ట్రంప్‌కు దెబ్బ మీద దెబ్బ.. న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ.. వర్జీనియా లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా గజాలా హష్మీ విక్టరీ

ట్రంప్‌కు దెబ్బ మీద దెబ్బ.. న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ.. వర్జీనియా లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా గజాలా హష్మీ విక్టరీ

అమెరికా ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. న్యూయార్క్ ఎన్నికల్లో మేయర్ పీఠంతో పాటు వర్జీనియా లెఫ్ట్ నెంట్ గవర్నర్ పదవి కూడా  ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ ఖాతాలో పడింది. న్యూయార్క్ మేయర్ పీఠానికి జరిగిన ఎన్నికల్లో ఇండో అమెరికన్ ముస్లిం అయిన జోహ్రాన్ గెలుపొంది చరిత్ర సృష్టించాడు. న్యూయార్క్ పీఠాన్ని అధిష్టించనున్న తొలి ఇండో అమెరికన్ ముస్లిం జోహ్రాన్ కావడం విశేషం. అదే క్రమంలో ఆసియా నుంచి న్యూయార్క్ పీఠాన్ని ఎక్కువతున్న తొలి వ్యక్తి జోహ్రాన్.

మరోవైపు న్యూయార్క్ పీఠంతో పాటు వర్జీనియా లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా హైదరాబాద్ మూలాలున్న గజాలా హష్మీ గెలుపొంది ట్రంప్ ప్రభుత్వానికి షాకిచ్చింది. వర్జీనియాకు రాష్ట్రానికి పనిచేస్తున్న తొలి ముస్లిం మహిళగా, దక్షిణ ఆసియా నుంచి తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించింది. 

గజాల హష్మీ 2019లో రాజీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వర్జీనియా జనరల్ అసెంబ్లీకి సభ్యురాలుగా ఎన్నికయ్యారు. ఐదేండ్ల తర్వాత సెనేట్ విద్యా, ఆరోగ్య కమిటీకి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ప్రజల స్వేచ్ఛ, విద్యా విధానాలపై ఆమె చూపించిన మార్పు అక్కడి ప్రజలను ఆకట్టుకుంది. 

గజాలా హష్మీ గురించి:

గజాలా హష్మీ 1964లో హైదరాబాద్ లో జియా హష్మీ, తన్వీర్ హష్మీ దంపతులకు జన్మించారు. బాల్యం అంతా అమ్మమ్మ వాళ్లతో మలక్ పేట్ లో పెరిగారు. ఆమె తండ్రి ప్రొఫెసర్ జియా హష్మీ అమెరికాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ జార్జియాలో సెటిల్ అవ్వడంతో .. ఆ తర్వాత తల్లితో కలిసి ఆమె కూడా యూఎస్ కు వెళ్లారు. ఆమె తల్లి తన్వీర్ హష్మీ బీఏ, బీఈడీ స్టూడెంట్. ఉస్మానియా యూనివర్సిటీ కోటి కాలేజీలో చదువుకున్నారు. 

హష్మీ జార్జియా సౌతర్న్ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందరు. అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సిటీలో అమెరికన్ లిటరేచర్ పైన పీహెచ్.డీ అందుకున్నారు. 30 ఏళ్లుగా ప్రొఫెసర్ గా పనిచేసిన హష్మీ.. 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించి.. ఐదేళ్లు తిరగక ముందే లెఫ్ట్ నెంట్ గవర్నర్ స్థాయికి చేరుకోవడం విశేషం. 

న్యూయార్క్ మేయర్ గా జోహ్రాన్ ఎన్నిక:

న్యూయార్క్ మేయర్ పీఠానికి జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్స్ అధికార రిపబ్లికన్లకు షాకిచ్చారు. డెమొక్రాట్స్ అభ్యర్థి జోహ్రాన్ ప్రత్యర్థి ఆండ్రూ క్యూమోపై దాదాపు రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచి ట్రంప్ అధికార గర్వంపై పెద్ద దెబ్బ కొట్టాడు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మొత్తం 75 శాతం ఓట్లు పోలవ్వగా అందులో జోహ్రాన్ మమ్దానీ10 లక్షల 22 వేల ఓట్లు ( 50.4 శాతం) సాధించాడు. ప్రత్యర్థి ఆండ్రూ క్యూమో 8 లక్షల 44 వేల ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు. 

అధికారానికి దూరంగా ఉన్న డెమొక్రాట్లకు అనూహ్య విజయాన్ని అందించిన జోహ్రాన్.. చిన్న వయసులో న్యూయార్క్ పీఠాన్ని అధిష్టించబోతున్న వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నాడు. న్యూయార్క్ మేయర్ గా 2026 జనవరి 1 న ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. 

గెలుపు తర్వాత జోహ్రాన్ ఎక్స్ (ట్విట్టర్) లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. న్యూయార్క్ సబ్ వే ట్రైన్.. సిటీ హాల్ స్టేషన్ లో ఆగుతుండగా.. డోర్స్ ఓపెన్ అవుతుండగా.. జోహ్రాన్ ఫర్ న్యూయార్క్ సిటీ.. అనే టైటిల్స్ పడుతున్న వీడియో ను పోస్ట్ చేసి తన గెలుపును షేర్ చేసుకున్నాడు జోహ్రాన్.

న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా క్వీన్స్ బరోకు ప్రాతినిధ్యం వహించిన జోహ్రాన్..  ప్రసిడెంట్ ట్రంప్ విధానాలపై ఘాటైన విమర్శలతో ప్రజల్లో పాపులారిటీ సాధించాడు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్న వినూత్న ప్రచారం ఆయనను ప్రజలకు చేరువ చేసింది. అద్దెను తగ్గించడం, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, పిల్లల సంరక్షణ వంటి ప్రాతిపాదనలతో ఎన్నికల్లో ర్యాలీల్లో ఆకట్టుకున్నాడు.