హుజురాబాద్‌కు 3 నెలల్లో 4 వేల కోట్లు

హుజురాబాద్‌కు 3 నెలల్లో 4 వేల కోట్లు
  • నిలిచిపోయిన స్కీంలకు ఇప్పుడు మోక్షం 
  • పెండింగ్ లో ఉన్న ఆసరా పెన్షన్లు, సెకండ్ ఫేజ్ గొర్రెల పంపిణీలో కదలిక 
  • సీసీ రోడ్లు, లింక్ రోడ్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు 
  • మహిళా సంఘాలకు మిత్తి పైసలు పైలట్​ ప్రాజెక్టుగా దళిత బంధు
  • సొంత సెగ్మెంట్లను వదిలి హుజూరాబాద్​లో పనులు చేయిస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు


హుజూరాబాద్ నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు:  హుజూరాబాద్ ఉప ఎన్నికతో రాష్ట్ర సర్కార్ ఉరుకులు పరుగులు పెడుతున్నది. పాత హామీలు, కొత్త స్కీములకు కోట్లు కుమ్మరిస్తున్నది. ఈటల  రాజేందర్​ రాజీనామా తర్వాత గడిచిన మూడు నెలల్లోనే దళిత బంధులాంటి కొత్త స్కీం తెరపైకి రావడంతోపాటు పెండింగ్ లో ఉన్న పెన్షన్లు, రెండో విడత గొర్రెల పంపిణీకి మోక్షం కలిగింది. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోని ప్రజలకు అందని పథకాలు ఇప్పుడు హుజూరాబాద్ ప్రజలకు చేరువవుతున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏ నియోజకవర్గానికి ఇవ్వని స్థాయిలో ఒక్క హుజూరాబాద్​​కే  మూడు నెలల్లో రూ. 4,359 కోట్లను విడుదల చేసింది.

దళిత బంధుకు రూ. 2,200 కోట్లు

ఈటల రాజీనామా తర్వాత సర్కారు ప్రకటించిన స్కీం దళిత బంధు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న ఎన్నికల హామీ నెరవేరకపోవడం.. 
హుజూరాబాద్  ఉప ఎన్నికలో దళితుల ఓట్లు టీఆర్ఎస్ కు పడవనే భయంతోనే ఈ స్కీంను సీఎం కేసీఆర్ తెరపైకి తెచ్చారనే వాదన వినిపించింది. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఎస్సీ ఓటర్లే (సుమారు 45 వేల మంది) ఉన్నట్లు సమగ్ర కుటుంబ సర్వేలో ప్రభుత్వం గతంలోనే గుర్తించిందని,  హుజూరాబాద్ ఎన్నికలో దళితుల ఓట్లే కీలకం కావడంతో దళిత బంధు స్కీంను తీసుకొచ్చిందనే ప్రచారం జరిగింది. తొలుత నియోజకవర్గానికి వంద మందికి మాత్రమే ఈ స్కీం వర్తింపజేస్తామని ప్రకటించినప్పటికీ.. హుజూరాబాద్ లో 23 వేల మందిని అర్హులుగా గుర్తించింది. ఇప్పటికే 17 వేల మంది ఖాతాల్లో రూ. 10 లక్షలు జమ చేసి, డబ్బులను ఫ్రీజింగ్ లో పెట్టింది. నాలుగు దఫాలుగా రూ. 2,200 కోట్లు విడుదల చేసింది. 

కొత్త ఆసరా పెన్షన్లు మంజూరు

టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరు చేయలేదు.  మూడేండ్లలో 57 ఏండ్లు నిండినోళ్లు, వితంతువులు,  సదరం సర్టిఫికెట్ పొందిన దివ్యాంగులు, ఒంటరి మహిళలు,  బీడీ, చేనేత, గీత కార్మికులు కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూశారు. ఇలాంటి అర్హులు   రాష్ట్రంలో 15 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. అయితే,  57 ఏండ్లు దాటినోళ్లంతా పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవాలని ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 9.50 లక్షల మంది మీ సేవ కేంద్రాల ద్వారా అప్లికేషన్లు పెట్టుకున్నారు.  ప్రభుత్వం మాత్రం కొత్త పెన్షన్లు 3 నెలలుగా హుజూరాబాద్​లోనే పంపిణీ చేస్తోంది. ఇక్కడ కొత్తగా 10 వేల మందికి ఇస్తోంది.  మూడేండ్లు మంజూరు కాని కొత్త పెన్షన్లు ఉపఎన్నిక సమయంలోనే మంజూరయ్యాయి. 

