నాగులపేట్​ సైఫాన్‌ .. అభివృద్ధిపై నిర్లక్ష్యం

నాగులపేట్​ సైఫాన్‌ .. అభివృద్ధిపై నిర్లక్ష్యం
  • పర్యాటక కేంద్రంగా డెవలప్​చేయడంలో సర్కార్​ అలసత్వం 
  • నెరవేరని లీడర్ల హామీలు
  • వాగులోని ఇసుకపై  అక్రమార్కుల కన్ను
  • వాగు కింది నుంచి కాలువ నీరు వెళ్లేలా నిర్మించిన అద్భుత కట్టడం 

జగిత్యాల, వెలుగు: ఆసియాలోనే అద్భుత కట్టడంగా గుర్తింపు పొందిన  నాగులపేట్​ సైఫాన్‌ అభివృద్ధిపై సర్కార్​ నిర్లక్ష్యం చూపుతోంది. దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్న అధికార పార్టీ లీడర్ల మాటలు హామీలుగానే ఉన్నాయి. వాగు కింది నుంచి ఎస్‌ఆర్ఎస్‌పీ కాలువ ప్రవహించేలా ఈ కట్టడం నిర్మించారు.  అయితే వాగులోని ఇసుకపై అక్రమార్కుల కన్ను పడడంతోనే ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా డెవలప్​ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.  ఇటీవల కోరుట్ల పట్టణంలోని గంగపేట్ ప్రాంతంలోని 11వ శతాబ్దపు కోనేరు(మెట్లబావి)కు పూర్వవైభవం తీసుకొచ్చేలా బల్దియా ఆఫీసర్లు పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీంతోపాటు సైఫాన్‌ను కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

హామీలుగానే  నేతల మాటలు 

నాగులపేట్ సైఫాన్​ను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామన్న లీడర్ల హామీలు నెరవేరడం లేదు. నిజామాబాద్ మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవిత, స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్‌‌రావు నాగులపేట్​సైఫాన్‌ను టూరిస్ట్​స్పాట్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చి మరిచారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.  సైఫాన్ అభివృద్ధి, సుందరీకరణ పనులకు సుమారు రూ. కోటి అవసరమని ఎస్​ఆర్​ఎస్​పీ ఆఫీసర్లు ఏడాది కింద నివేదికలు రూపొందించి సర్కార్‌‌కు అందజేశారు. అయినా ఫండ్స్ రిలీజ్ కాకపోవడంతో సుందరీకరణ పనులు మొదలుకాలేదు. వానాకాలంలో వచ్చిన వరదలతో సైఫాన్‌పై వాగులో నిర్మించిన సీసీ రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఆఫీసర్లు ఇటీవల రూ.23 లక్షలతో పునర్నిర్మాణ పనులు చేపట్టారు. 

వాగు ఇసుకపై అక్రమార్కుల కన్ను 

మరోవైపు సైఫాన్ సమీపంలోని వాగులో  ఇసుకపై అక్రమార్కుల కన్నుపడింది. దీనికి అధికార పార్టీకి చెందిన కొందరు లీడర్లు మద్దతు ఉండడంతో సైఫాన్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనలు పెండింగ్‌లోనే పడుతున్నాయి.  పర్యాటక కేంద్రంగా డెవలప్​ అయితే ఇక్కడి ఇసుక తరలించేందుకు వీలుకాదన్న ఉద్దేశంతో కొందరు అక్రమార్కులు అడ్డంకులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక రవాణాతో వాగులో పెద్ద గోతులు ఏర్పడుతున్నాయని, దీంతో సైఫాన్‌కు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు.

 అద్భుత కట్టడం నాగులపేట్​ సైఫాన్

1968లో ఎస్సారెస్పీ కాకతీయ కాలువ నిర్మించేటప్పడు కోరుట్ల మండలం నాగులపేట్ వద్దనున్న వాగు అడ్డంకిగా మారింది.  దీంతో గ్రామస్తులు వాగును కాపాడాలని కోరడంతో అప్పటి ఎస్​ఆర్​ఎస్​పీ చీఫ్ ఇంజనీర్ రామకృష్ణం రాజు సైఫాన్ నిర్మించాలని నిర్ణయించారు.  వాగు కింది భాగంలో 400 అడుగుల మేర 5 ద్వారాల గుండా కాకతీయ కాలువ నీరు ప్రవహించేలా నిర్మించారు.  ఎలాంటి మిషినరీ సాయం లేకుండా నాటి ఇంజినీరింగ్​నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిన ఈ నిర్మాణం ఆసియాలోనే అద్భుత కట్టడంగా ప్రఖ్యాతిగాంచింది. ఘన చరిత్ర కలిగిన ఈ నిర్మాణంపై సర్కార్​ నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఆ ప్రాంతమంతా ముళ్ల కంచెలతో కనీసం దగ్గరికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. 

ప్రభుత్వానికి నివేదించాం 

వరదలతో సైఫాన్ పైనున్న సీసీ రోడ్డు డ్యామెజ్ అయ్యింది. రూ.23 లక్షలతో పునర్నిర్మాణ పనులు చేపట్టి రోడ్డు పూర్తి చేశాం. ఎమ్మెల్యే, ఉన్నతాధికారుల ఆదేశాలతో సైఫాన్ అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ.కోటి ఎస్టిమేషన్‌తో రిపోర్టు తయారు చేసి సర్కార్‌‌కు నివేదించాం. 

బుర్రి వెంకటేశ్‌, ఏఈఈ, ఎస్‌ఆర్‌‌ఎస్‌పీ