- అటవీ భూముల సమస్యల పరిష్కారానికి సర్కార్ కీలక నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అటవీ భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. జిల్లాల్లోని అదనపు కలెక్టర్లను (రెవెన్యూ) సంబంధిత జిల్లాకు ‘ఎక్స్-అఫీషియో’ ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారులుగా నియమిస్తూ శుక్రవారం అటవీశాఖ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 'సర్వే, అటవీ సరిహద్దుల సెటిల్మెంట్లు' పథకాన్ని రద్దు చేసిన తర్వాత.. ఈ బాధ్యతలను జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు.
అయితే, జాయింట్ కలెక్టర్ల పదవిని రద్దు చేయడంతో ఆ స్థానంలో అదనపు కలెక్టర్ల (రెవెన్యూ) పదవిని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మార్పుతో ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్ (ఎఫ్ఎస్ఓ) విధులను నిర్వహించడానికి కొత్త అధికారులను నియమించాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్–హెచ్ఓఎఫ్ఎఫ్) అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
రిజర్వ్డ్ ఫారెస్ట్‌గా ప్రకటించాల్సిన భూమిపై వచ్చే అభ్యంతరాలను విచారించి, క్లెయిమ్స్తదితర అంశాలకు సంబంధించిన బాధ్యతలను ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లు నిర్వర్తించాల్సి ఉంటుంది. అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) ఆయా జిల్లాల్లోని అన్ని నోటిఫైడ్ ఫారెస్ట్ బ్లాక్‌ల్లో ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు.
