
- అత్యవసరాలకు అందని జీపీఎఫ్ డబ్బులు
- అప్పులపాలవుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు
- ఏడాది నుంచి ఇతర బిల్లులూ పెండింగ్లోనే..
- ఆన్లైన్లో కనిపించని వివరాలు
- నిధులు పక్కదారి పట్టాయని ఆరోపణలు
మంచిర్యాల, వెలుగు :
ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) లోన్లు సకాలంలో రాక ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు పది నెలలుగా దరఖాస్తులను పెండింగ్లో పెట్టడంతో అత్యవసరాలకు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. కొంతమందికి లోన్లు మంజూరైనట్టు చూపిస్తున్నా డబ్బులు అందడం లేదు. అలాగే ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో జీపీఎఫ్ వివరాలను ఆన్లైన్లో ఉంచాలని కోరుతున్నా స్పందించడం లేదు. భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న పైసలను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తూ తమను సతాయిస్తోందని ఎంప్లాయీస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐదు నుంచి పది నెలలు ఎదురుచూపులు
ఉద్యోగులు ప్రతి నెల తాము పొందుతున్న బేసిక్ వేతనం నుంచి కనీసం ఆరు శాతం జీపీఎఫ్ కింద జమ చేసుకుంటారు. ఇట్ల జమ అయిన మొత్తానికి ప్రభుత్వం తొమ్మిది శాతం వడ్డీ చెల్లిస్తుంది. ఉద్యోగులు తమ ఖాతాల్లో ఉన్న డబ్బుల్లోంచి డెబ్బై శాతం వరకు లోన్లతో పాటు పార్ట్ ఫైనల్ కింద యాభై శాతం వరకు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ పైసలను ఇంటి నిర్మాణాలు, పిల్లల చదువులు, పెండ్లిళ్లు, హాస్పిటల్ ఖర్చులు, వెహికల్స్ కొనుగోళ్లు తదితర అవసరాలకు వాడుకుంటారు. లోన్ మొత్తాన్ని ఇరవై వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే జీపీఎఫ్ లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నెలల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు. లోన్ శాంక్షన్ కావడానికి కనీసం ఐదు నుంచి పది నెలల టైమ్ పడుతోంది. కొంతమందికి ఏడాది దాటినా కూడా లోన్లు రావడం లేదని వాపోతున్నారు. మరికొందరికి లోన్లు మంజూరైనట్టు చూపిస్తుండగా డబ్బులు చేతికి అందక ఇబ్బందులు పడుతున్నారు. జడ్పీలో లోన్ అప్రూవల్ చేసి పంపినప్పటికీ ట్రెజరీలో పెండింగ్ ఉంటున్నాయని చెబుతున్నారు. ఇలా రాష్ర్టవ్యాప్తంగా సుమారు రూ.120 కోట్లు పెండింగ్ ఉన్నట్టు సమాచారం.
ఇతర బిల్లులూ పెండింగ్లోనే..
జీపీఎఫ్ లోన్లు మాత్రమే కాకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని రకాల బిల్లులను ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే క్లియర్ చేయాల్సి ఉంటుంది. కానీ, బిల్లుల చెల్లింపు గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ రీయింబర్స్ మెంట్, సరెండర్ లీవులు, సప్లమెంటరీ బిల్లులు ఏవీ శాంక్షన్ కావడం లేదంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కొన్ని వేల మంది ఉద్యోగులు పెండింగ్ బిల్లుల కోసం రోజూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడువు మార్చి 31 లోపు చెల్లింపులు కానిపక్షంలో ఈ బిల్లులన్నీ చెల్లకుండా పోతాయి. ఉద్యోగులు మళ్లీ కొత్త ఆర్థిక సంవత్సరంలో బిల్లులను సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
ఖజానా ఖాళీ కావడంతో దారి మళ్లింపు..
రాష్ర్ట ఖజానా ఖాళీ కావడంతో ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించడానికి సర్కారు తిప్పలు పడుతోంది. విడతల వారీగా ఒక్కో జిల్లాకు ఒక్కో రోజు ఇరవై తారీఖు వరకు వేతనాలు చెల్లిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అన్ని రకాల నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి. తాము భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న డబ్బులను కూడా సర్కారు ఇతర అవసరాలకు వాడుకుంటోందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఈ కారణంగానే జీపీఎఫ్ వివరాలను ఆన్లైన్లో ఉంచడం లేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరో ఇరవై రోజుల్లో 2022–23 ఆర్థిక సంవత్సరం ముగియనున్నప్పటికీ జీపీఎఫ్ వివరాలు ఆన్లైన్చేయడం లేదని మండిపడుతున్నారు. దీంతో ఇప్పటివరకు తమ అకౌంట్లలో ఎంత డబ్బు జమయ్యిందో కూడా తెలియడం లేదంటున్నారు. గతంలో జీపీఎఫ్ లోన్ కోసం అప్లై చేసుకున్న నెల రోజుల్లోపే అకౌంట్లలో డబ్బులు జమయ్యేవని గుర్తు చేస్తున్నారు. కొన్నేండ్ల నుంచి నెలలు గడిచినా లోన్లు రావడం లేదని చెబుతున్నారు. అత్యవసరాల కోసం దాచుకున్న పైసలు అక్కరకు అందకపోవడంతో అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లోన్ రాలే, మెడికల్ బిల్లు రాలే...
నేను ఇల్లు కట్టుకోవడానికి డిసెంబర్లో జీపీఎఫ్ లోన్ అప్లై చేసిన. నాలుగు నెలలు గడుస్తున్నా శాంక్షన్ కాలేదు. బయట అప్పు తెచ్చి నెలనెలా వడ్డీ కడుతున్నా. లోన్ పైసలు వస్తే అప్పు కడదామని ఎదురుచూస్తున్న. ఏడాది కిందట నా బిడ్డ డెంగీ ట్రీట్మెంట్ కోసం రూ.80 వేలు ఖర్చయ్యింది. మెడికల్ రీయింబర్స్మెంట్అప్లై చేస్తే రూ.40 వేలు శాంక్షన్ అయినట్టు ట్రెజరీలో చూపిస్తున్నా డబ్బులు రాలేదు.
- జయప్రద, సెకండరీ గ్రేడ్ టీచర్ (సీతారాంపల్లి)
ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు
ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న డబ్బులు వారికి సకాలంలో ఉపయోగపడడం లేదు. జీపీఎఫ్ లోన్లు, ఇతర బిల్లులు సంవత్సర కాలంగా పెండింగ్ ఉన్నాయి. అత్యవసరాలకు అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ఈ పైసలను పక్కదారి పట్టించింది. అందుకే జీపీఎఫ్ వివరాలను ఆన్లైన్ నుంచి తొలగించింది. ఇదే పరిస్థితి కొనసాగితే సర్కారుపై తిరుగుబాటు తప్పదు.
- బండి రమేశ్, తపస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి