సర్కారీ ఆఫీసుల తరీఖా ఇదీ

సర్కారీ ఆఫీసుల తరీఖా ఇదీ

గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసులు నడిపిస్తున్నారు. నాంపల్లిలోని  హౌసింగ్ బోర్డుకు చెందిన ఈ గగన్​ విహార్​  టవర్స్​లో వేలాది  చదరపు అడుగుల ఏరియా అందుబాటులో ఉంది. ఇవి ఖాళీగా ఉండడం వల్ల హౌసింగ్ బోర్డుకు ప్రతి నెలా లక్షల రూపాయల్లో రెంట్​ లాస్‌‌ అవుతోంది.

అన్ని సౌలతులతో గవర్నమెంట్​ బిల్డింగ్స్​ ఖాళీగా ఉన్నా.. వాటిని కాదని కొన్ని ప్రభుత్వ ఆఫీసులు ప్రైవేటు బిల్డింగ్స్​లోనే  కొనసాగుతున్నాయి. కిరాయిల రూపంలో లక్షలకు లక్షలు ‘ప్రైవేటు’కు ముట్జజెప్తున్నాయి. ఖాళీగా ఉండటంతో గవర్నమెంట్​ బిల్డింగ్స్​ పెద్ద మొత్తంలో కిరాయి ఆదాయాన్ని కోల్పోతున్నాయి. ప్రైవేటు కాంప్లెక్స్​లతో పోలిస్తే గవర్నమెంట్​ కమర్షియల్​ కాంప్లెక్స్​లలో కిరాయి చాలా తక్కువ. అయినా గవర్నమెంట్​ బిల్డింగ్స్​లో, కాంప్లెక్స్​లలో ఉండేందుకు ప్రభుత్వ ఆఫీసుల బాసులు ఇష్టపడడం లేదు.

హైదరాబాద్‌‌ , వెలుగుహైదరాబాద్‌‌ సిటీ నడిబొడ్డున నాంపల్లి మెయిన్‌‌ రోడ్డును ఆనుకొని ఉన్న.. హౌసింగ్‌‌ బోర్డు బిల్డింగ్‌‌లు(ప్రభుత్వ బిల్డింగ్​లు)  ఖాళీగా వెలవెలబోతున్నాయి. దానికి సమీపంలో ఓ బడా పారిశ్రామికవేత్తకు చెందిన ప్రైవేటు బిల్డింగ్‌‌లో గవర్నమెంట్‌‌ ఆఫీసులు కిరాయికి ఉంటున్నాయి. ఎక్కువ రెంట్‌‌ చెల్లించి, ప్రైవేటులో ఉండేందుకు మొగ్గుచూపుతున్న ఆఫీసర్లు.. తక్కువ రెంట్​ ఉండే హౌసింగ్‌‌ బోర్డు బిల్డింగ్‌‌ల వైపు చూడటం లేదు. మొన్నటి వరకు ఈ గవర్నమెంట్​ బిల్డింగ్స్​లో ఏపీ గవర్నమెంట్‌‌ ఆఫీసులున్నాయి. ఆఫీసుకు అవసరమైన అన్ని వసతులు, పార్కింగ్‌‌ ఫెసిలిటీలతోపాటు అందరికీ అందుబాటులో ఈ బిల్డింగ్స్​ ఉన్నాయి. ఇంత ఉన్నా.. వీటిలో ప్రభుత్వ ఆఫీసులను ఏర్పాటు చేయకుండా అడ్డగోలు అద్దెలు ప్రైవేటుకు చెల్లించి ఖజానాకు గండికొడుతున్నారు. ఇన్‌‌ డైరెక్టుగా ప్రైవేటు బాబులకు భారీగా ముట్టజెప్తున్నారు. సెక్రటేరియట్‌‌ ఖాళీ చేసిన తర్వాత హైదరాబాద్‌‌లో మినిస్టర్ల, సెక్రెటరీల, కమిషనర్, డైరెక్టరేట్‌‌ ఆఫీసులన్నీ చెల్లాచెదురయ్యాయి. ఎవరికి తోచిన చోట వాళ్లు.. తమ ఆఫీసులను సర్దుకున్నారు.

2 లక్షల చ.అ. స్పేస్​  ఖాళీగా ఉన్నా..

