డ్రిప్‌‌ ఇరిగేషన్‌‌కు సర్కార్‌‌ చేయూత.. 90 శాతం సబ్సిడీతో పరికరాలు అందిస్తోన్న ప్రభుత్వం

డ్రిప్‌‌ ఇరిగేషన్‌‌కు సర్కార్‌‌ చేయూత.. 90 శాతం సబ్సిడీతో పరికరాలు అందిస్తోన్న ప్రభుత్వం
  • జీఎస్టీ తగ్గింపుతో రైతులకు మరింత మేలు
  • ఆయిల్‌‌పామ్ రైతులకు ఊరట
  • రాష్ట్రంలో పెరగనున్న మైక్రో ఇరిగేషన్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: డ్రిప్‌‌ ఇరిగేషన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌కు రాష్ట్ర సర్కార్‌‌ ఊతమిస్తోంది. బిందు సేద్యం చేపట్టే రైతులకు 90 శాతం సబ్సిడీతో పరికరాలను అందజేస్తోంది. దీంతో రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్‌‌ విస్తరణకు మార్గం సుగమం అవుతోంది. మరో వైపు డ్రిప్‌‌ ఇరిగేషన్‌‌ పరికరాలపై మొదట్లో 18 శాతం జీఎస్టీ ఉండగా.. దానిని గతంలో 12 శాతానికి, తాజాగా ఐదు శాతానికి తగ్గించడంతో రైతులకు భారం తగ్గినట్లైంది. జీఎస్టీ తగ్గింపుతో ఆయిల్‌‌పామ్‌‌ రైతులకు భారీ ఊరట లభించింది. 

పెరగనున్న ఆయిల్‌‌పామ్‌‌ సాగు
జీఎస్టీ తగ్గింపు ఆయిల్ పామ్‌‌ రైతులకు వరంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2.72 లక్షల ఎకరాల్లో 73,696 మంది రైతులు ఆయిల్‌‌పామ్ సాగు చేస్తున్నారు. వచ్చే మూడేండ్లలో ఈ సాగును 10 లక్షల ఎకరాలకు విస్తరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఏటా 2 లక్షల ఎకరాల్లో సాగు చేయడానికి కంపెనీలతో సమన్వయం చేసుకుంటోంది. ఈ క్రమంలో డ్రిప్ పరికరాలపై జీఎస్టీ తగ్గింపుతో రైతులకు మరింత మేలు కలుగుతుందని ఆఫీసర్లు అంటున్నారు.

గాడిన పడుతున్న మైక్రో ఇరిగేషన్‌‌
సబ్సిడీ ఇవ్వడంతో పాటు జీఎస్టీ తగ్గింపు నిర్ణయాలతో రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్‌‌ పథకాలు మళ్లీ గాడిన పడుతున్నాయి. బీఆర్ఎస్‌‌ సర్కార్‌‌ నిర్లక్ష్యం కారణంగా ఏడేండ్లుగా నిలిచిపోయిన మైక్రో ఇరిగేషన్‌‌ పథకాలను అమలు చేసేందుకు కాంగ్రెస్‌‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్రం మోడ్రనైజేషన్‌‌ ఆఫ్‌‌ కమాండ్‌‌ ఏరియా అండ్‌‌ వాటర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ (ఎంసీఏడీడబ్ల్యూఎం) పథకాన్ని ప్రకటించింది. పీఎం కృషి సించాయ్‌‌ యోజన కింద 2025–26లో అమలయ్యే ఈ స్కీమ్ ద్వారా డ్రిప్ ఇరిగేషన్‌‌కు నిధులు అందనున్నాయి.

రాష్ట్రం తన వంతు వాటాను గత బడ్జెట్‌‌లో కేటాయించింది. నాబార్డు రుణ సాయం కూడా అందుబాటులోకి  రానుంది. ఇరిగేషన్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ ట్రాన్స్‌‌ఫర్ (ఐఎంటీ) సొసైటీలు, ఫార్మర్‌‌ ప్రొడ్యూసర్స్‌‌ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌‌పీఓ), ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్) సహకారంతో ఈ పథకాన్ని నిర్వహించనున్నారు. ఈ పథకాలకు ఐదేండ్ల పాటు ప్రభుత్వం సాయం అందించడంతో పాటు పైప్‌‌లైన్ ఏర్పాటుకు 60 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. 

మెట్ట ప్రాంత రైతులకు మేలు
రాష్ట్రంలో భూగర్భజలాలతో 40 లక్షల ఎకరాలకు పైగా సాగు జరుగుతోంది. మెట్ట ప్రాంతాలు, నీటి కొరత ఉన్న మండలాల్లో డ్రిప్‌‌ వ్యవస్థే రైతులకు ప్రాణాధారం. డ్రిప్, స్ప్రింక్లర్ వ్యవస్థతో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించొచ్చు. ఎరువులు, కరెంట్‌‌, నిర్వహణ ఖర్చులు తగ్గి పంట నాణ్యత మెరుగుపడుతుంది. చెరుకు, పత్తి, మిరప, పొగాకు, కూరగాయలు, పూలతోటలు, ఆయిల్‌‌పామ్ వంటి పంటలకు డ్రిప్‌‌ ఇరిగేషన్‌‌ అనుకూలంగా ఉంటుంది. డ్రిప్ పరికరాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ, సన్నకారు రైతులకు 90 శాతం, ఇతర పేద రైతులకు 80 శాతం వరకు సబ్సిడీని అందిస్తోంది.