కాళేశ్వరం వరద ముంపు నుంచి ఎట్లా బయటపడాలె

కాళేశ్వరం వరద ముంపు నుంచి ఎట్లా బయటపడాలె

హైదరాబాద్‌‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తలెత్తిన వరద ముంపు నుంచి ఎట్లా బయటపడాలనే ఆలోచనలో ప్రభుత్వం పడింది. ముంపుపై సమగ్ర అధ్యయనం కోసం ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ సర్కారు అనుమతి కోరింది. సీఎం కేసీఆర్‌‌ గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇస్తే ఈ సమస్యకు పరిష్కారాలు కనుగొనే ప్రయత్నాలు చేపట్టనుంది. ఈ ఫ్లడ్‌‌ సీజన్‌‌లో ప్రాణహితకు తోడు, గోదావరి ఉప్పొంగడంతో కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్‌‌లు, మంచిర్యాల, రామగుండం, మంథని పట్టణాలతో పాటు పలు గ్రామాలు నీట మునిగాయి. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా వంద కిలోమీటర్లు దిగువకు వచ్చి మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించడంతోనే ముంపు సమస్య తలెత్తినట్టు ఇంజనీర్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. భవిష్యత్‌‌లో వరద పోటెత్తితే ముంపు సమస్య మళ్లీ తలెత్తే ఆస్కారం ఉండటంతో దాని నుంచి ఎలా బయట పడాలనే మార్గాలు అన్వేషించడానికి స్టడీ చేయనునున్నారు.

మేడిగడ్డతోనే ముంపు
జులై రెండో వారంలో ప్రాణహిత, గోదావరికి భారీ వరదలు వచ్చాయి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన పంపుహౌస్‌‌ కన్నెపల్లితో పాటు దానికి ఎగువన ఉన్న అన్నారం పంపుహౌస్‌‌ నీట మునిగాయి. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్‌‌ వాటర్‌‌తో మంచిర్యాల, రామగుండం, మంథని పట్టణాలు, చుట్టుపక్కల పలు గ్రామాలు మునిగిపోయాయి. మూడు, నాలుగు రోజులు కొన్ని ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. గతంలో గోదావరికి వరద పోటెత్తితే కేవలం భద్రాచలం పరిసర ప్రాంతాలు మాత్రమే ముంపునకు గురయ్యేవి. ఈ సారి పరిస్థితి మారింది. ఇందుకు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలే కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, ముంపు ఎక్కువగా అటవీ ప్రాంతంలోనే ఉండేదని సీనియర్‌‌ ఇంజనీర్లు చెప్తున్నారు. ప్రాణహిత ప్రవాహానికి మేడిగడ్డ బ్యారేజీ అడ్డంగా ఉండటం, అదే సమయంలో గోదావరి నుంచి భారీగా వరద రావడంతో నీళ్లు పైకి ఎగదన్ని ముంపు ప్రభావం ఎక్కువగా ఉందనే అంచనాకు వచ్చారు. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మిస్తే మంచిర్యాలకు ముంపు ప్రభావం ఎక్కువగా ఉంటుందనే హెచ్చరికలతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నారని, మేడిగడ్డ వద్ద బ్యారేజీ 
నిర్మాణంతో వరద ప్రభావంపై కనీసం అధ్యయనం చేయకపోవడంతోనే ఇలా జరిగిందని చెప్తున్నారు. దీనికి పరిష్కారాలు కనుగొనకపోతే ఏటా భద్రాచలం పరిసర ప్రాంతాల్లో మాదిరిగానే రామగుండం, మంచిర్యాల, మంథని సమీప ప్రాంతాలకు ముంపు తప్పదని హెచ్చరిస్తున్నారు.

ఎల్లంపల్లి నుంచి మొదలు
కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు తెలంగాణ పొడవునా గోదావరితో వరద ముంపు తలెత్తే అన్ని ప్రాంతాల్లో సమగ్రమైన స్టడీ చేయించాలని ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ప్రతిపాదించింది. ఎల్లంపల్లి నుంచి ఏపీలోని కూనవరం వరకు 405 కి.మీ.ల పొడవునా వరద ముంపుపై ఒక సంస్థతో స్టడీ చేయించాలని, ఇందుకు రూ.7 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశముందని ప్రభుత్వానికి నివేదించింది. మొన్నటి వరదలకు మంచిర్యాల, రామగుండం, మంథని, భద్రాచలం పట్టణాలతో పాటు అశ్వాపురం మండలంలోని 18 గ్రామాలు, బూర్గంపాడులోని 12, భద్రాచలంలోని 5, చర్లలోని 28, దుమ్ముగూడెంలోని 25, పినపాక మండలంలోని 11 గ్రామాలు నీట మునగ్గా.. ఈ ప్రాంతాలను వరద ముంపు నుంచి రక్షించడానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై స్టడీ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ స్టడీకి సంబంధించిన ఫైల్‌‌ సీఎం కేసీఆర్‌‌ పరిశీలనలో ఉందని, ఆయన గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇస్తే వెంటనే అడ్మినిస్ట్రేటివ్‌‌ శాంక్షన్‌‌ ఇచ్చి, నామినేషన్‌‌ పద్ధతిలో ఏజెన్సీకి అధ్యయన బాధ్యతలు అప్పగిస్తారని తెలిసింది.