పంచాయతీ ఎన్నికల్లో.. మహిళా ఓటర్లే కీలకం

పంచాయతీ ఎన్నికల్లో.. మహిళా ఓటర్లే కీలకం
  • ఉమ్మడి మెదక్  జిల్లాలో 9,84,816 మంది మహిళా ఓటర్లు
  • 9,41,570 మంది పురుషులు 
  • గెలుపోటములు శాసించేది అతివలే

సిద్దిపేట, వెలుగు :  గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. జిల్లాలోని మొత్తం ఓటర్లలో పురుషుల కంటే 43,246 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. గెలుపోటములను శాసించే పరిస్థితుల్లో ఉన్న మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలపై ఔత్సాహికులు దృష్టి సారిస్తున్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మూడు విడతల్లో గ్రామ పంచాయతీలు ఎన్నికలు నిర్వహిస్తుండగా, మొదటి విడత నామినేసన్ల దాఖలు పూర్తయింది. 

ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం  19,23,442 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 9,41,570 మంది, మహిళలు 9,84,816 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే 43,246 మంది మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మూడు జిల్లాల్లో మొత్తం 1613 గ్రామ పంచాయతీలు, 14,098 వార్డులు  ఉండగా, వీటిలో మెజార్టీ గ్రామాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 

మహిళా ఓటర్ల ప్రసన్నానికి యత్నాలు..

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకంగా మారుతుండటంతో వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో నాయకులు ఉన్నారు. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ల దాఖలు పూర్తవడంతో మహిళా ఓటర్ల మద్దతు పొందేందుకు బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. పోటీలో నిలుస్తున్న అభ్యర్థులు ప్రత్యేకంగా మహిళలను కలిసి స్థానిక సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి హామీలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఒక గ్రామంలో రోడ్ల పై పెద్ద ఎత్తున గుంతలున్నాయని మహిళలు చెప్పడంతో పోటీ చేస్తున్న ఒకరు స్వంత ఖర్చులతో వాటిని పూడ్చి వేయగా, మరొక గ్రామంలో నీటి సమస్య పరిష్కారానికి స్వంత డబ్బులతో బోరు వేయిస్తానని హామీ ఇచ్చాడు.  

6,870 మంది మహిళలకు అవకాశం..

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ వార్డు స్థానాల్లో 6,870 మంది మహిళలు అధికార పగ్గాలు చేపట్టడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం రూపొందించిన రిజర్వేషన్ల ప్రకారం ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 738 సర్పంచ్, 6,132 వార్డు స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,613 సర్పంచ్, 14,098 వార్డు స్థానాల్లో దాదాపు 35 శాతం మహిళలకు రిజర్వ్  కావడంతో మహిళా ప్రాతినిధ్యం వహించే అవకాశం ఏర్పడింది.

మహిళా ఓటర్ల వివరాలు..

జిల్లా    మొత్తం ఓటర్లు    పురుషులు    మహిళలు

సంగారెడ్డి    7,44,157    3,68,270    3,78,843 

సిద్దిపేట    6,55,958    3,21,768    3,34,184

మెదక్    5,23,327    2,51,532    2,71,787