ఎక్సైజ్ పన్ను ఎక్కువుండటంతో ఆమ్దానీ కోసం సర్కారు ప్రయత్నాలు

ఎక్సైజ్ పన్ను ఎక్కువుండటంతో ఆమ్దానీ కోసం సర్కారు ప్రయత్నాలు
  • ఒక్కో వైన్​ షాప్​కు 5  కాటన్ల బీర్లే సప్లయ్.. మద్యం డిపోల్లో లిమిట్
  •  సెప్టెంబర్ 30న ఒకే రోజు 313.64  కోట్ల ఇన్​ కం 

హైదరాబాద్, వెలుగు: దసరా పండుగ పూట ఆబ్కారీ శాఖ బీర్ల అమ్మకాలను భారీగా తగ్గించి, లిక్కర్​ సరఫరాను అమాంతం పెంచేసింది. మద్యం డిపోల్లో వైన్ షాపులకు అడిగినంత లిక్కర్ ఇస్తున్నప్పటికీ.. బీర్లు మాత్రం 5 కాటన్లకు మించి ఇవ్వట్లేదు. పండుగ పూట లిక్కర్​ ఎక్కువగా అమ్ముడుపోయేందుకే  వైన్ షాపుల్లో బీర్ల కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీరుపై ఎక్సైజ్‌‌‌‌ డ్యూటీ తక్కువగా ఉండడం, లిక్కర్​పై ఎక్కువగా ఉండటంతో సర్కార్ ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. సర్కారుకు బీరు ఎమ్మార్పీ మీద 50 నుంచి -60 శాతందాకా ఎక్సైజ్ డ్యూటీ వస్తుండగా.. చీప్ లిక్కర్ మీద 85 శాతం, బ్రాండెడ్ లిక్కర్ మాల్​పై 80 శాతం వరకు పన్నుల రూపంలో వస్తోంది. లిక్కర్ అమ్మకాలు పెరిగితే ఖజానాకు ఇంకింత ఆమ్దానీ వస్తుందనే ఉద్దేశంతోనే బీర్లపై లిమిట్ పెట్టినట్లు సమాచారం. రాష్ట్రంలో సెప్టెంబర్ 28న  డిపోల నుంచి1,43,008 కేసుల బీర్లు లిఫ్ట్ చేయగా, 29న కేవలం 41,457 కేసులు, 30న 45,502 కేసుల బీర్లు మాత్రమే రీటెయిలర్లకు సరఫరా చేశారు. అదే ఇండియన్​ మేడ్ లిక్కర్(ఐఎంఎల్) విషయానికొస్తే 28న 1,12,254 కేసులను లిఫ్ట్ చేయగా.. 29వ తేదీనాడు 2,05,871 కేసులకు, 30 న 3,68,215  కేసులకు సరఫరా పెరిగింది.

ఆర్నెళ్లలో 17,516 కోట్ల రాబడి

తెలంగాణ వచ్చినంక 2014లో రూ.10,880 కోట్ల విలువైన మద్యం మాత్రమే అమ్ముడైంది. ఆ తర్వాత ఏటా మద్యం సేల్స్ పెరుగుతున్నాయి. 2018 నాటికి ఏడాదికి ఆమ్దానీ రూ.20,850 కోట్లకు చేరగా,  2020 – 21లో రూ.27,280 కోట్లకు పెరిగింది. 2021 – 22 నాటికి ఏకంగా రూ.30 వేల కోట్లు క్రాస్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అయ్యింది. నిరుడు లిక్కర్ ఇన్​ కం కిక్కుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫైనాన్షియల్ ఇయర్​లో రూ.35 వేల కోట్లు ఇన్​కం రాబట్టాలని టార్గెట్​గా పెట్టుకుంది. గడిచిన ఆర్నెళ్లలో సెప్టెంబర్ 30 నాటికి సరిగ్గా సగం ఆదాయాన్ని రాబట్టింది. సర్కార్​ కు ఒక మద్యంపైనే నెలకు రూ.3 వేల కోట్ల ఇన్​ కం వస్తుండడం విశేషం. ఈ లెక్కన వచ్చే డిసెంబరు నెలాఖరునాటికి రూ.35 వేల కోట్ల టార్గెట్ అంచనాలు సులువుగా దాటుతుందని ఎక్సైజ్‌‌‌‌ వర్గాలు భావిస్తున్నాయి.

లిక్కర్​ సేల్స్​తో రికార్డు స్థాయిలో ఆమ్దానీ 

రాష్ట్రంలో దసరాకు వారం ముందునుంచే లిక్కర్​ అమ్మకాలు జోరందుకున్నాయి. మాములు రోజుల్లో డిపోల నుంచి రోజుకు రూ.70 నుంచి -80 కోట్ల విలువైన లిక్కర్​, బీర్ కేసులు సరఫరా అవుతుంటాయి. కానీ సెప్టెంబర్ 27 నుంచి లిక్కర్​ సేల్స్ రోజుకు 110 కోట్లకు తగ్గడం లేదు. ఈ నెల 26న రూ.174.55 కోట్లు, 27న రూ.123.93 కోట్లు, 28న రూ.117.02 కోట్లు, 29న  రూ.181.47 కోట్ల ఆదాయం రాగా, 30న ఒక్క రోజే  రికార్డు స్థాయిలో రూ.313.64 కోట్ల రాబడి వచ్చింది. మొత్తంగా సెప్టెంబర్​లో రూ.2,726  కోట్ల 
ఆదాయం సమకూరింది.