జమున హ్యాచరీస్ భూములపై కేసీఆర్ అసత్య ప్రచారం

జమున హ్యాచరీస్ భూములపై కేసీఆర్ అసత్య ప్రచారం

శామీర్ పేట:  జమున హ్యాచరీస్ భూములను పంచుతున్నమంటూ సీఎం కేసీఆర్ అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని, పంచిపెట్టిన ఆ భూములు తమవి కానే కావని ఈటెల జమున  స్పష్టం చేశారు. అబద్ధాలు ఆడుతున్నందుకు కేసీఆర్ కు పాపం తగులుతుందన్నారు. గురువారం ఉదయం ఆమె శామీర్పేటలో విలేకరులతో మాట్లాడారు. తాము ఒక్క గుంట భూమిని కూడా కబ్జా చేయలేదని, కబ్జా చేసినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని పేర్కొన్నారు. జమున హ్యాచరీస్ లో కబ్జా చేసిన భూములుంటే.. అధికారులతో ఎంక్వైరీ చేయించి న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చన్నారు. తమ భూమి సర్వే నంబర్లకు.. నిన్న ఇచ్చిన భూముల సర్వే నంబర్లకు ఎటువంటి పొంతన లేదని తెలిపారు.

ఆక్రమించుకోవాలని కేసీఆర్ చూస్తున్నట్లు అనిపిస్తోంది

తమకు 50 నుంచి 60 ఎకరాల భూమే ఉంటే.. 80 ఎకరాలను ఎలా చూపిస్తున్నారని జమున ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే.. తమ భూములను కూడా ఆక్రమించుకోవాలని కేసీఆర్ చూస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. ప్రజలు తరిమికొడుతున్నా.. కేసీఆర్ బుద్ధి మార్చుకోవడం లేదని మండిపడ్డారు. జమున హ్యాచరీస్ భూములను తాము కొనుక్కున్నామని, దానికి సంబంధించిన పత్రాలన్నీ ఉన్నాయని వెల్లడించారు. ఓటుకు 10వేలు ఇచ్చినా హుజూరాబాద్ ఉప ఎన్నికలో  టీఆర్ఎస్కు ఓట్లు పడలేదని గుర్తు చేశారు. ‘‘ముఖ్యమంత్రి కాక ముందు కేసీఆర్కు ఏం లేకుండె.. ఇప్పుడు పదవి వచ్చి అన్నీ సంపాదించుకున్నరు’’ అని జమున కామెంట్ చేశారు.