మిత్తి పైసలు విడుదల

డ్వాక్రా గ్రూపులకు చెందిన మహిళలు తాము తీసుకున్న వడ్డీ లేని రుణాల(వీఎల్ఆర్)ను నెలనెలా అసలు, వడ్డీతో కలిపి కిస్తీని బ్యాంకుల్లో చెల్లిస్తున్నారు. వారు చెల్లించిన వడ్డీని మూడు నెలలకోసారి ప్రభుత్వం తిరిగి వారి ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. మూడేండ్లుగా ఈ మిత్తి పైసలు మహిళా గ్రూపులకు జమ కావడం లేదు. సుమారు రూ. 3 వేల కోట్లు మహిళా సంఘాలకు సర్కార్ బాకీ పడింది. మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో ఈ బడ్జెట్ లో రూ. 3 వేల కోట్లు కేటాయించి కేవలం రూ. 200 కోట్లు విడుదల చేసింది. అందులోనూ రూ.120 కోట్లను హుజూరాబాద్‌‌లోని మహిళల ఖాతాల్లోనే జమ చేసింది. ఇన్నేండ్లుగా రాని పైసలు బై ఎలక్షన్ టైంలో వచ్చాయి. 

సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు 600 కోట్లు

హుజూరాబాద్‌‌లో కొత్త రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం జోరుగా సాగుతోంది. గల్లీల్లో సీసీ రోడ్లు నిర్మించి, మెయిన్ బజార్లలో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలానికి రూ.30 కోట్ల చొప్పున ఐదు మండలాలకు కలిపి రూ.150 కోట్లు కేటాయించారు.  మొత్తంగా నియోజకవర్గంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, లింక్ రోడ్లకు రూ.220 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 

కుల సంఘాలకు స్థలాలు, భవనాలు 

దళితబంధుతో దళితులకే ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోందని, తమను పట్టించుకోవడం లేదని మిగతా సెక్షన్ల ప్రజలు భావిస్తున్నారని సర్వేల్లో వెల్లడవుతుండడంతో ఇతర కులాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మంత్రులు హరీశ్​రావు, గంగుల, శ్రీనివాస్ గౌడ్ ఆత్మ గౌరవ సభలు పెట్టి ఆయా కుల సంఘాలకు స్థలాలు, భవనాలు మంజూరు చేశారు. 

సొంత నియోజక వర్గాలను వదిలి.. 

తమ సొంత నియోజకవర్గాలకు కనీసం రూ.100 కోట్ల పనులు తీసుకురాలేని ఎమ్మెల్యేలు.. హుజూరాబాద్ లో మాత్రం వేలాది కోట్లాది రూపాయల పనులు చేయిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తమను గెలిపించిన ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, కొత్త ఆసరా పెన్షన్, రెండో విడత గొర్రెలు, దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు సాయం తదితర సంక్షేమ పథకాలు ఇప్పించలేని ఎమ్మెల్యేలు.. హుజూరాబాద్ లో మాత్రం తమ చేతుల మీదుగానే ఇవన్నీ ఇప్పిస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో  కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంటలన్నీ మునిగితే.. నష్టపోయిన రైతులను పరామర్శించడానికి స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ వెళ్లలేదు. ఎస్సీ సంక్షేమ శాఖ చూస్తున్న కొప్పుల ఈశ్వర్ సొంత నియోజకవర్గం ధర్మపురిలో దళితబంధు స్కీం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.