గ్రేటర్​లో నిర్మించిన రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్​ ల వినియోగంపై సర్వే

గ్రేటర్​లో నిర్మించిన రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్​ ల వినియోగంపై సర్వే

హైదరాబాద్, వెలుగు:స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్(ఎస్ఆర్ డీపీ)లో భాగంగా గ్రేటర్​లో నిర్మించిన రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్​ ల వినియోగంపై సర్వే చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్వే బాధ్యతలను వరంగల్ ఎన్ఐటీకి అప్పగించేందుకు జీహెచ్ఎంసీ అంతా రెడీ చేసింది. మార్చిలో సర్వే ప్రారంభించేందుకు బల్దియా అధికారులు కసరత్తు చేస్తున్నారు. సర్వేలో భాగంగా వాహనదారుల ఫీడ్​బ్యాక్​తీసుకోనున్నారు. అలాగే సలహాలు, సూచనలు తీసుకుని ప్రభుత్వానికి పూర్తి స్థాయి రిపోర్టు పంపనున్నారు. టూవీలర్, ఫోర్ వీలర్లతోపాటు ఆటోలు, హెవీ వెహికల్స్​ఇలా అన్నింటి డ్రైవర్ల నుంచి మాన్యువల్​గా అభిప్రాయాలు సేకరిస్తారు. ఈ సర్వే ఆధారంగా ఎస్ఆర్​డీపీ ఫేజ్–2పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఫేజ్– 2కు సంబంధించి జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపింది. వాటికి ప్రభుత్వం నుంచి పాజిటివ్ రెస్పాన్స్​వచ్చింది. కానీ ఇంకా ఆర్డర్ రాలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ మంత్రి కేటీఆర్ సెకండ్ ఫేజ్ పనులు మొదలుపెడతామని ప్రకటించారు. సర్వే తర్వాత సెకండ్ ఫేజ్ పనులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ వర్గాల ద్వారా తెలిసింది. 

ఎన్ని వచ్చినా తగ్గని ట్రాఫిక్

ఎస్ఆర్​డీపీలో భాగంగా నిర్మిస్తున్న రోడ్లతో సిటీలో ట్రాఫిక్ తగ్గిందని, జనానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని మంత్రులు పలు సందర్భాల్లో చెబుతున్నారు. కానీ రోడ్ల పేరుతో వేలాది కోట్లను అప్పులు చేసి వృథాగా ఖర్చు చేస్తున్నారని పలు విమర్శలు కూడా ఉన్నాయి. సిటీ సెంటర్​లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతోందని చాలా మంది మండిపడుతున్నారు. కోట్లు ఖర్చు చేస్తున్నా విమర్శలు ఎందుకు వస్తున్నాయనేది  చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అసలు కొత్త ఫ్లైఓవర్లు, అండర్​పాస్​లు, రోడ్లపై ప్రయాణిస్తున్న వారు ఏమనుకుంటున్నారు? వారికి ఎంత మేరకు ఉపయోగపడుతున్నాయనేది తెలుసుకునేందుకు ప్రభుత్వం సర్వే చేయాలని నిర్ణయించింది. ప్రయాణికుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని ప్లాన్​చేసింది. త్వరలో వరంగల్​ఎన్ఐటీ అధికారులు సిటీలోని వేర్వేరు లొకషన్లలో ఫీడ్​బ్యాక్​తీసుకోనున్నారు.

ఫస్ట్​ఫేజ్​లో 34 పనులు పూర్తి

ఎస్ఆర్​డీపీ ఫస్ట్ ఫేజ్​లో భాగంగా ఇప్పటివరకు రూ.5,937 కోట్లతో మొత్తం 47 పనులు మొదలుపెట్టగా ఇంకా 13 మేజర్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలో వీటిని పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ.. ఆ మేరకు పనులు జరగడం లేదు. వీఎస్టీ వద్ద నిర్మిస్తున్న పెద్ద ప్రాజెక్టు(స్టీల్​బ్రిడ్జి) పనులు స్లోగా సాగుతుండడంతో ఆ ఏరియాలో ట్రాఫిక్​సమస్య ఎక్కువగా ఉంటోంది. ప్రాజెక్టు మొదలుపెట్టక ముందే అందుబాటులో తీసుకొచ్చే తేదీలను ప్రకటిస్తున్నారే తప్ప, పనులు చేయడం లేదు. సెకండ్ ఫేజ్ పనులు మొదలుపెడితే చెప్పిన టైమ్ కు పనులు పూర్తయ్యేలా చూడాలని జనం కోరుతున్నారు.