ఎర్రవల్లి గ్రామపంచాయతీలో..ఓట్లు చాలా కాస్ట్లీ గురూ!

ఎర్రవల్లి గ్రామపంచాయతీలో..ఓట్లు చాలా కాస్ట్లీ గురూ!
  • ఒక్కో ఓటుకు రూ.5 వేలు
  • గుర్తులు ఖరారు కాక ముందే చికెన్  పంపిణీ షురూ

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవల్లి గ్రామపంచాయతీలో ఓట్లు చాలా కాస్ట్​లీగా మారాయి. ఇక్కడ సర్పంచ్  పదవిని దక్కించుకునేందుకు అన్ని పార్టీల లీడర్లు ప్రెస్టేజ్ గా తీసుకుంటున్నారు. దీంతో ఒక్కో ఓటు రూ.5 వేలు పలుకుతోంది. గత సర్పంచ్  ఎన్నికల్లో ఎర్రవల్లి సర్పంచ్  పదవికి పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఒక్కో ఓటుకు రూ.5 వేల చొప్పున ఓటర్లకు పంచిపెట్టారు. ఈసారి కూడా సర్పంచ్  ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. 

మూడో  ఫేజ్ లో జరగనున్న ఎన్నికలకు శుక్రవారం నామినేషన్లకు చివరి రోజు అయినప్పటికీ, నామినేషన్లు వేసిన వారు గురువారం నుంచే చికెన్  పంపిణీ ప్రారంభించారు. మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కూల్  డ్రింక్స్ పంచిపెడుతున్నారు.

ఆదాయం ఎక్కువగా ఉండడంతోనే..

ఎర్రవల్లి జీపీకి మంచి ఆదాయం ఉండడం, అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడం, రియల్​ ఎస్టేట్  వ్యాపారం జోరుగా సాగుతుండడంతో సర్పంచ్​ స్థానాన్ని దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. సర్పంచ్  పదవి కోసం ఒక్కో అభ్యర్థి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. తమకు ఓటు వేస్తారనే నమ్మకం ఉన్న వెయ్యి మందికి రూ.5 వేల చొప్పున ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. 

ఎర్రవల్లిలో టెన్త్  బెటాలియన్, ఫ్యాక్టరీలు, సర్కిల్  ఆఫీస్ తో పాటు రెండు పోలీస్  స్టేషన్లు ఉండడం, ఇక్కడి భూములు మంచి ధర పలుకుతుండడంతో ఇక్కడి సర్పంచ్​ స్థానానికి డిమాండ్​ ఎక్కువగా ఉంది. గత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 1,823 ఓట్లు ఉన్నాయి. బెటాలియన్ లో ఏపీ ఓటర్లు ఉన్నారని పలువురు ఫిర్యాదు చేయడంతో ఎంక్వైరీ చేసి దాదాపు 250 ఓట్లు తొలగించారు. అయితే ఈసారి ఎర్రవెల్లి చౌరస్తాలో హోటల్స్, కిరాణ, కూల్ డ్రింక్, బట్టలు, పండ్ల షాపులు నడుపుకుంటున్న గ్రామస్తులు ఇక్కడే తమ ఓట్లను నమోదు చేసుకోవడంతో ఓటర్ల సంఖ్య 1,962కి చేరింది.

గుర్తులు ఖరారు కాక ముందే..

మూడో విడతలో ఎర్రబెల్లి గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నామినేషన్లకు చివరి రోజు కాగా, పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఇంకా గుర్తులు కేటాయించలేదు. అయినప్పటికీ రెండు రోజులుగా ఓటర్లకు చికెన్  పంపిణీ చేస్తున్నారు. గుర్తులు కేటాయించిన తరువాత ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మద్యం, చికెన్, ఇతర వస్తువుల పంపిణీ మరింత జోరుగా సాగుతుందని 
అంటున్నారు.

పంచాయతీ ఎన్నికల్లో యువత హవా

వనపర్తి, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపూరు గ్రామపంచాయతీ నుంచి కాంగ్రెస్​ మద్దతుతో నాగర్​కర్నూల్​ మెడికల్​ కాలేజీలో ఎంబీబీఎస్​ మూడో సంవత్సరం చదివే కేఎన్​ నిఖిత బరిలో ఉండగా, బీఆర్ఎస్​ మద్దతుతో సివిల్స్​కు ప్రిపేర్​ అవుతున్న గ్రీష్మ సర్పంచ్​ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. పెద్దమందడి మండలం మద్దిగట్ల నుంచి 9 మంది సర్పంచ్​ పదవికి పోటీ పడుతున్నారు. ఖిల్లాగణపురం మండలం సోలిపూరు సర్పంచ్​ స్థానానికి తోడికోడళ్లు పోటీ పడుతున్నారు.