
- టాటా టెక్నాలజీ సహకారంతో నిర్వహణ
నిర్మల్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మరో నాలుగు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్(ఏటీసీ)లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక ఉత్తర్వులను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గం సత్తనపల్లిలో, ముథోల్ నియోజకవర్గ కేంద్రంలో, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని కన్నాలలో, ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ పరిధిలోని పొచ్చెరలో ఏటీసీలను ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ కు అప్పజెప్పింది. ఈ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రభుత్వానికి థ్యాంక్స్
భైంసా, వెలుగు: ముథోల్ నియోజకవర్గ కేంద్రంలో రూ.45.15 కోట్ల నిధులతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వానికి, టాటా కంపెనీకి ఎమ్మెల్యే రామారావు పటేల్ ధన్యవాదాలు తెలిపారు. భైంసాలో ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో మాట్లాడారు. ముథోల్‌లో ఐటీఐ కాలేజీ(అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్)ని మంజూరు చేయాలని గతంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబును కోరడంతో పాటు అసెంబ్లీలో ప్రస్తావించినట్లు చెప్పారు. దీంతో ప్రభుత్వం ఈ సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఈ కేంద్రం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని.. విద్యార్థులు, నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు.