పాలమూరు ప్రాజెక్టు సగానికి కుదింపు!

పాలమూరు ప్రాజెక్టు సగానికి కుదింపు!

ఓ వైపు పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీళ్ల దోపిడీని పట్టించుకోని రాష్ట్ర సర్కారు..ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టునూ గాలి కొదిలేస్తోంది. పక్క రాష్ట్రం ఏపీ.. శ్రీశైలం నుంచి రోజుకు 10 టీఎంసీల నీళ్లను తరలించడానికి ప్రాజెక్టులు చేపడుతుంటే మనసర్కారేమో ఉన్న ప్రాజెక్టు ఊపిరి తీసేందుకే సిద్ధమవుతోంది. భారీ అంచనాలతో చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌ స్కీమ్‌‌ను సగానికి సగం కుదించాలని నిర్ణయించింది. ఇంతకుముందు రోజుకు రెండు టీఎంసీల చొప్పున లిఫ్ట్‌‌ చేయాలని తలపెట్టిన ప్రాజెక్టు ఎస్టిమేషన్లను.. ఇప్పుడుఒక టీఎంసీ కెపాసిటీకి తగ్గించాలని, దీనికిసంబంధించి రివైజ్డ్ ఎస్టిమేట్లు రూపొందించాలని అధికారులకు ఇరిగేషన్‌ ఈఎన్సీ ఆదేశాలిచ్చారు. మొత్తంగా ప్రాజెక్టుపై ఏడాదిగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూకోత పెట్టడానికే సర్కారు మొగ్గు చూపింది.ఎల్లూర్‌‌ పంపుహౌస్‌‌ నుంచి ఉద్దండాపూర్‌‌ రిజర్వాయర్‌‌ వరకు 18 ప్యాకేజీల్లో చేపట్టిన పనులను ఒక టీఎంసీకి కుదిస్తూ ప్రభుత్వం ఇప్పటికే మౌఖిక ఆదేశాలిచ్చింది. ఇప్పుడు ఉద్దండాపూర్‌‌ నుంచి కేపీ లక్ష్మీదేవిపల్లి వరకు 3 ప్యాకేజీల్లో చేపట్టాల్సిన పనుల ఎస్టిమేట్లనే ఒక టీఎంసీకి కుదించింది. 19, 20, 21 ప్యాకేజీల్లో చేపట్టాల్సిన కాలువలు, టన్నెల్‌‌, పంపుహౌస్‌‌ పనులను అంత మేరకు పరిమితం చేసేలా రివైజ్డ్‌‌ ఎస్టిమేట్లు సమర్పించాలని అధికారికంగా ఆదేశాలిచ్చింది. దీంతో మొత్తం ప్రాజెక్టును ఒక టీఎంసీకి పరిమితం చేసినట్లేనని ఇరిగేషన్ ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికి 30 శాతం పనులే ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌‌, రంగారెడ్డి జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు 2015లో పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్‌‌ స్కీమ్​ను స్టార్ట్ చేశారు. కృష్ణా నదిలో వరదొచ్చే 60 రోజుల్లో రోజుకు రెండు టీఎంసీల చొప్పున 120 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయాలని టార్గెట్ పెట్టుకున్నారు. రూ.35 వేల కోట్ల అంచనాతో పనులు మొదలయ్యాయి. శ్రీశైలం రిజర్వాయర్‌‌కు దగ్గర్లోని ఎల్లూర్‌‌ పంపుహౌస్‌‌ అప్రోచ్‌‌ చానెల్‌‌ నుంచి ప్రాజెక్టు మొదటి ప్యాకేజీ ప్రారంభమవుతుంది. 5 దశల్లో నీటిని ఎత్తి కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌‌కు తరలించాలి. ఫస్ట్ ఫేజ్​లో ఉద్దండాపూర్‌‌ వరకు 18 ప్యాకేజీల్లోని పనులకు టెక్నికల్‌‌ శాంక్షన్‌‌ ఇచ్చారు. మూడేళ్లలోనే ప్రాజెక్టు కంప్లీట్‌‌ చేస్తామన్నారు. కాళేశ్వరంపై ఫోకస్‌‌ పెట్టి దీన్ని పట్టించుకోలేదు. రూ. 5,945 కోట్ల (30 శాతం) పనులే పూర్తయినట్లు అధికారులు చెప్తున్నారు. ఫాస్ట్​గా చేస్తమని పక్కకు పెట్టిన్రు కాళేశ్వరం తర్వాత పాలమూరును వేగంగా కంప్లీట్ చేస్తామని కేసీఆర్‌‌ ప్రకటించారు. నిధుల కొరత లేకుండా కాళేశ్వరం కార్పొరేషన్‌‌లో కలిపారు. రూ.10 వేల కోట్ల లోన్​కు అగ్రిమెంట్‌‌ చేసుకున్నారు. నిధుల కొరత ఉందంటూ మొదట ఓ టీఎంసీ పనులు పూర్తి చేసి నీళ్లిస్తామని సీఎం చెప్పడంతో వర్క్‌‌ ఏజెన్సీలు ఆ మేరకే ఎర్త్‌‌ పనులు చేస్తున్నారు. పాలమూరు నుంచి రోజుకు ఒక టీఎంసీ ఎత్తిపోస్తే సగం ఆయకట్టుకే ప్రాజెక్టును పరిమితం చేస్తారని ఇంజనీర్లు చెప్తున్నారు. శ్రీశైలం నుంచి రోజుకు 10 టీఎంసీలు తరలించేందుకు ఏపీ సర్కారు కొత్త ప్రాజెక్టులు చేపడుతుంటే మన ప్రభుత్వం ఉన్న ప్రాజెక్టుకే కోతలు పెట్టడమేంటని రిటైర్డ్‌‌ ఇంజనీర్లు ప్రశ్నిస్తున్నారు. రెండు టీఎంసీలతో ప్రాజెక్టును చేపట్టకుంటే ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌‌, రంగారెడ్డి జిల్లాలకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు నిర్మాణ ప్రాంతానికి, కాళేశ్వరం వర్క్‌‌ సైట్లలోని భూమి పొరల్లో చాలా తేడాలుంటాయని చెప్తున్నారు. ఒక టీఎంసీకి పంపుహౌస్‌‌లు, టన్నెల్‌‌ పనులు చేశాక రెండో టీఎంసీ పనులు సాధ్యం కాదని, టెక్నికల్‌‌గా అవకాశాలే లేవని వివరిస్తున్నారు. ప్రభుత్వం సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకొని పంపుహౌస్‌‌లు, టన్నెళ్లనైనా 2 టీఎంసీలకు పూర్తి చేయాలని సూచిస్తున్నారు..