
- పట్టించుకోనిరాష్ట్ర ప్రభుత్వం..డేంజర్లో పబ్లిక్ హెల్త్
- ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, పోలీసుల మధ్య సమన్వయ లోపం
- తూతూ మంత్రంగా దాడులు.. కేసులు
- కొద్దిరోజుల్లోనే రీఓపెన్ అయితున్న దందాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కల్తీ ఆహార పదార్థాలు కంట్రోల్ చేయడంలో సర్కార్ నిర్లక్ష్యం వహిస్తున్నది. అల్లం నుంచి మొదలు ఐస్‌క్రీమ్‌లు, పాల వరకు కల్తీ చేస్తున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్నది. దీంతో పబ్లిక్ హెల్త్ డేంజర్లో పడుతున్నది. నిరంతరం తనిఖీలు చేస్తూ కల్తీని కంట్రోల్ చేయాల్సిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నామమాత్రంగా దాడులు జరిపి తూతూ మంత్రంగా కేసులు, నోటీసులతో సరిపెడుతున్నారు. సర్కార్ నుంచి సీరియస్ చర్యలు లేకపోవడంతో మళ్లీ ఆయా సెంటర్లు, ఫ్యాక్టరీలు కొద్ది రోజుల్లోనే రీఓపెన్ అవుతున్నాయి. తమ కల్తీ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగినప్పుడు ఆఫీసర్లు ఒకటి రెండ్రోజులు హడావుడి చేస్తూ ఆ తర్వాత సైలెంట్ అవుతున్నారు. కల్తీ ఫుడ్ కంట్రల్ చేయాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు మధ్య సమన్వయం లేకపోవడం కూడా కల్తీ దందా చేసేవాళ్లకు కలిసొస్తున్నది. కల్తీ కంట్రోల్ కోసం హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ, జిల్లాల్లో డైరెక్టర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ కింద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. ఎవరి పరిధిలో వారు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయకపోవడటంతో విచ్ఛలవిడిగా కల్తీ ఆహారం మార్కెట్లోకి వస్తున్నది. అయితే సరిపడినంత స్టాఫ్ లేకపోవడంతో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేకపోతున్నామని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అంటున్నారు. గ్రేటర్లో 30 సర్కిల్స్ ఉండగా ప్రస్తుతం 16 మంది ఉన్నారు. జిల్లాల్లో అయితే జిల్లాకి ఇద్దరు ఉన్నారు.
అసలు బాధ్యత వీరిదే..
కల్తీ ఆహార పదార్థాలపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఫుడ్ సేఫ్టీ ఆఫీర్లదే. వీరు పోలీసుల సహకారంతో దాడులు జరపవచ్చు. దీంతో పాటు పోలీసులకు కూడా సపరేట్గా దాడులు జరిపేందుకు వీలుంది. అయితే కల్తీ ఆహారాన్ని గుర్తించేందుకు తిరిగి ఫుడ్ ఫేఫ్టీ అధికారులను సంప్రదించాలి.. కానీ ఎక్కడా ఇది సరిగా జరగట్లేదు. ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం ఫుడ్ కల్తీ చేసే వాళ్లకు వరంగా మారింది. కల్తీ ఫుడ్‌పై ఎవరికి ఫిర్యాదు చేయాలనే దానిపై కూడా ప్రజలు కన్ఫూజన్లో ఉన్నారు. కల్తీ ఫుడ్ కంట్రోల్ బాధ్యత వాస్తవానికి ఫుడ్ సేఫ్టీ ఆఫీర్లదే అయినప్పటికీ.. దీనిపై తమకు ఫిర్యాదు చేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లేదు.
హోటళ్లు, రెస్టారెంట్లకే పరిమితం..
ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లపైనే దృష్టి పెడుతున్నారు. ఫుడ్ బాగాలేదని, ఫుడ్‌లో పురుగులు వచ్చాయని వస్తున్న ఫిర్యాదులపై దృష్టి పెడుతున్నారు. కానీ ఆహార పదార్థాలు తయారు చేసే ఫ్యాక్టరీలు, సెంటర్లపై దాడులు చేయడం లేదు. ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అల్లం నుంచి ఐస్ క్రీమ్స్ వరకు, చిన్నారులు ఎక్కువగా తినే చాక్లెట్లు, స్నాక్స్ కల్తీ చేస్తున్నా.. పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ రాత్రి వేళల్లో హైదరాబాద్ లో విక్రయిస్తున్న ఐస్ క్రీమ్ లపై రేటుతో పాటు కంపెనీల వివరాలు కూడా ఉండటంలేదు. చాలా మంది వాటిని తింటూ అనారోగ్యం పాలైతున్నారు. గుర్తించిన కొద్ది మంది ట్విట్టర్, సోషల్ మీడియా, నేరుగా చేస్తున్న ఫిర్యాదులపైనే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కానీ సొంతంగా తనిఖీలు చేస్తూ కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న సెంటర్లను గుర్తించి కేసులు పెట్టడం లేదు.
నామమాత్రంగా దాడులు, తూతూ మంత్రంగా కేసులు...
కల్తీ దందా కేంద్రాలపై నామమాత్రంగా దాడులు జరిపి.. తూతూ మంత్రంగా కేసులు నమోదు చేస్తున్నారు. కల్తీ పదార్థాలు తయారు చేసే కంపెనీల నుంచి కల్తీ ఫుడ్ సర్వ్ చేస్తున్న హోటళ్లు, రెస్టారెంట్ల వరకు వేటిపైనా కఠిన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో కేసులు నమోదైనా.. ఆయా దందాలు తిరిగి కొనసాగిస్తున్నారు. కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప కల్తీ ఫుడ్ దందాను అరికట్టలేని పరిస్థితి. లేకపోతే ప్రజారోగ్యం మరింత ప్రమాదంలో పడుతుందని డాక్టర్లు, హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు జరిపి కల్తీ ఫుడ్ తయారీ సెంటర్లు, కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
నిరంతరం పర్యవేక్షణ ఉండాలె
బయటి ఫుడ్ తినే అలవాటు పెరుగుతున్న నేఫథ్యంలో ఆహార పదార్థాల తయారీ కేంద్రాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లపై నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉండాలె. ఫుడ్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్‌ల సంఖ్య పెంచి తనిఖీలు చేస్తూ కేసులు బుక్ చేస్తే కల్తీని నియంత్రించవచ్చు. కల్తీ ఫుడ్‌పై ప్రజలు వెంటనే ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించాలె. వచ్చిన ఫిర్యాదులపై వేగంగా స్పందించి, చర్యలు తీసుకోవాలి. లేదంటే కల్తీ ఫుడ్‌తో ప్రజారోగ్యంపై దెబ్బ పడుతుంది. కల్తీ ఫుడ్‌తో లివర్, కిడ్నీలు పాడై ప్రాణాలూ పోయే ప్రమాదం ఉంది.
- డాక్టర్ విజయ భాస్కర్,
రవి హెలియోస్ హాస్పిటల్
చర్యలు తీసుకుంటున్నం
ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నం. ఫిర్యాదులు వచ్చిన వాటితో పాటు రెగ్యులర్ గా హోటళ్లు, రెస్టారెంట్లపై ప్రత్యేక నిఘా పెడుతున్నం. వచ్చిన ఫిర్యాదులపై శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ కి పంపిస్తున్నం. రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటున్నాం.
- సుదర్శన్ రెడ్డి,
గెజిటెడ్ ఫుడ్ ఇన్ స్పెక్టర్, జీహెచ్ఎంసీ