మ్యూచువల్​లోకి వస్తే సీనియార్టీ కోల్పోనున్న ఎంప్లాయీస్

మ్యూచువల్​లోకి వస్తే సీనియార్టీ కోల్పోనున్న ఎంప్లాయీస్
  • మార్చి 1 నుంచి 15 వరకు ఆన్​లైన్ అప్లికేషన్లు 
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 
  • ఒకే డిపార్ట్​మెంట్, సేమ్ కేడర్ అయితేనే పర్మిషన్ 
  • మ్యూచువల్​లోకి వస్తే సీనియార్టీ కోల్పోనున్న ఎంప్లాయీస్ 

హైదరాబాద్, వెలుగు: ఎట్టకేలకు టీచర్లు, ఎంప్లాయీస్ మ్యూచువల్ ట్రాన్స్ ఫర్లకు సర్కారు గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది. మార్చి 1 నుంచి 15 వరకు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లు తీసుకుంటామని ప్రకటించింది. అయితే ఒకే డిపార్ట్​ మెంట్​లోని సేమ్ కేడర్​అయితేనే దీనికి అర్హులని వెల్లడించింది. బుధవారం ఈ మేరకు జీవో నెంబర్ 21ను సీఎస్​ సోమేశ్ కుమార్ విడుదల చేశారు. జీవో 317తో స్థానికతను కోల్పోయిన వారికీ పరస్పర బదిలీల ద్వారా కొంత ఉపశమనం లభించనున్నదని సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగానే మ్యూచువల్​లో అప్లై చేసే వారిలో ఒకరు తప్పనిసరిగా.. ఇటీవల జరిగిన అలాట్మెంట్లలో స్థానం మారిన వారై ఉండాలనే  నిబంధన పెట్టింది. జోనల్, మల్టీ జోనల్, జిల్లా కేడర్​లలో ఈ రూల్ ను పరిగణలోకి తీసుకుంటారు. మ్యూచువల్​ ట్రాన్స్​ఫర్ల ద్వారా బదిలీ అయి వచ్చిన వారు సీనియార్టీ కోల్పోనున్నారు. లీన్ కూడా ఉండబోదు. కాగా వచ్చే నెల 1 నుంచి 15 వరకు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసిన తర్వాత, ఆ హార్డ్ కాపీలను ఆయా డిపార్ట్​మెంట్ హెడ్స్‌‌‌‌కు ఇవ్వాలి. వీటిని పరిశీలించి, ఆ తర్వాత సర్కారు క్లియరెన్స్ ఇస్తారు. అయితే అవసరాల రీత్యా, ఏవైనా అప్లికేషన్లు తిరస్కరించే అధికారమూ తమకుందని జీవోలో పేర్కొన్నారు. జీవో విడుదలపై పీఆర్‌‌‌‌టీయూ స్టేట్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ శ్రీపాల్‌‌‌‌ రెడ్డి, జనరల్‌‌‌‌ సెక్రటరీ కమలాకర్‌‌‌‌ రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌‌‌‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఇవీ గైడ్​లైన్స్...

  • ఒకే డిపార్ట్​మెంట్​లోని వారై ఉండాలి. ఒకే కేటగిరీ పోస్టులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 
  • లోకల్ బాడీ (జిల్లా పరిషత్, మండల పరిషత్) పరిధిలోని సం స్థలకు, గవర్నమెంట్ సంస్థలకు ట్రాన్స్​ఫర్లకు పర్మిషన్ లేదు. 
  • ఒకే కేడర్, ఒకే మీడియం, ఒకే మేనేజ్మెంట్ టీచర్లకే అవకాశం. నాన్ టీచింగ్​లోనూ ఇదే విధానం అమలు. 
  • ఒక జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్) ఇంగ్లీష్​ మీడియం వ్యక్తి... వేరే జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్​) ఇంగ్లీష్ మీడియం వ్యక్తి ఇద్దరూ ట్రాన్స్​ఫర్లకు        అర్హులు.  ఇతర మీడియం, ఇతర సబ్జెక్టు ఉంటే చాన్స్​ లేదు. 
  • కోర్టు ఆదేశాలతో కేడర్​లో కొనసాగుతున్న వారు, సస్పెన్షన్​, క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొంటున్న వారు అర్హులు కాదు. 
  • ఒక ఉద్యోగి పరస్పర బదిలీకి అంగీకరిస్తూ ఒక్కరికి మాత్రమే కన్సెంట్ ఇవ్వాలి. ఒక్కరి కంటే ఎక్కువ మందికి కన్సెంట్ ఇస్తే, ఆ అప్లికేషన్లు మొత్తం రిజెక్ట్ చేస్తారు.