బండి సంజయ్ బెయిల్ క్యాన్సిల్ చేయండి.. కోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు

బండి సంజయ్ బెయిల్ క్యాన్సిల్ చేయండి.. కోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు

హనుమకొండ, వెలుగు: టెన్త్ క్లాస్ హిందీ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో ఏ1గా ఉన్న బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో ప్రభుత్వం పిటిషన్‌‌ దాఖలు చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణ హనుమకొండ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (పీడీజే) వద్ద పిటిషన్ ఫైల్‌‌ చేశారు. సంజయ్‌‌ బెయిల్ కండీషన్స్ పాటించడం లేదని, విచారణకు సహకరించడం లేదని, తన సెల్‌‌ఫోన్ ఇవ్వడం లేదని ఆయన పిటిషన్‌‌లో పేర్కొన్నారు.

అంతేగాకుండా, నిరుద్యోగ మార్చ్ సందర్భంగా బెయిల్ నిబంధనలను ఉల్లఘించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్నారు. దీంతో సంజయ్‌‌కు బెయిల్ మంజూరు చేసిన ఫోర్త్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులోనే పిటిషన్ దాఖలు చేయాలని సూచిస్తూ పిటిషన్‌‌ను పీడీజే రిటర్న్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఫోర్త్ ఎంఎం కోర్టులో పీపీ సత్యనారాయణ పిటిషన్ దాఖలు చేయనుండగా.. మధ్యాహ్నానికల్లా తీర్పు వచ్చే అవకాశం ఉంది.

కాగా, టెన్త్ పేపర్ లీక్ కేసులో నిందితుడు వర్షిత్‌‌ను పోలీసులు రెండ్రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. కస్టడీ ముగిసిన తర్వాత నిందితుడిని పరకాల సబ్ జైలుకు తరలించగా.. ఆయన తరఫు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు ముగియగా, ఈ తీర్పు కూడా మంగళవారమే వెలువడనుంది.