దేశమంతా సౌర వెలుగులు .. పీఎం సూర్యఘర్​ పథకం ప్రారంభం

దేశమంతా సౌర వెలుగులు .. పీఎం సూర్యఘర్​ పథకం ప్రారంభం
  • ప్రతి ఇంటిపైనా సోలార్​ ప్యానెల్ 
  • కోటి కుటుంబాలకు ఉచిత కరెంటు
  • రూ.75 వేల కోట్ల పెట్టుబడి

న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన రూఫ్‌టాప్ సోలార్ పథకాన్ని ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ప్రారంభించింది. దీని పేరును పీఎం సూర్య ఘర్: ముఫ్త్​ బిజిలీ’ యోజనగా నిర్ణయించింది. ఇందుకోసం రూ.75 వేల కోట్లు పెట్టుబడి పెడతారు. ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్​’లో ప్రకటించారు.

ఈ పథకం వల్ల కోటి కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత కరెంట్​ను అందిస్తామని హామీ ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉచిత కరెంట్​పై దృష్టి సారిస్తోంది. ఈ పథకాన్ని అట్టడుగు స్థాయిలో అమలు చేసేందుకు స్థానిక సంస్థలు,  పంచాయతీలు తమ పరిధిలో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తారు. సూర్య ఘర్ వల్ల జనానికి ఆదాయం రావడమేగాక కరెంటు బిల్లు భారం తప్పుతుంది.  

ఈ నెల ఒకటో తేదీన మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కొత్త పథకం కోటి మంది లబ్ధిదారులు రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌ల ద్వారా 300 యూనిట్ల ఉచిత కరెంట్​ను పొందగలరని ప్రకటించారు. ఫలితంగా వార్షికంగా రూ.18 వేల వరకు ఆదా అవుతుందని చెప్పారు. -కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ మాట్లాడుతూ.. రూఫ్‌టాప్‌ సోలార్‌ కోసం ప్రభుత్వం రూ.10 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించిందని తెలిపారు.

Also Read : రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ!

ఈ నెల 2న కేంద్ర నూతన  పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్.కె. సింగ్​ మాట్లాడుతూ కొత్త పథకం కింద రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌లకు సబ్సిడీని 40శాతం నుంచి 60శాతంకి పెంచినట్లు చెప్పారు.  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు  ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ప్రత్యేక సంస్థల) ద్వారా ఈ పథకం అమలవుతుంది. ఈ విధానంలో ప్రజలు ఇంటిపై సోలార్​రూఫ్​టాప్​ను ఏర్పాటు చేసుకొని ఆదాయం పొందడానికి pmsuryaghar.gov.in వెబ్​సైట్​లో రిజిస్టర్​ చేసుకోవచ్చు.