వరద సాయానికి రూ.200 కోట్లు రిలీజ్

వరద సాయానికి రూ.200 కోట్లు రిలీజ్
  • 7 జిల్లాలకు 10 కోట్లు చొప్పున.. 26 జిల్లాలకు 5 కోట్లు చొప్పున మంజూరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు తక్షణ వరద సాయం కింద ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఇప్పటికిప్పుడు అత్యవసర సాయం కింద రూ.200 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భారీగా దెబ్బతిన్న జిల్లాలకు ఎక్కువగానూ.. తక్కువ నష్టం వచ్చిన జిల్లాలకు తక్కువగానూ నిధులు కేటాయించారు. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో భారీగా నష్టాన్ని చవిచూసిన 7 జిల్లాలకు.. ఒక్కో జిల్లాకు రూ.10 కోట్ల చొప్పున నిధులను మంజూరు చేసింది.

 అదే సమయంలో కొంత తక్కువగా నష్టపోయిన  26 జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.5 కోట్ల చొప్పున నిధులను మంజూరు చేసింది.  రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు, పశువుల మరణాలకు పరిహారం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. పశువుల మరణాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.37,500 నుంచి రూ.50,000లకు పెంచారు. 

గొర్రెలు, మేకల మరణాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచారు. వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించడానికి రూ.1.30 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులను కామారెడ్డి, మెదక్, కుమ్రంభీం ఆసిఫాబాద్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, ములుగు, మహబూబ్‌‌నగర్, జగిత్యాల, నిర్మల్, సిరిసిల్ల జిల్లాల్లో వరద మృతుల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.