ఇమిగ్రేషన్ చెకింగ్ లకు హాజరవుతున్నా..అమెరికాలో పంజాబీ వృద్ధురాలి డిటెన్షన్

ఇమిగ్రేషన్ చెకింగ్ లకు హాజరవుతున్నా..అమెరికాలో పంజాబీ వృద్ధురాలి డిటెన్షన్
  • 33 ఏండ్లుగా ఉంటున్నా, ఇమిగ్రేషన్ చెకింగ్ లకు హాజరవుతున్నా అరెస్ట్ 
  • డిటెన్షన్ పై ఇండియన్ల ఆగ్రహం 

వాషింగ్టన్: అమెరికాలో 33 ఏండ్లుగా ఉంటూ, గత 13 ఏండ్లుగా ఇమిగ్రేషన్ ఆఫీసులో చెకింగ్ లకు క్రమం తప్పకుండా హాజరవుతున్నా.. ఓ పంజాబీ వృద్ధురాలిని ఇమిగ్రేషన్ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు. కుటుంబసభ్యులకు ఎలాంటి కారణాలు చెప్పకుండానే డిటెన్షన్ సెంటర్ కు తరలించారు. ఎలాంటి క్రిమినల్ రికార్డు సైతం లేకపోయినా 73 ఏండ్ల వృద్ధురాలిని ఇలా డిటెన్షన్ సెంటర్ కు తరలించడంపై అమెరికాలోని సిక్కు కమ్యూనిటీతోపాటు ఇండియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పంజాబ్ కు చెందిన హర్జీత్ కౌర్ 1990లలో అమెరికా వెళ్లారు. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఉంటూ టైలరింగ్ పని చేసుకుంటున్నారు. ఇమిగ్రేషన్ రూల్స్ ప్రకారం.. గత 13 ఏండ్లుగా ప్రతి 6 నెలలకు ఓసారి ఆమె ఇమిగ్రేషన్ ఆఫీసులో తనిఖీలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. అక్కడి చట్టాల ప్రకారం ట్యాక్స్ లు కూడా సక్రమంగానే కడుతున్నారు. 

అయితే, ఎప్పట్లాగే గత సోమవారం కూడా ఆమె శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌‌ ఫోర్స్ మెంట్(ఐసీఈ) ఆఫీసులో రొటీన్ అపాయింట్ మెంట్ లో భాగంగా చెకింగ్ వెళ్లగా అదుపులోకి తీసుకున్నారు. 

కుటుంబసభ్యుల ఆందోళన.. 

73 ఏండ్ల హర్జీత్ కౌర్ డిటెన్షన్ పై ఆమె కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హర్జీత్ కౌర్ ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆమెకు మందులు ఇస్తామన్నా కలవనీయడం లేదని ఆమె మనుమరాళ్లు మంజీత్ కౌర్, సుఖ్మీత్ సంధూ, మనవడు ఇక్ జోత్ సంధూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెను శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బేకర్స్ ఫీల్డ్ లోని డిటెన్షన్ సెంటర్ కు తరలించారని తెలిపారు. 

హర్జీత్ కౌర్ డిటెన్షన్ ను అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు, డెమోక్రటిక్ నేత జాన్ రేమండ్ జరామెండీ కూడా ఖండించారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీలు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. హర్జీత్ కౌర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా, హర్జీత్ ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. శుక్రవారం ఎల్ సోబ్రాంటే లో దాదాపు 200 మంది నిరసన కూడా తెలిపారు.