- ఎన్నికల సింబల్స్‌గా కేటాయించిన వస్తువులకు మస్త్ డిమాండ్
- కత్తెర, దువ్వెన, ఉంగరం, బాల్, బ్యాట్ తదితరాలను బల్క్‌గా కొంటున్న వైనం
- కొన్ని చోట్ల వెండి, బంగారు ఉంగరాలు, హ్యాండ్ బ్యాగులకు ఆర్డర్లు
- ఉమ్మడి జిల్లాలో అసలైన వస్తువులు(గుర్తులు) పట్టుకొని ప్రచారం
కరీంనగర్, వెలుగు: రాజకీయ పార్టీల సింబల్స్‌తో జరిగే ఎన్నికలైతే పార్టీని బట్టి చేయి గుర్తు, కారు గుర్తు, పువ్వు గుర్తు అని ఓటర్‌కు ఓ క్లారిటీ ఉంటుంది. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులన్ని కొత్తవి కావడంతో.. అవి ఓటర్లకు గుర్తుండేలా చేయడం ఎలా అనేది అభ్యర్థులకు పెద్ద టాస్క్‌గా మారింది. అయితే వీటిని ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లేందుకు తమ కేటాయించిన గుర్తులను కొనుగోలు చేసి.. ఇంటింటికీ పంచేందుకు కొందరు ప్లాన్ చేస్తున్నారు.
గతంలో జరిగిన ఎన్నికల్లో కొన్ని గ్రామాల్లో ఉంగరం గుర్తు వచ్చిన అభ్యర్థులు వెండి, బంగారు ఉంగరాలను పంచినట్లే.. ఈ సారి ఉంగరం, కత్తెర, బాల్, బ్యాట్, హ్యాండ్ బ్యాగ్, బకెట్, టీ జల్లెడలను పంపిణీ చేసేందుకు బల్క్‌గా ఆర్డర్లు పెడుతున్నారు. దీంతో ఎన్నికల గుర్తులు వచ్చిన ఆట వస్తువులు, గృహోపరణాలతోపాటు ఉంగరాలకు కూడా ఎన్నికల పుణ్యమాని డిమాండ్ పెరిగింది.
గుబులు పుట్టిస్తున్న గుర్తులు..
గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు వారికి గుబులు పుట్టిస్తున్నాయి. కొన్ని గుర్తులు దగ్గరి పోలికలతో ఉండడంతో తమకు పడాల్సిన ఓట్లు మరొకరికి పడుతాయా అనే టెన్షన్ వారిలో నెలకొంది. సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించిన పేస్ట్, రిమోట్ కంట్రోలర్, బ్యాట్ చూడడానికి ఒకేలా కనిపిసస్తున్నాయి. అలాగే టీ జల్లెడ, బ్రష్ కూడా దగ్గరగా ఉన్నాయి. బిస్కట్, మంచం, పలక, బ్లాక్ బోర్డు కూడా దగ్గరి పోలికలతో ఉండడం అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేస్తున్న చోట సింబల్స్ విషయంలో ఇబ్బంది లేకపోయినా.. ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్నచోట్ల ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం కనిపిస్తోంది. వార్డు మెంబర్లకు కేటాయించిన గ్యాస్ స్టవ్, పెట్టె, బీరువా దగ్గరి పోలికలతో ఉన్నాయి. అలాగే గ్యాస్ సిలిండర్, పోస్టు డబ్బా, గాజు గ్లాసు గుర్తులు కూడా ఒకేలా కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది.
‘గుర్తు’పట్టకపోతే ఫలితం తారుమారు..
వార్డు మెంబర్ ఎన్నికలో ఎక్కువగా 5, 10 ఓట్ల తేడాతోనే గెలుపోటములు నిర్ణయమవుతాయి. సర్పంచ్ ఎన్నికల్లోనూ చాలాచోట్ల మెజార్టీ 50, 100 లోపే ఉంటాయి. అందుకే గుర్తుల విషయంలో కన్ ఫ్యూజ్ అయి ఒక గుర్తుకు బదులు మరో గుర్తుపై ఐదారుగురు వేసినా ఫలితం తారుమారవుతుంది. గుర్తులు ఒకేలా ఉంటే వృద్ధులు, కొంత దృష్టి లోపం ఉన్న ఓటర్లు గుర్తుపట్టడం ఇబ్బందిగా మారే అవకాశముంది. దీంతో తాము అనుకున్న అభ్యర్థికి కాకుండా ప్రత్యర్థికి ఓటు పడే ప్రమాదముంది.
