- కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం
- ఇప్పటికే మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోళ్లు
హైదరాబాద్, వెలుగు: జొన్నల కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మొక్కజొన్నతో పాటు జొన్నలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం వారికి పెద్ద ఊరటనిస్తుందని మంత్రి పేర్కొన్నారు. మొక్కజొన్న, జొన్న పంటలను ప్రైస్ సపోర్ట్ స్కీం పరిధిలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినా కేంద్రం నుంచి స్పందన రాలేదని మంత్రి విమర్శించారు.
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఈ పంటలను ప్రభుత్వాలు కొనుగోలు చేయడం లేదని, అక్కడ రైతులు బహిరంగ మార్కెట్ ధరలకే అమ్మకాలు జరుపుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో మాత్రం రైతుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోళ్లు నిర్వహిస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే యాసంగి సీజన్‌లో 278 కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపు 5.50 లక్షల టన్నుల మొక్కజొన్నను సేకరించినట్లు వెల్లడించారు.
