సర్కార్ భూములు అగ్గువకు అమ్ముతున్రు

సర్కార్ భూములు అగ్గువకు అమ్ముతున్రు
  • మార్కెట్ రేటు కంటే రూ. 10 కోట్లు తక్కువకే వేలం 
  • కోకాపేట్ భూముల వేలంలో రియల్ కంపెనీలకు మస్తు లాభం  
  • భారీ ఖర్చుతో డెవలప్ చేయనున్న హెచ్ఎండీఏ 
  • సిటీ కంపెనీలకే భూములు దక్కడంపై  అనుమానాలు  

హైదరాబాద్, వెలుగు: ఖాళీగా ఉన్న భూములను అమ్మి ఖజానా నింపుకొంటున్నామని రాష్ట్ర సర్కార్ చెప్తున్నా.. విలువైన భూములను అగ్గువకే రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెడ్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. బహిరంగ మార్కెట్ కంటే ఏకంగా 20 శాతానికి తక్కువగా భూములను అమ్ముతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వేలంలో భూములను కొనుగోలు చేస్తే రియల్ సంస్థలు రిస్క్ లేకుండా బిజినెస్ చేసుకునే ఫెసిలిటీ కూడా సర్కార్ కల్పిస్తోంది. వాయిదా పద్ధతిలో చెల్లింపులు, ఆంక్షల్లేని పరిమితులు, మల్టీ పర్పస్ కోసం వాడుకునే వీలు ఉన్న భూములను అగ్గువకు దక్కించుకుంటూ రియల్ సంస్థలు లాభాల బాట పడుతున్నాయి. గురువారం జరిగిన కోకాపేట్ భూముల వేలంలోనూ ఇదే జరిగింది. బహిరంగ మార్కెట్ కంటే ఎకరాకు ఏకంగా రూ. 10 కోట్లు తక్కువ ధరకే ప్రభుత్వం భూములను అప్పగించింది. ఆదాయం కోసం భూముల వేలం అని అంటున్నా.. రియల్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగానే సర్కార్ పాలసీ ఉందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.   

రూ. 1000 కోట్లు తక్కువకే అమ్మకం? 
హైదరాబాద్ సిటీలో రూ. 70 వేల నుంచి రూ. లక్ష పెడితే గానీ గజం జాగా దొరికే పరిస్థితి లేదు. ఐటీ కారిడార్ భూముల విలువ గజం లక్షన్నరపైనే ఉంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో ఎకరం ధర రూ. 60–80 కోట్లు పలుకుతోంది. రాళ్లు, రప్పలతో నిండి ఉన్న పడావ్ జాగాలకే ఈ స్థాయిలో రేటు పలికితే.. అన్ని సౌలతులతో డెవలప్ చేసిన భూములు బహిరంగ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యే పరిస్థితి ఉంది. ఈ లెక్కన కోకాపేట్ భూముల వేలంలో ప్రభుత్వానికి రూ. 3 వేల కోట్లు రెవెన్యూ రావాలి. కానీ రూ. 2 వేల కోట్లు మాత్రమే వచ్చింది. సగటున ఎకరానికి రూ. 40 కోట్లు వచ్చిందని హెచ్ఎండీఏ చెబుతున్నప్పటికీ, బహిరంగ మార్కెట్‌లో దీని విలువకు 20 శాతం తక్కువ ధరలో క్లియర్ టైటిల్ తో విలువైన భూములు చేతులు మారుతున్నాయని అంటున్నారు. గతంలో ఉప్పల్‌‌‌‌‌‌‌‌ భగాయత్ భూముల వేలంలోనూ ఇదే జరిగింది. గజానికి సగటున రూ. 40 వేలు దాటలేదు. కానీ బహిరంగ మార్కెట్‌లో మాత్రం అక్కడ గజం ధర రూ. 73 వేలు ఉండటం గమనించదగ్గ విషయం. 

బడా కంపెనీలకు లాభం
వేలంలో భూములు దక్కించుకునే బడా కంపెనీలకు ప్రభుత్వ ఖర్చులతో భూములను డెవలప్ చేసి ఇస్తోంది. ఇందులో భాగంగా భూముల లెవలింగ్, లే అవుట్ నిర్మాణం, రోడ్లు, పవర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి సౌకర్యాలతో పడావ్ భూములను డెవలప్ చేయాల్సి ఉంటుంది. వేలంలో కొనుగోలు చేసుకునే భూములకు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్, మల్టీ పర్పస్ కోసం వాడుకునే వీలు కల్పిస్తోంది. దీంతో తక్కువ ధరకు భూములు దక్కించుకున్న బడా రియల్ కంపెనీలకు, అదనపు ఖర్చులైన కన్వర్షన్, అనుమతులు, రిజిస్ట్రేషన్ చార్జీలు లేకుండానే విలువైన భూములు దక్కుతున్నాయి. వాయిదా పద్ధతిలో చెల్లింపులువంటి సదుపాయాలతో ఫండింగ్ ఇబ్బందులు ఉండవు. ఇలా ఎటూ చూసినా.. వేలం వెనుక కొన్ని కంపెనీలకు భారీగా లబ్ధి చేకూరే సూచనలు కన్పిస్తున్నాయి. కోకాపేట్ భూముల విషయంలో ఇది పూర్తిగా స్పష్టం అయిందని కూడా పేర్కొంటున్నారు.   

‘మైహోం’  సంస్థలకే 17 ఎకరాలు
కోకాపేట్ భూముల వేలంలో మైహోం అనుబంధ సంస్థలైన మూడు కంపెనీలకే సుమారు 17.63 ఎకరాల భూమి దక్కింది. అలాగే ఓ జిల్లా కలెక్టర్ బంధువుకు చెందిన సంస్థ మరో10 ఎకరాలను దక్కించుకుంది. అయితే సామాన్యులు, చిన్న, మధ్య తరహా సంస్థలు కొనుగోలు చేయలేని విధంగా సాగిన వేలం విధానంపై అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన మూడు వేలాల్లోనూ సర్కార్ కు అంచనా మేరకు ఆదాయం రాలేదు. గతంలో ఉప్పల్ భగాయత్ వద్ద రింగు రోడ్డుకు దగ్గర్లో, ప్రైమ్ లోకేషన్ లో ఉండే భూములను అమ్మినా రూ. 1,800 కోట్లు రాలేదు. గతంలో కోకాపేట్ లో168 ఎకరాలను అమ్మినప్పుడు ఇతర రాష్ట్రాల కంపెనీలూ భూములు కొన్నాయి. ఈసారి కేవలం సిటీకి చెందిన కంపెనీలకు మాత్రమే భూములు దక్కడం వెనక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వమే లే అవుట్ రూపంలో భూములను అమ్మినా ఇంతకుమించి భారీగా ఆదాయం వచ్చేదని చెప్తున్నారు.