పటేల్ చొరవతోనే ఇండియాలో హైదరాబాద్: రాజ్యసభ మెంబర్ డాక్టర్ కె.లక్ష్మణ్

పటేల్ చొరవతోనే ఇండియాలో హైదరాబాద్: రాజ్యసభ మెంబర్ డాక్టర్ కె.లక్ష్మణ్

పద్మారావునగర్, వెలుగు: సర్దార్​ వల్లభాయ్​ పటేల్​ చొరవ వల్లే హైదరాబాద్​ మనకు దక్కిందని, లేదంటే ఇస్లాం దేశంగా, లేదా పాకిస్థాన్​ ఆధీనంలో ఉండేదని రాజ్యసభ సభ్యుడు డాక్టర్​ కె.లక్ష్మణ్​ అన్నారు. పటేల్‌ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 25 వరకు ఏక్తా మార్చ్‌  కార్యక్రమం  నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం కవాడిగూడ సీజీవో టవర్స్ లోని పీఐబీ కాన్ఫరెన్స్​ హాల్​ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్‌ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడంలో పటేల్‌ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయన చొరవతో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని 565 సంస్థానాలు ఇండియాలో విలీనమయ్యాయన్నారు. ఏక్తా మార్చ్‌ పాదయాత్రల్లో స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానం చేయనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా స్థాయి పాదయాత్ర పోస్టర్‌ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్‌  మాధవి కొల్లి, ఏక్తా మార్చ్‌ నామినేట్‌ సామల పవన్‌ రెడ్డి, ఎన్ఎస్ఎస్‌ జిల్లా యువజన అధికారి సైదానాయక్, మై భారత్‌ హైదరాబాద్‌ జిల్లా యువజన అధికారి ఖుష్బు గుప్తా పాల్గొన్నారు.