వడ్ల కొనుగోళ్లలో వెనుకబడిన సర్కారు

 వడ్ల కొనుగోళ్లలో వెనుకబడిన సర్కారు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: వానాకాలం వడ్ల కొనుగోళ్లలో సర్కారు వెనుకబడింది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌ లో 1.12 కోట్ల వడ్లను సేకరించాలని టార్గెట్  పెట్టుకోగా 59.93 లక్షల టన్నుల వడ్లనే సర్కారు సేకరించింది. అంటే టార్గెట్‌‌‌‌‌‌‌‌లో 53 శాతం మాత్రమే సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లై శాఖ కొన్నది. ఇప్పటికే వడ్ల సేకరణ చివరి దశకు చేరినందున ఈసారి అనుకున్న టార్గెట్ పూర్తయ్యేట్లు కనిపించడం లేదు. పంట కోతలు ప్రారంభమైన నాటి నుంచే కొనుగోళ్లు చేపట్టకుండా పౌర సరఫరాల శాఖ నిర్లక్ష్యం చేసింది. కొనుగోలు కేంద్రాల్లో తాలు, తేమ పేరుతో తరుగు తీయడం, వెహికల్స్ రాక రైతులు ఇబ్బందిపడడం వంటి సంఘటనలతో రైతులు వడ్ల అమ్మకం తగ్గించారు. దీంతో ప్రైవేటు వ్యాపారులు పొలాల వద్దకే వెళ్లి పంట కొనడంతో కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు పడిపోతున్నాయి. 2022 అక్టోబరు 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 7,011 సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించగా  గడిచిన 71 రోజుల్లో  53శాతం ధాన్యం సేకరణ జరిగింది. ఇప్పటి వరకు 4,939 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి. రోజుకు కనీసం లక్ష టన్నులు కొనాల్సి ఉండగా.. సగం కూడా సేకరించడం లేదు. ఈవారంలో కొనుగోళ్లు పూర్తయ్యే చాన్స్​ ఉంది. దీన్ని బట్టి సేకరణ 65 లక్షల టన్నులకు మించే పరిస్థితి కనిపించడం లేదని నిపుణులంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 64.54 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఎకరానికి సగటున 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అంటే 1.61 కోట్ల టన్నుల వడ్ల దిగుబడి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. రైతుల అవసరాలు, ప్రైవేటు వ్యాపారుల కొనుగోళ్లు పోగా.. ఈయేడు 1.12 కోట్ల టన్నుల ధాన్యం సేకరించాలని సర్కారు టార్గెట్‌‌‌‌‌‌‌‌ పెట్టుకుంది. సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లై డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అక్టోబరు 22 నుంచి ధాన్యం సేకరిస్తున్నది. అయినా లక్ష్యానికి దగ్గరకు రాలేకపోయింది. దీంతో ఈవానాకాలం ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం వెనుకబడిందనేది స్పష్టమవుతోంది.

కొనుగోళ్లలో నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌

రాష్ట్రంలో జరిగిన వడ్ల కొనుగోళ్లలో ఇప్పటి వరకు నిజామాబాద్‌‌‌‌‌‌‌‌  టాప్ గా నిలిచింది. ఈ జిల్లాలో అత్యధికంగా 5.85 లక్షల టన్నుల వడ్ల కొనుగోళ్లు జరిగాయి. ఇక కామారెడ్డిలో 4.85 లక్షల టన్నులు,  నల్గొండలో 4 లక్షల టన్నులు, మెదక్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 3.94 లక్షల టన్నులు, జగిత్యాలలో 3.77 లక్షల టన్నులు, సిద్దిపేటలో 3.60 లక్షల టన్నులు, పెద్దపల్లిలో 2.87 లక్షల టన్నులు, యాదాద్రిలో 2.83 లక్షలు, సూర్యాపేటలో 2.56 లక్షల టన్నుల వరకు కొనుగోళ్లు జరిగాయని పౌర సరఫరాల శాఖ గణాంకాలు వెల్లడించాయి.

సెంటర్ల బాధలు పడలేక ప్రైవేటు వ్యాపారులకు

కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి వడ్లు సేక రించి, బస్తాలు నింపి, మిల్లింగ్‌‌‌‌‌‌‌‌కు పంపే దాకా అవసరమయ్యే సుత్లీ, కాంటా, రవాణా, గన్నీ సంచులు, హమాలీ చార్జీలన్నీ సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లై డిపార్ట్​మెంట్​ భరించాలి. వాస్తవానికి ఇవేమీ జరగడం లేదు. ఈ ఖర్చంతా రైతులపైనే పడుతున్నది. బస్తాకు రూ.2 చొప్పున క్వింటాల్​కు రూ.5 చార్జ్  చేస్తున్నారు. లారీ డ్రైవర్లకు భోజనాలు, ఇ తర ఖర్చులు కూడా రైతులే భరించాల్సి వస్తున్నది. హమాలీ ఖర్చు కింద క్వింటాల్​కు రూ.43 తీసుకుంటున్నారు. తాలు, తరుగు పేరిట బస్తాకు 2 కిలోలు కోత పెడుతుండడంతో ఈ బాధలు భరించలేక ధర తక్కువైనా తొందరగా పైసలు వస్తాయని పంటను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నరు. ఇప్పటికే 30 లక్షల టన్నుల ధాన్యం వ్యాపారులకు అమ్మినట్లు సమాచారం.