హౌసింగ్‌‌ బోర్డుకు నాంపల్లి, కూకట్‌‌ పల్లిలో భారీ ఎత్తున కమర్షియల్‌‌ కాంప్లెక్స్‌‌ లు ఉన్నాయి. వీటిలో నాంపల్లిలో గృహకల్ప, గగన్‌‌ విహార్‌‌ , చంద్రవిహార్‌‌ , తుల్జాగూడ భవన్‌‌ , మనో రంజన్‌‌ కాంప్లెక్స్‌‌ లు ఉన్నాయి. కొన్నాళ్ల కిందటి దాకా ఇవి చాలా వరకు ఫుల్‌‌గా ఉన్నాయి. ఇక్కడి ఏపీ గవర్నమెంట్‌‌ ఆఫీసులను అమరావతికి షిఫ్ట్‌‌ చేసిన తర్వాత ఈ బిల్డింగ్‌‌ల్లో చాలా ఫ్లోర్‌‌లు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం 2.15 లక్షల చదరపు అడుగుల ఏరియా ఖాళీగా ఉంది. ఇలా ఖాళీగా ఉండటంతో  ప్రతి నెలా హౌజింగ్‌‌ బోర్డు భారీగా ఆదాయం కోల్పోతోంది.

ప్రైవేటుకు భారీ రెంట్‌‌

హౌసింగ్​ బోర్డులాంటి చాలా ప్రభుత్వ బిల్డింగ్స్​ ఖాళీగా ఉన్నా.. వాటిని కాదని రివర్స్‌‌గా  ప్రైవేటు బిల్డింగ్స్​కు పెద్ద మొత్తంలో కిరాయిలు కట్టి ఉండేందుకు పలు ప్రభత్వ శాఖలు పోటీ పడుతున్నాయి.  నిరుడు రూరల్‌‌ డెవెలప్‌‌మెంట్‌‌కు చెందిన రెండు ఆఫీసులు అసెంబ్లీ ఎదురుగా ఉన్న హెర్మిటేజ్‌‌ బిల్డింగ్‌‌లో కొనసాగాయి. సెక్రటేరియట్‌‌ ఖాళీ చేసే సమయంలో ఏపీ ప్రభుత్వం హైదరాబాద్‌‌ లో కొన్ని బిల్డింగ్స్​ కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో హెర్మిటేజ్‌‌ బిల్డింగ్​ను ఏపీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. అందులో ఉన్న రాష్ట్ర గవర్నమెంట్‌‌ ఆఫీసులను ఖాళీ చేశారు.  ఆ టైమ్​లో ఇతర చోట్ల ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నప్పటికీ..  అవి బాలేవనే సాకుతో రూరల్​ డెవలప్​మెంట్​ శాఖకు చెందిన రెండు ఆఫీసులు చేరలేదు. సెక్రటేరియెట్‌‌కు దగ్గరిలో ఓ బడా నేత బంధువుకు చెందిన కమర్షియల్‌‌ కాంప్లెక్స్‌‌కు ఆ రెండు ఆఫీసులు షిఫ్ట్​ అయ్యాయి. దీంతో అక్కడ భారీ మొత్తంలో రెంట్‌‌ కడుతున్నట్లు అధికారులు అంగీకరిస్తున్నారు. వీటికి తోడు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌‌ జిల్లాలకు చెందిన దాదాపు పన్నెండు శాఖలకు చెందిన 26 ఆఫీసులు ప్రైవేటుకు అద్దెకుంటున్నాయి.

