ప్రభుత్వ జూనియర్ కాలేజీలపై సర్కారు నిర్లక్ష్యం

ప్రభుత్వ జూనియర్ కాలేజీలపై సర్కారు నిర్లక్ష్యం
  •     కాలేజీలు తెరిచి నెలన్నర గడిచినా గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకోలే 
  •     ఇంకా ప్రింటింగ్ దశలోనే ఉచిత పాఠ్య పుస్తకాలు.. ఈ ఏడాది తగ్గిన అడ్మిషన్లు  


హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యపై సర్కారు నజర్ కరువైంది. కాలేజీలు తెరిచి నెలన్నర అవుతున్నా.. ఇప్పటికీ గెస్ట్ లెక్చరర్లను తీసుకోలేదు. స్టూడెంట్లకు పాఠ్య పుస్తకాలూ ఇవ్వలేదు. దీని ప్రభావం సర్కారు కాలేజీల్లో అడ్మిషన్లపై పడింది. గతేడాదితో పోలిస్తే సగం అడ్మిషన్లు తగ్గాయి. ప్రస్తుతం టెన్త్ అడ్వాన్స్​డ్​ సప్లిమెంటరీలో పాసైన స్టూడెంట్లపైనే ఇంటర్ విద్యాశాఖ అధికారులు ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో 408 సర్కారు జూనియర్ కాలేజీలున్నాయి. 2023–24 విద్యా సంవత్సరం జూన్ ఫస్ట్ నుంచే ప్రారంభమైంది. దాదాపు నెలన్నర రోజులైనా ఇప్పటికీ ప్రభుత్వం కాలేజీల్లో సరైన సౌకర్యాలు కల్పించలేదు. రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల్లో పనిచేస్తున్న 1,654 మంది గెస్ట్ లెక్చరర్లను ఇప్పటికీ రెన్యువల్ చేయలేదు. అలాగే, కొత్తగా మంజూరు చేసిన కుత్బుల్లాపూర్, బీర్కూర్, నార్కట్ పల్లి తదితర కాలేజీలకు పోస్టులు కూడా శాంక్షన్ చేయలేదు. అధికారులు అకడమిక్​ఇయర్​ప్రారంభంలోనే గెస్టు లెక్చరర్లను తీసుకోవాల్సి ఉన్నా, ఈ మధ్యనే సర్కారుకు ప్రతిపాదనలు పంపించినట్టు తెలిసింది. దీనికి సర్కారు ఆమోదం తెలపాల్సి ఉంది. అప్పటివరకు స్టూడెంట్లకు పాఠాలు ఎవరు చెప్పాలనేదానిపై సర్కారు నుంచి స్పష్టత కరువైంది. 

సగం తగ్గిన విద్యార్థులు..

 గతేడాది సర్కారు జూనియర్ కాలేజీల్లో 1.10 లక్షల మంది అడ్మిషన్లు తీసుకున్నారు. చివరి వరకు 95 వేల మంది ఉన్నారు. ఈసారి ఇప్పటి వరకు కేవలం 55,840 మంది మాత్రమే అడ్మిషన్లు పొందారు. చాలా కాలేజీల్లో వందలోపే అడ్మిషన్లు అయ్యాయి. కొన్ని కాలేజీల్లో 20,30 వచ్చాయి. ఆరేడు జిల్లాల్లో  వెయ్యిలోపే అడ్మిషన్లు కాగా, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే 3వేల కంటే ఎక్కువ మంది చేరారు. టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు రావడంతో ఆ స్టూడెంట్లు ఈ కాలేజీల్లో చేరుతారని ఇంటర్ అధికారులు భావిస్తున్నారు. మరోపక్క చాలా కాలేజీల్లో లెక్చరర్లు లేక, పుస్తకాలు ఇయ్యక అడ్మిషన్లు క్యాన్సిల్ చేసుకుని, ప్రైవేటు కాలేజీలు, గురుకులాల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, గెస్ట్ లెక్చరర్లను రెన్యూవల్ చేయాలని, పుస్తకాలు ఇవ్వాలని స్టూడెంట్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. 

సమస్యలు పట్టని యూనియన్లు

కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లను తీసుకోకపోయినా, ఇప్పటికీ పుస్తకాలు ఇయ్యకపోయినా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్​లోని ఏ యూనియన్ స్పందించడం లేదు. రెగ్యులర్ లెక్చరర్ల సంఘాలతో పాటు కాంట్రాక్టు లెక్చరర్ల యూనియన్లు కూడా ఆ మాటే ఎత్తడం లేదు. ఎంతసేపు వారి సమస్యల కోసం ఆరాటం తప్పా, స్టూడెంట్ల బాగోగుల గురించి పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే, వారు ఇంటర్మీడియెట్ కమిషనర్ కు భయపడే నోరెత్తడం లేదని తెలుస్తున్నది. ఈ సమస్యలపై ప్రశ్నిస్తే మారుమూల ప్రాంతాలకు బదిలీలు చేస్తారనే భయం వారిలో నెలకొన్నట్టు సమాచారం.