వర్షాలు ఆగినా.. ఉప ఎన్నిక ముగిసినా షెడ్యూల్ రిలీజ్ చేయని సర్కార్​

వర్షాలు ఆగినా.. ఉప ఎన్నిక ముగిసినా షెడ్యూల్ రిలీజ్ చేయని సర్కార్​
  • మండలానికి 100 టీమ్​లు పంపుతామని జులైలో 
  • సీఎం కేసీఆర్​ ప్రకటన
  • వానల పేరు చెప్పి వాయిదా వేసి పట్టించుకోని ప్రభుత్వం
  • భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులు

హైదరాబాద్, వెలుగు: లక్షల్లో ఉన్న భూసమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా జులై 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఆ విషయమే మర్చిపోయారు. అప్పట్లో వర్షాల పేరు చెప్పి వాయిదా వేసిన సదస్సులకు నాలుగు నెలలైనా రివైజ్డ్ షెడ్యూల్ రిలీజ్ చేయడం లేదు. దీంతో గ్రామాల్లో వివిధ రకాల భూసమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఒక్కో మండల కేంద్రంలో 100 బృందాలు ఏర్పాటు చేసి, ఎమ్మెల్యేల నేతృత్వంలో సదస్సులు నిర్వహిస్తామని కూడా సీఎం ప్రకటించారు. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వానలు తగ్గుముఖం పట్టినా, వాతావరణం చక్కబడ్డా సదస్సుల గురించి పట్టించుకోలేదు. ఈ లోపు సీఎం, మంత్రులతో సహా ఎమ్మెల్యేలంతా అక్టోబర్ నెల మొత్తం మునుగోడు బై ఎలక్షన్ ప్రచారంలో మునిగిపోయారు. వారం రోజుల క్రితం ఎలక్షన్ హడావుడి కూడా ముగిసింది. ఇప్పటికైనా రెవెన్యూ సదస్సులు నిర్వహించాల్సిందిపోయి.. నిషేధిత భూముల జాబితా సవరణ పేరిట మరో కార్యక్రమానికి తెరలేపారు.   

ఊరికో 200 సమస్యలు.. 

సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో ధరణి పైలట్ విలేజ్ గా తీసుకున్న ఒక్క ములుగు గ్రామంలోనే 272 దరఖాస్తులు రాగా.. 132 దరఖాస్తులు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా అక్కడో సమస్య, ఇక్కడో సమస్య లేదని, ప్రతి ఊరిలో  200 నుంచి 300 భూసమస్యలు ఉన్నాయని ధరణి సమస్యలపై పని చేస్తున్న రెవెన్యూ, లీగల్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. భూమి సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో గ్రామంలో సదస్సులు నిర్వహిస్తే ప్రతి చోట 200కు తగ్గకుండా దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనం. మండల స్థాయిలో కాకుండా ప్రతి గ్రామంలో సదస్సులు నిర్వహిస్తే తప్ప.. సమస్యలు పరిష్కారం కావని వారు చెప్తున్నారు. ఇలా గ్రామ స్థాయిలో అప్లికేషన్లు తీసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షలకు పైగా వచ్చే అవకాశముంది. ఇప్పటికే 8.13  లక్షల సాదాబైనామా దరఖాస్తులు, 3.4 లక్షల పోడు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. పట్టాదారు పాస్ బుక్స్, ఆర్వోఆర్ యాక్ట్ – 1971 ప్రకారమే వీటిని పరిష్కరించాల్సి ఉంది. అయితే అంతకుముందే  సెప్టెంబర్ నెలలో తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్  యాక్ట్ – 2020 అమల్లోకి రావడంతో.. పరిష్కారానికి అవకాశం లేకుండాపోయింది. హైకోర్టు కూడా ఇదే అభ్యంతరం వ్యక్తం చేయడంతో క్రమబద్ధీకరణకు బ్రేక్ పడింది. ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టంలో సవరణలు చేస్తే తప్ప సాదాబైనామా అప్లికేషన్లకు మోక్షం కలిగేలా లేదు. ఏడాదిన్నర దాటినా ప్రభుత్వం ఆర్డినెన్స్ కాని, చట్ట సవరణగాని చేయడం లేదు. 

క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలు.. 

భూరికార్డుల ప్రక్షాళనలో జరిగిన తప్పిదాలను సవరించుకోవడం, మిస్సింగ్ సర్వే నంబర్లు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులను సరిదిద్దడం, రికార్డుల్లో తప్పులు, భూమి స్వభావంలో దొర్లిన తప్పులు, ప్రొహిబిటెడ్ లిస్టులో తప్పుగా చేర్చడం,  భూమి ఉన్నా అసలు పాస్ బుక్స్ రాకపోవడం, మ్యుటేషన్ పెండింగ్ లో ఉన్న భూములకు పాత యజమానికే పాస్ బుక్స్ జారీ చేయడం, ఇళ్ల ప్లాట్లు ఉన్న భూములకు పాస్ బుక్స్ జారీ చేయడంలాంటి అనేక సమస్యలకు ధరణి పరిష్కారం చూపలేదు. మాజీ సైనికులు, ఫ్రీడం ఫైటర్ల కు ఇచ్చిన అసైన్డ్ భూములు కూడా ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చారు. తమ భూములను ఈ జాబితా నుంచి తీసేయాలని ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా కలెక్టర్లు రిజెక్ట్ చేస్తున్నారు.

రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి..

ధరణి తెచ్చిన అనేక సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నరు. ఒక్కో రెవెన్యూ గ్రామంలో 250 కి పైగా భూసమస్యలు ఉన్నాయి. ధరణి పోర్టల్ అమల్లోకి  వచ్చాక అసలు భూసమస్యలే లేవని బుకాయించారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో చేపట్టిన పైలట్ విలేజ్ ములుగులోనే ఈ విషయం సీఎం, సీఎస్ సహా మంత్రులు, అధికారులందరికీ తెలిసొచ్చింది. అందుకే దిద్దుబాటు చర్యల కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత వర్షాల సాకుతో వాయిదా వేశారు. ఇప్పటికైనా రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ ప్రకటించి, గ్రామ స్థాయిలో నిర్వహించాలి.

- మన్నె నర్సింహారెడ్డి, కన్వీనర్, ధరణి సమస్యల వేదిక