- నాంపల్లి, మర్రిగూడ ముంపు బాధితులతో మంత్రి జగదీశ్‌రెడ్డి చర్చలు
- సమగ్ర విచారణ చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు
నల్గొండ, వెలుగు : మునుగోడు నియోజకవర్గంలోని శివన్నగూడెం, కిష్టరాంపల్లి రిజర్వాయర్ల ముంపు బాధితుల పోరాటంపై ఎట్టకేలకు సర్కారు దిగి వచ్చింది. 2015 నుంచి సాగుతున్న ఉద్యమం బై ఎలక్షన్ పుణ్యామా అని ఫలించింది. ఇళ్లు కోల్పోతున్న కుటుంబాలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.7లక్షల చొప్పున మూడు రోజుల క్రితం నిర్వాసితుల అకౌంట్లలో ప్రభుత్వం జమ చేసింది. శివన్నగూడెం, కిష్టరాయిపల్లి రిజర్వాయర్ల ముంపు బాధితులు డిమాండ్ల సాధన కోసం మర్రిగూడ మండల కేంద్రంలో కొన్ని రోజులుగా దీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నెల 15న మండల కేంద్రంలో బాధితులు రోడ్లపైకొచ్చి ధర్నాలు చేశారు. యువకులు విద్యుత్ టవర్లు ఎక్కి నిరసన తెలిపారు. ఈ నెల 20న మునుగోడులో జరిగిన సీఎం సభను అడ్డుకుంటారని నిర్వాసితులను ముందస్తు అరెస్టు చేశారు. సీఎం సభ తర్వాత బయటకు వచ్చిన బాధితులు మళ్లీ ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. ఇదంతా ఓవైపు జరుగుతుండగానే మరోవైపు నిర్వాసితుల ఖాతాల్లో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ డబ్బులు వేశారు. దీనికి ఒప్పుకోని నిర్వాసితులు వారి డిమాండ్లు పూర్తిస్థాయిలో పరిష్కరించాలని పట్టుబట్టారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్లే తమకు డబ్బులు వచ్చాయని బాధితులు చెప్పుకొంటున్నారు. దీంతో క్రెడిట్ రాజగోపాల్‌రెడ్డికి దక్కకుండా ఉండేందుకు భూ నిర్వాసితులను నాంపల్లి, మర్రిగూడ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు గురువారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌కు తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో మంత్రి జగదీశ్‌రెడ్డి నిర్వాసితులతో చర్చలు జరిపారు. జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డితో అక్కడి నుంచే ఫోన్లో మాట్లాడారు. శుక్రవారం నాంపల్లి మండలంలో పర్యటించాలని ఆదేశించారు. నిర్వాసితుల నుంచి గ్రీవెన్స్‌లు తీసుకుని సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు.
డిమాండ్ల పరిష్కారానికి హామీ
2021 నాటికి 18 ఏళ్లు నిండినవాళ్లకు పునరావాసం కల్పించాలని, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, గుర్రంగూడ ప్రాంతాల్లో 250 గజాలు ఇవ్వాలని బాధితులు కోరారు. ఇళ్లు కోల్పోయినవారికి మల్లన్నసాగర్ తరహాలో రూ.12.61 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్ల సర్వే సక్రమంగా చేయలేదని, పరిహారం విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని, మరోసారి సర్వే చేయాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి సమగ్ర సర్వే చేయిస్తామని హామీ ఇచ్చారు. మల్లన్నసాగర్ తరహాలో పరిహారం ఇవ్వడం సాధ్యం కాదని, పునరావాసం విషయంలో మాత్రం ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పినట్లు తెలిసింది. దీనికోసమే శుక్ర, శనివారాల్లో జిల్లా కలెక్టర్ నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో పర్యటిస్తారని సమాచారం.
