అసైన్డ్ భూములపై కన్నేసిన ప్రభుత్వం

అసైన్డ్ భూములపై కన్నేసిన ప్రభుత్వం

పారిశ్రామిక కారిడార్​ పేరిట అసైన్డ్ భూములకు ఎసరు

నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 1,500 ఎకరాల గుర్తింపు
చిట్యాల మండలం వెల్మినేడులో 62 ఎకరాల సేకరణ
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పేద, దళిత రైతులు

నల్గొండ, వెలుగు: నిరుపేద రైతులు, దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను పరిశ్రమల పేరిట ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాను పరిశ్రమల హబ్​గా మారుస్తామని ప్రకటించిన సర్కారు ఎప్పుడో 50, 60 ఏండ్ల కింద పేదలకు పంపిణీ చేసిన భూములతోపాటు, పట్టాదారు రైతుల నుంచి వేల ఎకరాలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ దాదాపు 1,528 ఎకరాలు గుర్తించింది. పలుచోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయగా, మిగిలిన ప్రాంతాల్లో భూముల స్వాధీనానికి ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. కాగా, నల్గొండ జిల్లాలో హైదరాబాద్-–విజయవాడ నేషనల్​ హైవేను ఆనుకొని ఉన్న గ్రామాల్లో చేపట్టిన భూసేకరణకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

పారిశ్రామిక కారిడార్ పేరుతో..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పారిశ్రామిక కారిడార్​ ఏర్పాటు పేరుతో నిరుపేద రైతులు, దళితులకు దశాబ్దాల క్రితం పంపిణీ చేసిన అసైన్డ్ ల్యాండ్స్, పట్టా భూములపై ప్రభుత్వం కన్నేసింది. ప్రధానంగా హైదరాబాద్-–విజయవాడ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న చౌటుప్పుల్, చిట్యాల, సూర్యాపేట, చివ్వెంల మండల్లాలో భూములు సేకరించే పనిలో పడింది. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే పలురకాల ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు వెదజల్లే హానికారక కెమికల్స్ తో  ఇప్పటికే సాగు, తాగునీరు కలుషితమై పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్లీ ఇప్పుడు కొత్తగా కాలుష్య రహిత కంపెనీల పేరుతో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు, ఫర్నిచర్ తయారీ పరిశ్రమలు నెలకొల్పడంతోపాటు, హైదరాబాద్ చర్లపల్లి సమీపంలోని దాదాపు 450 కాలుష్యరహిత కంపెనీలను నల్గొండ జిల్లాకు తరలించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

వెలిమినేడు రైతుల ఆందోళన

పరిశ్రమల వల్ల వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం చెప్తోంది. కానీ వాటికి అవసరమయ్యే భూములను పేదల నుంచి లాక్కోవడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని వేల ఎకరాల్లో భూములు ఉండగా, అసైన్డ్ భూములపై ప్రభుత్వం కన్నేయడం విమర్శలకు దారితీస్తోంది. చిట్యాల మండలం వెలిమినేడులో గ్రీన్ ఇండస్ట్రి యల్ పార్కు  ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం  62 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భూముల మీదనే దాదాపు 150 మంది దళిత, పేద రైతుల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఇవిగాక మరొక 161 ఎకరాలు పట్టా భూముల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూముల సేకరణ నిలుపుదల చేయాలని, పార్కు ఏర్పాటు చేయొద్దని వెలిమినేడు గ్రామ పంచాయతీ తీర్మానం కూడా చేసింది. అదేవిధంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు.

పెద్దల భూములు వదిలి..

నేషనల్ హైవేకు ఇరువైపులా వేల ఎకరాల్లో పెద్దల భూములు ఉండగా, పేద రైతుల భూములను బలవంతంగా లాక్కోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెలిమినేడు రైతులు చెబుతున్నదాని ప్రకారం  డేరా బాబాకు చెందిన 57 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. రాంకీ సంస్థకు చెందిన సుమారు 200 ఎకరాల భూమి వెలిమినేడు పంచాయతీ పరిధిలోనే ఉంది. దీంతోపాటు వివిధ రకాల సర్వే నంబర్లలో ఎవరికీ పట్టాలు ఇవ్వని ప్రభుత్వ భూమి సుమారు 170 ఎకరాల వరకు ఉంటుందని గ్రామస్థులు అంటున్నారు. వాటిని కాకుండా తమ భూములనే తీసుకోవడం వెనుక కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. హైవే వెంట సాగుకు పనికిరాని భూమి కూడా ఎకరాకు రూ .40 లక్షల వరకు పలుకుతోందని, అలాంటిది తమ భూములకు మాత్రం ఎకరాకు ఐదారు లక్షల పరిహారం చెల్లించాలనుకోవడాన్ని తప్పు పడుతున్నారు. తమకు అన్యాయం చేస్తే తెగించి పోరాడుతామని రైతులు స్పష్టం చేస్తున్నారు.

50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నం

1975లో నాకు పట్టా చేసి పాస్‍ బుక్‍ ఇచ్చారు. మొత్తం 4.50 ఎకరాల భూమి ఇప్పుడు ఇండస్ట్రియల్‍ పార్కు పేరుతో తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ భూమే నాకు ఆధారం. ఇది కూడా లాక్కుంటే బతికేదెట్లా. సాగు భూమిని కంపెనీలకు అప్పజెప్పడం సరైంది కాదు.

‑ ర్రూరి చంద్రయ్య,  దళిత రైతు, వెల్మినేడు

భూములు తీసుకుంటే అందరం రోడ్డున పడ్తం

సాగు భూమిని ఇండస్ట్రియల్‍ పార్కు పేరుతో లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సాగు భూములను మేం ఇచ్చేది లేదు. గ్రామంలో ఎంతోమంది ఆ భూములను సాగు చేసుకుని బతుకుతున్నరు. ఈ భూములను లాక్కుంటే అందరూ రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది.

‑ అర్రూరి పెంటయ్య,  రైతు, వెల్మినేడు

పట్టా భూమి తీసుకుంటున్రు

13 ఏళ్ల క్రితం రెండెకరాల భూమిని కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న. నాకున్న గొర్రెలను అక్కడే మేపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న. ఇప్పుడు ఇండస్ట్రియల్‍ పార్కు పేరుతో  పట్టా భూమిని తీసుకునేందుకు చూస్తున్నారు. అలా జరిగితే నాకు సెంటు భూమి కూడా ఉండదు. కుటుంబ పోషణకు సైతం ఇబ్బంది అవుతుంది.

‑ చిన్నాం రాజు, రైతు, వెల్మినేడు

For More News..

గ్రేటర్‌‌ జిల్లాలకు బీజేపీ కొత్త అధ్యక్షులు

పురుగుల మందు తాగించినా బతికిన కవలలు

పోలీసులు కేసు దర్యాప్తు చేస్తలేరని.. మృతుని బంధువులు