కిరాయిలు తక్కువే

ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు చెందిన కమర్షియల్‌‌ కాంప్లెక్స్‌‌ లతో పోలిస్తే ప్రభుత్వ కమర్షియల్‌‌ కాంప్లెక్స్‌‌ లో కిరాయిలు చాలా తక్కువ. కానీ ఏకంగా ప్రభుత్వ శాఖలు ప్రైవేటు కాంప్లెక్స్‌‌లకు తరలిపోవటంతో.. హౌసింగ్‌‌ బోర్డు ఏటా కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతోంది. అదే సమయంలో ప్రైవేటుకు భారీ అద్దె చెల్లించాల్సి రావటంతో రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతోంది. బోర్డు బిల్డింగ్‌‌ లన్నింటా ఒక్కో స్క్వేర్‌‌ ఫీట్‌‌ రూ. 30 నుంచి రూ. 35 అద్దె ఉండగా.. ప్రైవేట్‌‌ కాంప్లెక్స్‌‌లో  రూ. 45 నుంచి రూ. 50 ఉంటోందని ఆఫీసర్లు అంగీకరిస్తున్నారు. ‘గ్రేటర్‌‌ సిటీలోని ప్రధాన లొకేషన్లలో హౌసింగ్‌‌ బోర్డు బిల్డింగ్‌‌లున్నాయి. వీటిలో దాదాపు  2.10 లక్షల చదరపు అడుగుల స్పేస్‌‌ ఖాళీగా ఉంది. ఈ స్పేస్‌‌ ఖాళీగా ఉండటం వల్ల ప్రతి నెల రూ. 60 లక్షల అద్దె కోల్పోతున్నాం. ప్రైవేట్‌‌ కాంప్లెక్స్‌‌ల లో కంటే ప్రభుత్వ ఆఫీసుల్లో కిరాయి తక్కువే. ఖాళీగా ఉన్న ఫ్లోర్లన్నీ పటిష్టంగా అన్ని హంగులతో కార్పొరేట్‌‌ ఆఫీసులకు తీసిపోకుండా ఉన్నాయి. వీటిలో ఆఫీసులు నిర్వహిస్తే తక్కువ రెంట్‌‌తో  ప్రభుత్వానికి బెనిఫిట్. కానీ కొన్ని డిపార్టుమెంట్‌‌లు పట్టించుకోవటం లేదు’ అని హౌసింగ్‌‌ బోర్డుకు చెందిన ఓ అధికారి అభిప్రాయపడ్డారు. ఇక రవాణా శాఖకు చెందిన హైదరాబాద్ లోని ఆర్టీఏ ఆఫీసులు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్నాయి. మలక్ పేట , టోలీచౌకి, కొండాపూర్ ఆర్టీఏ ఆఫీసులు ప్రతి నెల లక్షల రూపాయలు కిరాయి చెల్లిస్తూ ప్రైవేట్ బిల్డింగ్స్​​లో పనిచేస్తున్నాయి.

హెచ్​ఎండీఏ, జీహెచ్​ఎంసీ బిల్డింగ్స్​లూ ఖాళీ

హౌసింగ్ బోర్డు డిపార్ట్ మెంట్ కు చెందిన భవనాలే కాక హైదరాబాద్​, సికింద్రాబాద్​లో హెచ్ ఎండీఏ, జీహెచ్ ఎంసీ బిల్డింగ్స్​లోనూ లక్షల చదరపు అడు గుల విస్తీర్ణం ఖాళీగా ఉంది. ఇవి ఖాళీగా ఉండటం వల్ల ప్రతి నెలా కోట్ల రూపాయల అద్దె ఆదాయం రావడం లేదు. జీహెచ్ ఎంసీకి సికింద్రాబాద్ ప్యారడైజ్ సమీపంలో స్వప్నలోక్ , చంద్రలోక్ కమర్షియల్ కాంప్లెక్స్ లు ఉన్నాయి. వీటిలో పలు సాఫ్ట్ వేర్ కోచింగ్ సెంటర్లు ఉండగా.. చాలా వరకు స్పేస్ ఖాళీగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక హెచ్ ఎండీఏ కి అమీర్ పేటలో మైత్రివనం, మైత్రి విహార్ , స్వర్ణజయంతి కాంప్లెక్స్ లలో చాలా స్పేస్ ఖాళీగా ఉంది.

నాలుగేండ్లుగా ప్రైవేటు బిల్డింగ్స్లో కలెక్టరేట్లు

రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్ లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అయితే తాత్కాలికంగా కొత్త జిల్లాల్లో కొన్ని చోట్ల ప్రైవేటు, మరి కొన్ని చోట్ల ప్రభుత్వ భవనాల్లో కలెక్టరేట్లను మంత్రులు ప్రారంభించారు. నాలుగేండ్లవుతున్నా కొత్త కలెక్టరేట్​ బిల్డింగ్స్​ పనులు ఇంకా పూర్తికాలేదు. దీంతో నాలుగేండ్ల నుంచి ప్రైవేట్ భవనాల్లో కలెక్టరేట్లు కొనసాగాల్సి వస్తోంది. ప్రైవేటు బిల్డింగ్స్​కు కిరాయిల రూపంలో కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు తమ సన్నిహితులకు, అనుచరులకు చెందిన ప్రైవేట్ బిల్డింగ్స్​లో  కలెక్టరేట్లు ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వానికి అధిక ఆదాయం తెచ్చే రిజిస్ట్రేషన్ ఆఫీసులు రాష్ట్ర వ్యాప్తంగా చాలాచోట్ల ప్రైవేట్ బిల్డింగ్స్​లోనే  కొనసాగుతున్నాయి. సొంత భవనాలు కట్టాలని ఎంతో కాలంగా ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి.

see also: పిల్లి కాదు.. పులి