోని సర్కారీ స్కూల్‌కు వెళ్లినా నో టీఏ అంటున్నారు. కాలేజీ స్టూడెంట్ల కోసం చాలా గ్రామాల్లో ఉదయం 7 నుంచి 7.30 గంటలకు ఆర్టీసీ బస్సులు నడిపిస్తోంది. తర్వాత ఆటోలు, జీపులు, సైకిళ్లపై పిల్లలు స్కూళ్లకొస్తున్నారు. ఇలాంటి బడులనూ సర్కారు లెక్కలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ప్రభుత్వం కావాలనే ఇలా వ్యవహరిస్తోందని ఆరోపణలున్నాయి. బడికి దూరంగా ఉండే స్టూడెంట్ల సంఖ్య ఎక్కువగా ఉంటే రాష్ర్టానికి చెడ్డ పేరొస్తుందనే లెక్కలు తక్కువ చేసి చూపిస్తోందని కొందరు టీచర్లు అంటున్నారు.