- వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని దారుణం
- గత నెల 25న వనపర్తి జిల్లాలో ఘటన
వనపర్తి, వెలుగు : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసిన కేసులో భార్యతో పాటు ఆమె ప్రియుడిని వనపర్తి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రావుల గిరిధర్ మంగళవారం స్థానిక ఆఫీస్‌లో వెల్లడించారు. టౌన్ పీఎస్ పరిధిలోని గణేశ్‌నగర్‌కు చెందిన కురుమూర్తి స్థానికంగా ఉన్న ఓ మాల్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య నాగమణికి మెట్టుపల్లికి చెందిన నందిమల్ల శ్రీకాంత్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపాలని నాగమణి నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 25న రాత్రి నాగమణి, శ్రీకాంత్ కలిసి కురుమూర్తికి మద్యం తాగించారు.
అతడు మత్తులోకి వెళ్లాక గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం ఓ కారును అద్దెకు తీసుకుని అందులో డెడ్‌బాడీని తీసుకెళ్లి శ్రీశైలం ప్రాజెక్ట్ సమీపంలో పడేశారు. తమ మీదకు అనుమానం రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో.. తన భర్త కనిపించడం లేదని టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీ, ఇతర ఆధారాలను పరిశీలించగా... నాగమణి, శ్రీకాంత్‌పై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించడంతో తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.
దీంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకున్న సీఐ కృష్ణయ్య, ఎస్సైలు హరిప్రసాద్, శశిధర్, జగన్, రాము, కానిస్టేబుళ్లు నవీన్‌గౌడ్, అభిషేక్‌ను ఎస్పీ అభినందించి, రివార్డులు అందజేశారు. సమావేశంలో వనపర్తి డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, డీఎస్పీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
