
- జేఏసీ నేతలతో డిప్యూటీ సీఎం భట్టి, శ్రీధర్ బాబు చర్చలు
- ఆందోళనలు వాయిదా వేస్తున్నట్టు జేఏసీ ప్రకటన
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల సమస్యలపై జేఏసీ నాయకులతో ప్రభుత్వం సమావేశమైంది. మంగళవారం సెక్రటేరియెట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణరావు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ సభ్యులు నవీన్ మిట్టల్, సందీప్ కుమార్ సుల్తానియా, కృష్ణభాస్కర్, రఘునందన్ రావు, లోకేశ్ కుమార్, క్రిస్టినా జెడ్ చోంగ్తూ వారితో 2 గంటల పాటు చర్చలు జరిపారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్చేస్తూ.. 205 సంఘాలతో కూడిన జేఏసీ దశల వారీ ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని గత నెలలో ప్రకటించింది.ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్ లో టీచర్లు, ఉద్యోగుల జేఏసీ ఆధ్యర్యంలో ఇందిరాపార్క్, ఆర్టీసీ కళా భవన్ లో కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో జేఏసీ నాయకులను డిప్యూటీ సీఎం భట్టి చర్చలకు పిలిచి ఉన్నతాధికారుల సమక్షంలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనలను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు జేఏసీ నేతలు అంగీకరించారు.
8న ఈహెచ్ఎస్ గైడ్ లైన్స్ రిలీజ్!
ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్)పై ఈ నెల 8న ఉద్యోగుల జేఏసీతో సమావేశం నిర్వహించి గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తామని సీఎస్ రామకృష్ణారావు హామీ ఇచ్చారని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ఏలూరి శ్రీనివాసరావు వెల్లడించారు. పెండింగ్ బిల్లులను నెలకు రూ.700 - కోట్లు ఇచ్చి వాటిని క్లియర్ చేస్తామన్నట్టు తెలిపారు. మంగళవారం నాంపల్లి టీజీవో భవన్ లో జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. గ్రామ పంచాయతీలను గ్రేడింగ్ చేసి క్యాడర్ స్టంట్ నిర్ణయించి, ప్రమోషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. సమావేశంలో జేఏసీ నేతలు సదానందం గౌడ్, మధుసూదన్ రెడ్డి, కృష్ణయాదవ్, వంగ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
సీపీఎస్ పై కమిటీ ఏర్పాటు చేయాలి
రాష్ట్రంలో సీపీఎస్ రద్దు కోసం ఆరు నెలల కాలపరిమితితో ఒక కమిటీని నియమించి, పాత పెన్షన్ పునరుద్ధరణకు అడుగులు వేయాలని సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ కోరారు. మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సీపీఎస్ఈయూ నేతలు కల్వల్ శ్రీకాంత్, నరేశ్ గౌడ్ తదితరులతో కలిసి వినతిపత్రం అందించారు.